యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఉపయోగాలెన్నో.. - benefits of apple cider vinegar in telugu
close
Published : 26/07/2021 20:27 IST

యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఉపయోగాలెన్నో..

ఇంట్లో గచ్చు దగ్గరి నుంచి అలంకరణ వస్తువులను శుభ్రం చేసే వరకు ఉపయోగించే ఉత్పత్తుల్లో ఎక్కువగా వినిపించే సహజమైన పదార్థం పేరు యాపిల్ సైడర్ వెనిగర్. సహజసిద్ధమైన పదార్థాలతో తయారవడం వల్ల ఇది మన ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు. అందుకే దీన్ని ఇంటిని శుభ్రం చేయడం దగ్గరి నుంచి వంటలకు మంచి రుచి తీసుకురావడం వరకు ఎన్నో అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ వెనిగర్ వీటికే కాదు.. మరెన్నో రకాల గృహావసరాలను తీర్చేందుకు సైతం ఉపయోగపడుతుంది. మరి ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందామా..

* కొత్తగా కొన్న పాత్రలపై అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను తొలగించడం కాస్త కష్టమే. అయితే వెనిగర్‌ను ఉపయోగించి వాటిని సులభంగా తొలగించవచ్చు. స్ప్రే బాటిల్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ పోసి దాన్ని స్టిక్కర్లపై స్ప్రే చేయాలి. ఆ తర్వాత చేత్తో రుద్దితే అవి సులువుగా వదిలిపోతాయి.

* పెరటి తోట, కుండీల్లో వచ్చే కలుపును ఈ వెనిగర్ సాయంతో నాశనం చేయచ్చు. దీనికోసం ముప్పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌లో పావు కప్పు నీటిని కలిపి స్ప్రేబాటిల్‌లో వేయాలి. దీన్ని కలుపు మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా వాటిని నాశనం చేయచ్చు.

* సాధారణంగా చెక్క వస్తువులకు పాలిష్ వేయిస్తూ ఉంటారు. దీనివల్ల అవి కొత్త వాటిలా కనిపిస్తాయి. అయితే వుడ్ పాలిష్‌లో ఉపయోగించే రసాయనాల వల్ల మన ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. దీనికి బదులు యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఇంట్లోనే తయారుచేసుకొన్న వుడ్ పాలిష్‌ను ఉపయోగిస్తే ఎలాంటి హానీ ఉండదు. దీనికోసం పావుకప్పు యాపిల్ సైడర్ వెనిగర్, రెండు కప్పుల నీరు, రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్ నూనె తీసుకోవాలి. వీటన్నింటిని మిశ్రమంగా చేసి పాలిష్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.

* చిన్నారుల పాలడబ్బాలు, పాలపీకలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి. వీటిని వెనిగర్‌తో శుభ్రం చేయడం ద్వారా బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుకోవచ్చు. వేడినీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి ఆ మిశ్రమంతో ఓ సారి పాలడబ్బాలు, పాలపీకలను కడగాలి. అనంతరం మరోసారి వేడినీటితో వీటిని కడగాలి. దీనివల్ల డబ్బా వెనిగర్ వాసన రాకుండా ఉంటుంది.

* కొన్ని సందర్భాల్లో కొవ్వొత్తుల కారణంగా ఫ్లోర్, చెక్క వస్తువులపై మరకలు ఏర్పడతాయి. వాటిని యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా సులభంగా పోగొట్టవచ్చు. దీనికోసం సమాన పాళ్లలో యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని తీసుకొని, కలిపి అందులో వస్త్రాన్ని ముంచి మరక ఏర్పడిన చోట రుద్దితే సరి..

* ఉల్లి, వెల్లుల్లి, చేపలు, మాంసం వాసన చేతుల నుంచి అంత త్వరగా వదిలిపోదు. సబ్బుతో చేతులు కడిగినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రమే. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సబ్బుతో చేతులు కడిగిన తర్వాత కొద్దిగా ఈ వెనిగర్‌ను నీటిలో కలిపి దానితో చేతులను కడగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చేతుల నుంచి ఎలాంటి వాసన రాదు.

* కళ్లద్దాలపై ఏర్పడిన మరకలను తొలగించాలంటే కష్టమే. ఎందుకంటే గట్టిగా తుడిస్తే.. అద్దంపై గీతలు పడి పాడయిపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కళ్లద్దాలపై యాపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిస్తే మరక వదిలిపోతుంది.

* పెంపుడు జంతువులు తరచూ సోఫా, బెడ్ ఎక్కుతున్నట్లయితే.. వెనిగర్‌ను ఉపయోగించడం ద్వారా వాటికి చెక్ పెట్టొచ్చు. దీనికోసం స్ప్రే బాటిల్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ పోసి పెంపుడు జంతువులు వెళ్లకూడదని మీరు భావిస్తున్న చోట స్ప్రే చేయాలి. ఈ వాసనను పెట్స్ భరించలేవు. కాబట్టి అక్కడికి వెళ్లడం మానేస్తాయి.

* ఆహారపదార్థాలు మాడిపోయినప్పుడు పాత్రలు నల్లగా తయారవుతాయి. దాన్ని వదిలించాలంటే చాలా కష్టపడాల్సిందే. అయితే యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఈ మరకలు సులభంగా వదులుతాయి. మాడిపోయిన పాత్రలో కప్పు నీరు, కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ పోసి స్టవ్‌పై ఉంచి బాగా వేడి చేయాలి. పొయ్యి ఆపిన తర్వాత రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కలిపితే నురగ మాదిరిగా వస్తుంది. అది రావడం ఆగిపోయిన తర్వాత పాత్రలోని మిశ్రమాన్ని ఒంపి నీటితో శుభ్రం చేయాలి. ఆపై పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది.

చూశారుగా.. ఇంట్లో, వంటింట్లో యాపిల్ సైడర్ వెనిగర్‌ని ఎలా ఉపయోగించవచ్చో.. మరి, మీరూ ఈ చిట్కాలను పాటిస్తారు కదూ..!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని