ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఆపాదమస్తకం అందంగా..! - beauty benefits of turmeric essential oil
close
Updated : 22/07/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఆపాదమస్తకం అందంగా..!

అమ్మాయిల సౌందర్య పోషణలో పసుపుది ఎంత కీలకపాత్రో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రస్తుతం చాలామంది మహిళలు సౌందర్య పోషణలో భాగంగా పలు ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో పసుపు మొక్క నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కలిగే సౌందర్యపరమైన ప్రయోజనాలేంటి? దానిని ఎలా ఉపయోగించాలి? తదితర వివరాలన్నీ మనమూ తెలుసుకుందాం రండి..

పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ ఎలర్జిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ప్యారసైటిక్ గుణాలెన్నో ఉన్నాయి. ఫలితంగా దీనివల్ల సౌందర్యపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

చర్మం తాజాదనం కోసం..

కొన్నిసార్లు చర్మం కమిలిపోయి, నిర్జీవంగా తయారవుతుంది. ఇటువంటప్పుడు చర్మం తిరిగి తాజాగా కనిపించడానికి ఈ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా ఉపకరిస్తుంది. దీని కోసం ఒకటిన్నర చెంచా ఆలివ్ ఆయిల్‌లో పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ ఒక్క చుక్క వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకొనే ముందు చేయడం వల్ల అలసిన చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

మొటిమలు, మచ్చలు తగ్గడానికి..

పసుపు వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి ముఖంపై ఉండే మొటిమలను తగ్గుముఖం పట్టేలా చేయడమే కాకుండా వాటి వల్ల ఏర్పడిన మచ్చలను కూడా రూపుమాపుతాయి. ఫలితంగా మచ్చల్లేని ప్రకాశవంతమైన మోముని మన సొంతం చేసుకోవచ్చు.

వృద్ధాప్య ఛాయలు కనబడకుండా..

ఈ ఎసెన్షియల్ ఆయిల్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వృద్ధాప్య ఛాయలు కూడా దరిచేరవు. దీని కోసం నాలుగు చెంచాల బాదం నూనెలో నాలుగు చుక్కల పసుపు ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో ముఖంపై సన్నని గీతలు, ముడతలు ఉన్నచోట మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎక్కువైన నూనెని తుడిచేసుకోవాలి. ఈ చిట్కాను కూడా రాత్రి పడుకొనే ముందు రోజూ పాటించడం ద్వారా వృద్ధాప్య ఛాయలు కనుమరుగవుతాయి.

అలాగే పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్‌ను విడిగానే కాదు.. ఫేషియల్ మాస్కుల తయారీలోనూ వినియోగించవచ్చు. తద్వారా ఆయా ప్యాక్స్‌కు సంబంధించి మరింత మెరుగైన ఫలితాలు పొందచ్చు.

కురులకు కూడా..

ఈ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల కేవలం చర్మానికే కాదు.. కురులకు కూడా చక్కని ప్రయోజనాలు కలుగుతాయి. చుండ్రుని నివారించడంతోపాటు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. అలాగే దీనిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల ఇవి కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. దీనికోసం ఈ నూనెను నేరుగా కాకుండా మనం ఉపయోగించే సాధారణ నూనె (కొబ్బరినూనె, బాదంనూనె..) వంటి వాటితో కలిపితే సరి.

ఇతర ప్రయోజనాలు..

* ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి వాపు నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.

* పాదాలకు ఉన్న పగుళ్లను తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. దీనికోసం కొబ్బరినూనె లేదా ఆముదంలో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమంతో రోజూ పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే పగుళ్లు తగ్గడంతోపాటు పాదాలు మృదువుగా మారడం మనం గమనించవచ్చు.

* దీనిని ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది.

* ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి.

* కొన్ని రకాల మచ్చలను నివారించే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా దీనిని వినియోగిస్తారు.

ఈ జాగ్రత్తలు..

ఈ నూనెను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ నూనెను నేరుగా చర్మం లేదా కురులపై ఉపయోగించకూడదు. కొబ్బరినూనె, బాదం నూనె, జొజోబా ఆయిల్.. వంటి నూనెలతో కలిపి మాత్రమే వినియోగించాలి. అలాగే దీనిని వీలైనంత తక్కువ మోతాదులోనే వినియోగించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నూనెను ఉపయోగించిన తర్వాత చర్మం చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. ఫలితంగా సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలను అంతగా తట్టుకోలేదు. కాబట్టి దీనిని ఉపయోగించిన తర్వాత దాదాపు 48గం||పాటు ఎండలోకి వెళ్లకుండా ఉండడం మంచిది. తప్పనిసరైతే చర్మాన్ని స్కార్ఫ్ లేదా మెత్తని కాటన్ వస్త్రంతో కవర్ చేసుకోవాలి.

అలాగే వాడే ముందు సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ ఆయిల్‌ను ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ముందుగా ఈ నూనెను వేరే నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని 20 నిమిషాలు వేచి చూడాలి. ఎలాంటి సమస్యలు లేకపోతేనే దీనిని ఉపయోగించాలి.


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని