నెలసరి నొప్పుల్ని దూరం చేసే ఈ థెరపీ గురించి విన్నారా?! - aqua therapy is the best way to reduce the menstrual pain in telugu
close
Published : 23/06/2021 12:37 IST

నెలసరి నొప్పుల్ని దూరం చేసే ఈ థెరపీ గురించి విన్నారా?!

హిమజకు నెలసరి అంటేనే ఏదో తెలియని భయం, చికాకు! కారణం.. ఆ సమయంలో విపరీతమైన శారీరక నొప్పులతో బాధపడుతుంటుందామె. ఇక ఈ నొప్పుల్ని భరించలేక ఒక్కోసారి మాత్రలు కూడా వేసుకుంటుంది.
పల్లవిదీ ఇదే సమస్య. పిరియడ్‌ వచ్చినప్పుడల్లా పొత్తి కడుపులో వచ్చే నొప్పి భరించలేక ప్రతిసారీ ఆఫీస్‌కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటుంది.. అంతేకాదు.. దీన్నుంచి ఉపశమనం పొందడానికి నొప్పి నివారిణులు వాడుతుంటుంది.
నెలసరి వచ్చినప్పుడల్లా చాలామంది మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యే ఇది! పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, కడుపులో మెలిపెట్టినట్లుగా అనిపించడం, నీరసం, అలసట, వికారం.. ఇలా ఒకటా రెండా ఎన్నో అనారోగ్యాల్ని మోసుకొస్తాయి పిరియడ్స్‌. ఇక వీటి నుంచి తక్షణ ఉపశమనం కోసం చాలామంది మాత్రల్నే ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి ఇప్పటికిప్పుడు సమస్యను తగ్గించినా.. దీర్ఘకాలంలో మాత్రం వీటి వల్ల ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మాత్రలకు ప్రత్యామ్నాయంగా వ్యాయామాల్ని ఆశ్రయించాలని సూచిస్తున్నారు. ఇందులోనూ ముఖ్యంగా ఆక్వాటిక్‌ థెరపీ (నీటిలో చేసే వ్యాయామాలు)తో నెలసరి నొప్పుల నుంచి ఇట్టే ఉపశమనం పొందచ్చని అంటున్నారు. మరి, అదెలాగో, ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..


నెలసరి నొప్పుల్ని దూరం చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు, మహిళలు నొప్పి నివారిణులు వాడడం మనకు తెలిసిందే! అయితే వీటి వల్ల దీర్ఘకాలంలో కడుపులో అల్సర్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా ఈ సమయంలో ఆక్వాటిక్‌ థెరపీని ప్రయత్నించడం వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు పడకుండానే నెలసరి నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం పొందచ్చంటున్నారు.

అసలు నొప్పి ఎందుకొస్తుంది?

నెలనెలా నెలసరి వచ్చినప్పుడల్లా గర్భాశయం లోపలి పొర కుంచించుకుపోతుంది. తద్వారా ప్రొస్టాగ్లాండిన్స్‌ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గర్భాశయ కండరాలను సంకోచానికి గురిచేసి ఆ భాగంపై ఒత్తిడి పడేలా చేస్తాయి. ఈ క్రమంలో గర్భాశయానికి రక్తప్రసరణ కూడా మందగిస్తుంది. ఈ పరిస్థితి ఫలితంగా నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. మరి, దీన్నుంచి ఉపశమనం పొందాలంటే కటి వలయంలోని కండరాల్ని దృఢంగా మార్చే వ్యాయామాలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. ఆక్వాటిక్‌ థెరపీ కూడా అలాంటి వ్యాయామమే. ఇందులో భాగంగా శరీరం తట్టుకునే వేడి నీరు నింపిన పూల్‌లో యోగా, ఏరోబిక్స్‌, పిలాటిస్‌.. వంటి వర్కవుట్లు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాయామాల వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (సహజసిద్ధమైన నొప్పి నివారిణులు) విడుదలవుతాయి. అలాగే కటి వలయ కండరాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది.. ఫలితంగా నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కలగడంతో పాటు కటి వలయ కండరాలు బలంగా, దృఢంగా మారతాయి.

 

ప్రయోజనాలెన్నో!

వేడి నీటిలో చేసే ఈ వ్యాయామాల వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్నెన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

* శరీరం తట్టుకునే వేడి నీటిలో వ్యాయామాలు చేయడం వల్ల కటి వలయం, పొత్తి కడుపు, తొడలు.. వంటి భాగాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా ఆయా భాగాల్లోని కండరాలు రిలాక్సవుతాయి. అంతేకాదు.. గర్భాశయ కండరాలపై ఒత్తిడి కలగజేసే ప్రొస్టాగ్లాండిన్స్‌ హార్మోన్లు బయటికి వెళ్లిపోతాయి. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.

* ఈ వ్యాయామాల్లో భాగంగా పూల్‌లోని నీటికి వ్యతిరేకంగా కాళ్లు, చేతుల్ని కదిలిస్తూ కొన్ని భంగిమలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కండరాల్లో నొప్పిని కలిగించే భాగాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా అవి రిలాక్సయి నొప్పి క్రమంగా తగ్గుతుంది.

* నీటిలో చేసే ఆయా వ్యాయామాల కారణంగా నొప్పిగా ఉండే కండరాలు నీటితో రాపిడికి గురవుతాయి. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనంతో పాటు ఆయా కండరాలు దృఢంగా మారతాయి.

* నీటిలో గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో వ్యాయామాలు చేసినా కీళ్లపై అంత ప్రభావం పడదు.. కాబట్టి ఆక్వాటిక్‌ వ్యాయామాల కారణంగా కీళ్ల నొప్పులొస్తాయన్న భయమే అక్కర్లేదు.

* నెలసరి సమయంలో శారీరకంగానే కాదు.. మానసికంగానూ పలు సమస్యలు ఎదురవుతుంటాయి. మూడ్‌ స్వింగ్స్‌, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ, చికాకు.. వంటివి ఈ కోవలోకే చెందుతాయి. మరి, వీటన్నింటి నుంచి ఉపశమనం పొందాలంటే అందుకు వేడి నీటిలో చేసే ఈ వ్యాయామాలు చక్కగా దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

ఇంట్లో అయితే ఇలా!

నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే వారానికి మూడు రోజులు.. రోజుకు గంట చొప్పున ఈ వ్యాయామాలు సాధన చేయడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఈ వ్యాయామాలు కొత్తగా ప్రారంభించే వారు మాత్రం నిపుణుల సమక్షంలో చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. అందుకోసం ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో బయటికే వెళ్లాల్సిన పని లేదు.. ఇంటి నుంచే ఆక్వాటిక్‌ వ్యాయామాలు చేసేలా కొన్ని ఆన్‌లైన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ, అందులో నిపుణుల సలహాలు పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఓ చిన్న పూల్‌ని ఏర్పాటు చేసుకోవడం, అదీ వీల్లేదంటే బయట మార్కెట్లో దొరికే ఇన్‌ఫ్లాటబుల్‌ పూల్స్‌(గాలి నింపిన ప్లాస్టిక్‌/రబ్బర్‌ పూల్స్‌)ని కొని మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం.. వంటివి చేయచ్చు.

 

 


ఇలా చేస్తే లీకేజీ సమస్య ఉండదు!

సాధారణంగా నెలసరి సమయంలో నీటిలో తడవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల బ్లీడింగ్‌ లీకవుతుందన్న భయమే ఇందుకు కారణం..! అయితే ఈ క్రమంలో శ్యానిటరీ న్యాప్‌కిన్లు ధరిస్తే ఈ సమస్య తలెత్తుతుంది. వాటికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకుంటే సౌకర్యవంతంగా ఆక్వాటిక్‌ వ్యాయామాలు చేయచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

* ఈత కొట్టేటప్పుడైనా, వేడి నీటిలో వ్యాయామాలు చేసేటప్పుడైనా.. నాణ్యమైన, ఎక్కువ రక్తాన్ని పీల్చుకునే స్వభావం ఉన్న ట్యాంపూన్లను ఉపయోగించడం మంచిది. అలాగే వీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్ల కూడా రక్తం లీకవకుండా జాగ్రత్తపడచ్చు.

* ఇంకా చెప్పాలంటే ట్యాంపూన్ల కంటే సురక్షితమైన ప్రత్యామ్నాయం మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ అని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ బ్లీడింగ్‌ని సేకరించడంతో పాటు ఎక్కువ సమయం రక్షణనిస్తాయివి. పైగా వీటిని తిరిగి ఉపయోగించే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి మీ బ్లీడింగ్‌ ఫ్లోని బట్టి 6-12 గంటల్లోపు వీటిని తొలగించి, శుభ్రం చేసుకొని, తిరిగి అమర్చుకోవాల్సి ఉంటుంది.

* నీటిలో ఉన్నప్పుడు బ్లీడింగ్‌ లీక్‌ కాకుండా ఉండాలంటే మెన్‌స్ట్రువల్‌ డిస్కులు అమర్చుకోవడం మరో మార్గం అంటున్నారు నిపుణులు. అచ్చం కప్స్‌ని పోలి ఉండే ఇవి.. వాటి కంటే కంఫర్టబుల్‌గా ఉంటాయట! అయితే చాలావరకు వీటిని తిరిగి ఉపయోగించుకోవడానికి వీలుండకపోవచ్చని.. అందుకే వీటిని వాడే వారు ఒకట్రెండు డిస్కుల్ని అదనంగా వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

* మాకు ఇవన్నీ ఏవీ వద్దు.. శ్యానిటరీ న్యాప్‌కిన్లయితేనే సౌకర్యవంతంగా ఉంటాయి అనుకునే వారు వాటిని ధరిస్తూనే.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన పిరియడ్‌-ఫ్రెండ్లీ స్విమ్‌ వేర్‌ని ఎంచుకోవచ్చు. తద్వారా లీకేజీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

సో.. ఇవండీ! నెలసరి సమయంలో నీటిలో చేసే వ్యాయామాలు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలు! కాబట్టి పిరియడ్‌ వచ్చినప్పుడల్లా మాత్రలు వేసుకుంటూ భవిష్యత్తులో లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకునే బదులు ఈ వాటర్‌ వర్కవుట్స్‌తో నెలసరి నొప్పుల్ని దూరం చేసుకుందాం.. తద్వారా ఆరోగ్యంగా, దృఢంగా మారదాం! ఏమంటారు?!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని