ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..! - all you need to know about workplace burnout in telugu
close
Updated : 22/06/2021 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

రాగిణికి ఆఫీస్‌లో మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా సమయం దొరకదు. ఇక వాళ్ల బాస్‌ సెలవులో ఉన్నప్పుడు అదనపు పని భారం ఆమెపై పడుతోంది. దీంతో ఓపిక నశించి ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడి, కోపానికి లోనవుతుంటుంది.

మాలిని ఓ కంపెనీలో టీమ్‌ లీడర్‌. ఇటు తన పనిని, అటు తన బృందాన్ని మేనేజ్‌ చేసే క్రమంలో విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంటుంది. ఒక్కోసారి దీన్ని అదుపు చేసుకోలేక సహోద్యోగులపై విరుచుకుపడుతుంటుంది.

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..
పనిలో సంతోషం, సంతృప్తి ఉన్నప్పుడే దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం.. అదే రోజూ విపరీతమైన ఒత్తిడితో పని ప్రదేశంలోకి అడుగుపెడితే కెరీర్‌లో ఒక రకమైన నిర్లిప్తత, నిరాసక్తత ఆవహిస్తుంది. మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు ఇలాంటి ఒత్తిడితోనే (వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌) పనిచేస్తున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. పని ప్రదేశంలో తలెత్తే ఈ దీర్ఘకాలిక ఒత్తిడికి వివిధ రకాల కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

ఒక్కొక్కరిలో ఒక్కోలా..!

పని ప్రదేశంలో ఎదురయ్యే ఈ దీర్ఘకాలిక ఒత్తిడికి గల కారణాలు ఉద్యోగులందరిలో ఒకేలా ఉండచ్చు.. ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* ఆఫీస్‌ పని అన్నివేళలా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు.. అలాగే రోజురోజుకీ పనులు, బాధ్యతలు పెరుగుతుంటాయి. ఈ క్రమంలో రోజువారీ పనులు పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకోలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోయినప్పుడు పని భారమవుతుంది. ఇది క్రమంగా దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుంది.

* మీరు నిర్దేశించుకున్న లక్ష్యం/పనిని పూర్తి చేస్తామో లేదో అన్న సందిగ్ధం నెలకొన్నప్పుడు పనిపై ఏకాగ్రత క్రమంగా సన్నగిల్లుతుంది. వర్క్‌ప్లేస్ బర్నవుట్‌కి ఇదీ ఓ కారణమే!

* ఉద్యోగుల మధ్య, ఉద్యోగులు-పై అధికారుల మధ్య పని విషయంలో పరస్పర అవగాహన ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి. అదే తమ నుంచి తమ బాస్‌/పైఅధికారులు ఎలాంటి పనితనాన్ని ఆశిస్తున్నారో సంపూర్ణ అవగాహన కొరవడినప్పుడు మాత్రం పనిప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందేనట!

* పనిలో పోటీతత్వం మంచిదే కానీ.. ఈ క్రమంలో సహోద్యోగుల మధ్యలో తలెత్తే ఈర్ష్యాద్వేషాలు పని వాతావరణాన్నే దెబ్బతీస్తాయి.. దీంతో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, మన గురించి బాస్‌కు నెగెటివ్‌గా చెప్పడం.. వంటివి జరుగుతాయి. ఇలాంటివి భరించలేక ఒక్కోసారి విపరీతమైన ఒత్తిడికి లోనై ఆ కోపాన్ని ఇతరులపై చూపించే ప్రమాదం ఉంది.

* ఇటు ఇంటి పనిని, అటు ఆఫీస్‌ పనుల్ని సమన్వయం చేసుకోలేక చాలామంది మహిళలు ఒత్తిడికి గురవుతుంటారు. తమ శక్తినంతా ఈ పనులకే వెచ్చించి తమకంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవడమే మర్చిపోతుంటారు. ఇదీ పని ప్రదేశంలో దీర్ఘకాలిక ఒత్తిడికి దారి తీస్తుందట!

* అదనపు పని భారం కూడా వర్క్‌ప్లేస్‌ బర్నవుట్‌కు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో తలకు మించిన పని భారాన్ని నెత్తిన వేసుకోవడం, అన్ని పనులు నేనే చేస్తానన్న అతివిశ్వాసం శారీరకంగా, మానసికంగా ఒత్తిడిని పెంచుతాయి. తద్వారా పనిలో నాణ్యత సైతం తగ్గిపోతుంది.

 

ఎలాంటి సమస్యలొస్తాయంటే..!

మనలో చాలామంది ఒత్తిడి, ఆందోళనల్ని చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. నిజానికి ఇవి శారీరకంగా, మానసికంగానే కాదు.. కెరీర్ పైనా నెగెటివ్‌ ప్రభావం పడేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

* అధిక ఒత్తిడి కారణంగా విపరీతమైన అలసట, బీపీ, శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, టైప్‌-2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇంకొంతమందిలో అయితే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.

* ఒత్తిడి మితిమీరితే డిప్రెషన్‌, కోపం, యాంగ్జైటీ, మనపై మనకే అసహ్యం కలగడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి వీటి నుంచి బయటపడడానికి మందులు వాడడం, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమూ ఏర్పడచ్చు.

* ఈ మానసిక సమస్య మనల్ని ఒంటరిగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. నెరవేర్చాల్సిన బాధ్యతల నుంచి దూరం జరగడం, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. వంటి చెడు అలవాట్లను క్రమంగా దగ్గర చేస్తుంది.

* ఇక ఇలాంటి ఒత్తిడితో అసలు పనిచేయలేం.. ఒకవేళ చేసినా ఆ పనిలో అస్సలు సంతృప్తి ఉండదు. ఎప్పుడెప్పుడు ఆ కంపెనీలో నుంచి బయటపడదామా? సహోద్యోగుల నుంచి దూరమవుదామా? అన్న ఆలోచనలోనే ఉండిపోతారు. ఒక రకంగా ఇది మన కెరీర్‌ని దెబ్బతీసినట్లే!

 

ఇలా బయటపడచ్చు!

పని ప్రదేశంలో ఎదురయ్యే ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఉద్యోగులు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.

* కెరీర్‌లో దూసుకుపోవాలంటే మనలోని నైపుణ్యాలు, సామర్థ్యమే మనకు బలం. అందుకే వాటిపై నమ్మకముంచాలి. ఈ క్రమంలో మనలో ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి దరి చేరకుండా జాగ్రత్తపడచ్చు.

* మీరు చేస్తోన్న ఉద్యోగంలో మీకు సంతృప్తి ఉందా? లేదా? అన్న విషయం గ్రహించడమూ ముఖ్యమే! ఒకవేళ మీ లక్ష్యం అది కాదు అనుకుంటే.. మీ అంతిమ లక్ష్యమేదో దానిపై దృష్టి సారించాలి.. ఈ దిశగా ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

* ఎంత బిజీగా ఉన్నా ఎవరికి వారు కాస్త సమయం కేటాయించుకోవాలి. అప్పుడే ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించి నాణ్యమైన ఉత్పాదకతను సంస్థకు అందించచ్చు.

* కొంతమంది దినదిన గండంగా వర్క్‌లోకి వెళ్తుంటారు. బాస్‌ ఎప్పుడు ఏ పని చెబుతారో, దాన్ని నేను చేయగలుగుతానో లేదోనని భయపడుతుంటారు. అలాంటి వారికి క్షణక్షణం నరకమే అని చెప్పచ్చు. మరి, ఈ పరిస్థితిని అధిగమించాలంటే పనిని బట్టి ఎవరికి వారు తమలోని నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.

* పని ప్రదేశంలో ఒత్తిడిని అధిగమించాలంటే మనం తీసుకునే ఆహారమూ కీలకమే! ఈ క్రమంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే అవిసె గింజలు, వాల్‌నట్స్‌, చేపలు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆమ్లాలు సహజసిద్ధంగా ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తాయి.. తద్వారా మనసూ ప్రశాంతంగా ఉంటుంది. పనిపై మరింత ఏకాగ్రత పెట్టగలం.

* రాత్రి పడుకునే ముందు కాఫీ తాగకపోవడం, స్మార్ట్‌ ఫోన్లకు దూరంగా ఉండడం, రిలాక్సవడం.. వంటి చిన్న చిన్న చిట్కాలు మనల్ని సుఖ నిద్రకు ప్రేరేపించి ఒత్తిడిని దూరం చేస్తాయని నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ చెబుతోంది. తద్వారా మరునాడు ఉదయం ఉత్సాహంగా పనిని మొదలుపెట్టచ్చంటోంది.

* రోజువారీ మనం చేసే వ్యాయామాలు కూడా ఒత్తిడి, ఆందోళనల నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి. కాబట్టి కసరత్తులు చేసే సమయం లేకపోయినా ఉదయాన్నే కాసేపు ఆరుబయట అలా నడిచినా చాలంటున్నారు నిపుణులు.

 

సంస్థలూ చొరవ చూపాలి!

పని ప్రదేశంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి ఉద్యోగులు తమ జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు సంస్థలూ ఈ విషయంలో చొరవ చూపాలని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా..

* ఉద్యోగులు తమలోని ఒత్తిడిని స్వయంగా గుర్తించేందుకు వీలుగా ఈ అంశంపై అవగాహన కార్యక్రమాలు, నిపుణులతో ప్రత్యేక సెషన్స్‌ ఏర్పాటు చేసి వారికి వివరించాలి.

* ఆయా సంస్థల్లో ఉండే నాయకత్వ పద్ధతులు, నియమనిబంధనల గురించి వారికి ముందే వివరించి.. ఈ దిశగా వారిని ప్రిపేర్‌ చేస్తే ముందు ముందు వారు ఒత్తిడిని ఎదుర్కోకుండా, దాని ప్రభావం పనిపై పడకుండా చూడచ్చు.

* ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు, స్నేహపూర్వక పని వాతావరణాన్ని సృష్టించేందుకు నెలకోసారి లేదంటే రెండుసార్లు వారికి పని నుంచి కాస్త విరామమిచ్చి.. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. తద్వారా వారు మరింత ఉత్సాహంగా పని చేయగలుగుతారు.. అలాగే ఎల్లవేళలా సంస్థ తమ వెంటే ఉందన్న భరోసా వారికి ఉంటుంది.

ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఒత్తిడిని ఎదుర్కోలేకపోయినా.. ఈ సమస్య మరింత ఎక్కువవుతోన్నా వెంటనే మానసిక నిపుణులను సంప్రదించి తగిన సహాయం తీసుకోవచ్చు.. కౌన్సెలింగ్‌కు వెళ్లచ్చు.


మరిన్ని

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని