కట్టుకున్నవాడు వదిలేసి పోయినా.. ‘ఎస్సై మేడమ్’గా ఎదిగింది! - anie siva from kerala overcomes all hurdles in her life now joined as probationary sub inspector in
close
Published : 28/06/2021 18:16 IST

కట్టుకున్నవాడు వదిలేసి పోయినా.. ‘ఎస్సై మేడమ్’గా ఎదిగింది!

Photo: Twitter

‘జీవితం పూలపాన్పు కాదు.. ఎప్పుడు ఎలాంటి సవాలు విసురుతుందో తెలియదు.. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.. సవాళ్లను ఎదిరించి ముందుకు సాగాలి.. అప్పుడే మన కల నెరవేరుతుంది..’ అంటారు కేరళలోని వర్కలా నగర ఎస్సైగా ఇటీవలే బాధ్యతలు అందుకున్న ఆనీ శివ. చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకొని ఎన్నో కష్టాలను అనుభవించిన ఆమె.. ఆ కన్నీటితోనే బతకాలనుకోలేదు. చంకన చంటి బిడ్డనెత్తుకొని పొట్ట కూటి కోసం ఎన్నో పనులు చేసింది.. వ్యాపార ప్రయత్నాలూ చేసింది.. అన్నీ విఫలమవడంతో తన కలల ఉద్యోగంపై దృష్టి పెట్టింది. సవాళ్లను అధిగమిస్తూ మూడేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఉద్యోగం తెచ్చుకున్న ఆమె.. పరీక్షలో ఉత్తీర్ణురాలై ఇటీవలే ఎస్సైగా ప్రమోషన్ అందుకుంది. ‘జీవితం విలువ తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడి దాకా చేరుకోగలిగా’నంటోన్న ఈ సూపర్‌ కాప్‌ కన్నీటి కథేంటో మనమూ తెలుసుకుందాం..

ఒక వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కేరళలోని వర్కలా నగరానికి చెందిన ఆనీ శివ కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. 18 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని ప్రేమించి.. అమ్మానాన్నల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆమె.. అతని చేతిలోనే మోసపోయింది. బిడ్డ పుట్టాక తన భర్త వదిలేయడంతో ఒంటరైంది. తన దీనస్థితిని చూసి అమ్మానాన్న అయినా అక్కున చేర్చుకుంటారనుకుంది.. కానీ అదీ జరగలేదు. ఇక చేసేది లేక తన బామ్మ ఇంట్లో ఉండే ఓ షెడ్డులో బిడ్డతో పాటు తలదాచుకుంది ఆనీ.

అన్నీ ఫ్లాపయ్యాయి!

ఉండడానికి చోటైతే దొరికింది.. కానీ పొట్ట నింపుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి. ఆరు నెలల బిడ్డను వదిలి ఎక్కడికెళ్లాలి.. ఏం పని చేయాలి? ఒకవేళ అలా వెళ్తే బిడ్డను ఎవరు చూసుకుంటారు? ఇలాంటి అయోమయ స్థితిలో పడిపోయిందామె. అయినా చంటి బిడ్డను చంకనెత్తుకొని బతుకుదెరువు కోసం ఎన్నో చోట్లకు తిరిగానని, వ్యాపారం కూడా ప్రారంభించానని, కానీ ఏ ఒక్కటీ వర్కవుట్‌ కాలేదని చెబుతోంది ఆనీ.

‘నా బిడ్డకు ఆరు నెలల వయసున్నప్పుడే నా భర్త నన్ను వదిలేశాడు. ఆ సమయంలో బామ్మ ఇంట్లో తలదాచుకుంటూనే.. పొట్టకూటి కోసం ఎన్నో చోట్ల పనిచేశా. సబ్బులు, డిటర్జెంట్‌ పౌడర్లు అమ్మా. కాయగూరలు, సరుకులు డోర్‌ డెలివరీ చేసేదాన్ని. కొన్నాళ్ల పాటు ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా కూడా ఉద్యోగం చేశా. ఆపై ఏదైనా వ్యాపారం చేద్దామనుకొని.. చేత్తో బొమ్మలు తయారుచేసి విక్రయించడం, ఐస్‌క్రీమ్‌-లెమనేడ్‌ అమ్మడం.. వంటివి చేశాను. కానీ అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి..’ అంటూ తన జీవితంలోని పాత రోజుల్ని గుర్తు చేసుకుందీ లేడీ పోలీస్.

అది నా కల!

ఇలా ఓవైపు పని చేస్తూనే.. మరోవైపు ఇంట్లో ఉండే చదువుకుంది ఆనీ. అయితే పెద్దయ్యాక పోలీసాఫీసర్‌ కావాలనేది తన చిన్ననాటి కల. ఎలాగైనా దాన్ని సాకారం చేసుకోవాలని నిర్ణయించుకుందామె. కష్టపడి సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. కేరళ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షల కోసం సన్నద్ధమవడం ప్రారంభించింది. 2016లో కానిస్టేబుల్‌ పరీక్ష రాసి అర్హత సాధించి.. మూడేళ్ల పాటు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించింది. ఇక 2019లో ఆఫీసర్స్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంది. అందులోనూ విజయం సాధించి.. ఏడాదిన్నర పాటు ఎస్సైగా శిక్షణ తీసుకుంది. ఇటీవలే ట్రైనింగ్‌ పూర్తిచేసిన ఆమెకు.. వర్కలా పోలీస్‌ స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్సైగా బాధ్యతలు అప్పగించారు. అయితే గతంలో తాను ఎక్కడైతే పొట్టకూటి కోసం వ్యాపారం చేసిందో.. అక్కడే ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వడంతో ఒక్కసారిగా పాపులరైపోయింది ఆనీ.

పోయిన చోటే వెతుక్కుంది!

ఓటమి ఎదురైన చోటే గెలిచి తీరాలన్న జీవిత సత్యాన్ని నిజం చేస్తూ ఇటీవలే ప్రొబేషనరీ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఆనీ.. తాను ఇక్కడిదాకా చేరుకోవడానికి తన జీవితంలో అనుభవించిన కష్టాలే పాఠాలుగా నిలిచాయని చెబుతోంది. 
‘ఒకప్పుడు ఇదే ప్రాంతంలో ఓ పాకలో నివసించా.. నా చంటి బిడ్డను ఎత్తుకొని ఉపాధి కోసం ఎన్నో పనులు చేశా.. ఆ సమయంలో ఏ ఒక్కరూ నాకు సహాయం చేయలేదు.. మద్దతుగా నిలవలేదు. కానీ ఇప్పుడు అందరూ నా కన్నీటి కథ విని చలించిపోతున్నారు. సోషల్‌ మీడియాలో నా గురించి పంచుకుంటూ.. నాకు మద్దతుగా నిలుస్తున్నారు. అది చూసి నాకెంతో గర్వంగా అనిపిస్తోంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటే గానీ నేను ఇక్కడిదాకా చేరుకోలేకపోయా. నాలాగే జీవితంలో కష్టాలు అనుభవించే మహిళలకు నేను స్ఫూర్తిగా నిలవడం కన్నా ఆనందం మరొకటి లేదు..’ అంటున్నారు ఆనీ.

రియల్‌ ఫైటర్!

ఇలా ఈ సూపర్‌ కాప్‌ కన్నీటి గాథను కేరళ పోలీస్‌ తన ట్విట్టర్‌లో పంచుకుంటూ ‘ఆత్మవిశ్వాసం, సంకల్పానికి ఆనీ నిలువెత్తు రూపం’ అని అభినందించింది. ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌గా మారడంతో సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ‘ది రియల్‌ ఫైటర్‌.. ఆనీ మనందరికీ ఆదర్శం!’ అంటూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

‘కష్టాలకు వెరవకుండా, మనకూ మంచి రోజులొస్తాయన్న సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే.. ఆ కష్టాలే మన మొండి ధైర్యాన్ని చూసి పారిపోతాయి’ అని నిరూపించిన ఆనీ కథ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం!

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని