చేసిన పనులే.. పట్టం కట్టాయి! - Seven Women Cabinet Ministers and their background
close
Updated : 09/07/2021 14:28 IST

చేసిన పనులే.. పట్టం కట్టాయి!

ప్రశ్నించే గొంతుక వీళ్ల బలం... ఉన్నత చదువులు అదనపు శక్తి! సామాజిక సమస్యలపై పోరాడుతూ... స్త్రీసాధికారిత దిశగా చైతన్యాన్ని రగిలిస్తూ 
చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్లు వీరంతా. ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత... కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ఏడుగురిదీ ఒక్కో నేపథ్యం.. ఒక్కో స్ఫూర్తి ప్రస్థానం.

ఇందిర తర్వాత తనే: దర్శన విక్రమ్‌ జర్దోష్‌

గుజరాత్‌లోని సూరత్‌ నుంచి మూడోసారి ఎంపీగా ఎంపికయ్యారు. 60 ఏళ్ల దర్శన వృత్తి వ్యాపారం. ఎకనామిక్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌లో బీకాం చదివారు. రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం. భాజపా వార్డ్‌ కమిటీ ఉపాధ్యక్షురాలిగా తొలి అడుగు. లోక్‌సభకు మొదటిసారి 2009లో ఎంపికయ్యారు. 2014 ఎన్నికల్లో 76% ఓట్లు సాధించి ఇందిరాగాంధీ తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన మహిళగా నిలిచారు. ఎన్నో మహిళా సాధికారత కమిటీల్లో సభ్యురాలు. గుజరాత్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ సభ్యురాలు కూడా. బాలికా విద్య, మహిళా సాధికారత కోసం ‘సంస్కృతి’ అనే సంస్థను స్థాపించారు. భరతనాట్య కళాకారిణి కూడా!


సామాజిక సమస్యలపై పోరు: అనుప్రియ

ఉత్తర్‌ప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల గొంతుకగా చెప్పుకొనే అప్నాదళ్‌ పార్టీ స్థాపకుడు డాక్టర్‌ సోనేలాల్‌ పటేల్‌ కుమార్తె అనుప్రియ. ఆయన నలుగురు కుమార్తెల్లో ఒకరైన అనుప్రియ అద్భుతమైన వక్త. సైకాలజీలో పీజీ, ఎంబీయే చేసిన ఆమె చదువుకుంటూనే... తండ్రి రాజకీయ వారసత్వాన్నీ అందిపుచ్చుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మీర్జాపూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికవుతున్నారు. మోదీ తొలి కేబినెట్‌లోనూ స్థానాన్ని సాధించుకున్న అను సామాజిక సమస్యలపై తన గొంతుకని బలంగా వినిపిస్తూ వచ్చారు. సమస్యల పరిష్కారం కోసం రాజీపడని తీరే మళ్లీ అవకాశాన్ని తెచ్చిపెట్టింది.


త్రిపుర దీదీ: ప్రతిమా భౌమిక్‌

త్రిపుర నుంచి కేంద్ర కేబినెట్‌కు ఎంపికైన తొలి మహిళ. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎంపికైన రెండో మహిళ. సామాన్యంగా కనిపించే ప్రతిమకు గొప్ప నాయకురాలని పేరు. అక్కడి ప్రజలకు ‘దీదీ’. ‘పని రాక్షసి’గా చెప్పుకొంటారు. 52 ఏళ్ల ఈమెది వ్యవసాయ కుటుంబం. తొంభైల్లో త్రిపురలో భాజపా ఆనవాళ్లే లేవు. వామపక్షాలదే హవా. కేంద్రంలో కాంగ్రెస్‌ పాలన. ఆ సమయంలో ప్రతిమ భాజపా యువ మోర్చాలో చేరారు. ఎన్ని ఒడుదొడుకులొచ్చినా పార్టీని వదల్లేదు. త్రిపురలో పార్టీ విజయంలో తన పాత్ర చాలా కీలకం. 2014లో మూడు లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఈమె గ్రామంలో 80% మంది ముస్లింలే. గ్రామానికి 300 మీటర్ల దూరంలో భారత్‌ - బంగ్లా సరిహద్దు ఉంది. దానికి అవతలివైపు రైతుల పొలాలుండేవి. వాళ్లకి ఐడీ కార్డులు ఇప్పించి, అక్కడికి వెళ్లి పని చేసుకునే వీలు కల్పించారు. మతంతో సంబంధం లేకుండా అడిగిన వారికి లేదనకుండా సాయం చేయడం తన నైజం. తాజాగా మంత్రిగా మొదటి నెల జీతాన్నీ అసోం వరద బాధితుల సహాయ నిధికి అందజేశారు.


ఉత్తమ పార్లమెంటేరియన్‌: డా.భారతీ పవార్‌

ఎంబీబీఎస్‌ చదివి వైద్యురాలిగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె మామగారు ఏటీ పవార్‌ ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే. రాష్ట్ర మంత్రిగానూ చేశారు. భారతి జడ్పీ సభ్యురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 42 ఏళ్ల భారతి మహిళలు, పిల్లల్లో పోషకాహార లోప నివారణకు, నాసిక్‌లో స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఎనలేని కృషి చేశారు. 2019లో మహారాష్ట్రలోని డిండోరా నుంచి ఎంపీగా గెలిచారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా చేశారు. చురుకైన పని తీరుతో అదే ఏడాది డిసెంబరులో ‘ఉత్తమ పార్లమెంటేరియన్‌’ పురస్కారాన్నీ అందుకున్నారు.


పిన్న వయసులోనే: అన్నపూర్ణాదేవి యాదవ్‌

బిహార్‌కు చెందిన 51 ఏళ్ల అన్నపూర్ణాదేవి, కొడర్మా ఎంపీ. దుముకాలో స్థిరపడిన బెంగాలీ కుటుంబంలో పుట్టిన ఈమె, ఎంఏ చేశారు. ఆర్‌జేడీ ఎమ్మెల్యేగా ఉండే భర్త రమేష్‌ యాదవ్‌ మృతితో రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ తరఫున గెలిచి మంత్రిగా పని చేశారు. అప్పటికి తనకు 30 ఏళ్లు. తర్వాత నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్‌ విభజన తర్వాత 2013లో ఝార్ఖండ్‌లో మంత్రిగా చేశారు. సామాజిక సేవకురాలిగా పేదల కోసం కృషి చేసి పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు భాజపాలో చేరారు.


పార్టీకే అంకితం : శోభ కరంద్లాజేె

కర్ణాటక భాజపా ఉపాధ్యక్షురాలు. దక్షిణ కర్ణాటకలోని పుత్తూరులో పుట్టిన ఆమె, చిన్నతనంలోనే ఆరెస్సెస్‌లో చేరారు. దానికే జీవితం అంకితమని, ఇందుకోసం తాను పెళ్లే చేసుకోనని ప్రమాణం చేశారు. సోషియాలజీలో ఎమ్మే  చేశారామె. 1994లో శోభ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప మంత్రిగా నియమించడంతో శోభ కరంద్లాజే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. హిందుత్వ ఆలోచనలను బలంగా వ్యాప్తి చేయడంలో శోభకు పెట్టింది పేరు.


బలమైన గొంతుక : మీనాక్షీ లేఖీ

దిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సీఏఏపై పార్లమెంట్‌లో లేఖీ స్పందించిన తీరు ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె లా చదివారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తూనే పలు ఎన్జీవోలకు న్యాయ సేవలు అందిస్తుంటారు. గృహహింస, కుటుంబ వివాదాలు... ముఖ్యంగా దేశ సైనిక దళాలలో పనిచేసే మహిళల పర్మనెంట్‌ కమిషనింగ్‌ కేసుల్లో లేఖీ బలంగా వాదించారు. మహిళా రిజర్వేషన్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల బిల్లుల ముసాయిదా తయారీ కమిటీల్లో ఆమె కీలకంగా పనిచేశారు. జాతీయ మహిళా కమిషన్‌తో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కో-ఆపరేషన్, చైల్డ్‌ డెవలప్‌మెంట్, డబ్ల్యూటీ¨ఐ, సీఎస్‌ఆర్‌లతో కలిసి మహిళలు, పిల్లల హక్కుల కోసం కృషిచేశారు. సంఘ్‌ పరివార్‌ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్‌ మంచ్‌లో పని చేశారు. నితిన్‌ గడ్కరీ భాజపా అధ్యక్షుడైన తర్వాత మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా మీనాక్షీని ఆహ్వానించారు. అతి చురుకైన ఎంపీల్లో ఒకరు. న్యాయ వ్యవహారాల్లో పట్టు, కలసిపోగలగడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతే ఆమెను బలమైన నాయకురాలిని చేశాయి.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని