భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే! - benefits of having a partner who is foodie
close
Updated : 20/07/2021 20:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాగస్వామి భోజనప్రియులైతే ఆనందమే!

అబ్బబ్బా.. మీతో వేగలేక ఛస్తున్నా.. ఎంత భోజనప్రియులైతే మాత్రం రోజుకో స్పెషల్ వంటకం అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? వంట చేసేది మీరైనా, నేనైనా దానికి సరుకులు మాత్రం కావాల్సిందేగా.. అంటోంది మీరా తన భర్తతో.. కొంతమంది తమ భాగస్వామి భోజనప్రియులైతే దానిని సమస్యగా భావిస్తారు. అయితే ఇలాంటివారితో ఉండడం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు.. ఆహార పదార్థాలను అమితంగా ఇష్టపడేవారిలో ఎన్నో మంచి లక్షణాలుంటాయట. దాంతో వారి జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, భోజన ప్రియుల్లో ఉండే అలాంటి కొన్ని మంచి లక్షణాలేంటో తెలుసుకుందామా?

విసుగే ఉండదు..

భోజనమంటే ఇష్టపడేవారు ఎప్పుడూ ఆహారంపై విసుగు చెందరు. ఒకరకం బోర్ కొడితే మరోరకం ఆహారం తీసుకోవడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంతేకాదు.. కొత్త కొత్త వంటకాలను ప్రయత్నించాలనే కోరిక కూడా వారిలో ఎక్కువగానే ఉంటుంది. ఇవే లక్షణాలను వారు తమ జీవితంలోని ఇతర అంశాలకూ వర్తింపజేసుకుంటారట. వీరిలో ఓపిక పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి విసుగు చాలా తక్కువగా వస్తుంటుంది. ఎప్పుడూ మీ కంపెనీతో బోరింగ్‌గా ఫీలవ్వరు. అంతే కాదు.. మీకోసం సర్దుకుపోవడానికి కూడా వారు వెనుకాడరు. (ఆహారం వద్దంటే తప్ప..!) జీవితంలోనూ ఎప్పుడూ కొత్తకొత్త విషయాలను ప్రయత్నిస్తూ ఉంటారు. కొంగొత్త రంగాల్లో అడుగుపెడుతూ విజయాలు సాధిస్తారు. వంటచేసే ముందు రెసిపీ తెలుసుకోవడం వారికి అలవాటే కాబట్టి.. ఏదైనా రంగంలోకి అడుగు పెట్టేముందే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటారు.

ఎక్కడైనా సౌకర్యంగానే..

ఆహారప్రియులు ఎక్కడికెళ్లినా.. ఇట్టే సర్దుకుపోగలుగుతారు. ఇతర దేశాలకెళ్లినా.. అక్కడి ఆహారం కూడా తినగలిగి ఉంటారు. ఎక్కడైనా సౌకర్యంగా జీవించేస్తారు. అంతేకాదు.. ఇలాంటివారిలో సింప్లిసిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫైవ్‌స్టార్ హోటల్ భోజనం అయినా.. లేక రోడ్డు పక్కన బండిలో అమ్మే పానీపూరి అయినా.. వారు రుచిని ఒకేరకంగా ఆస్వాదిస్తారు. రుచి బాగుంటే చాలు.. ఎక్కడైనా తినడానికి వారు వెనుకాడరు. ఇలా జీవితంలోనూ సింప్లిసిటీని కొనసాగిస్తూ.. ఆడంబరాలు లేని జీవితాన్ని గడుపుతారు. ఎక్కడికెళ్లినా.. అందరితో కలిసిపోయి, ఆనందంగా ఉండగలుగుతారు. ఇలాంటివారు ఎప్పుడూ నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ ఉంటారు. ఆహారంలోని ఫ్లేవర్స్‌లా జీవితం కూడా రుచికరంగా ఉండేందుకు వారు తమ శాయశక్తులా కృషి చేస్తారు.

వంటలోనూ సూపర్!

సాధారణంగా భోజనప్రియుల్లో ఎక్కువమంది వంటచేయడానికి కూడా ఇష్టపడతారు. వంట చేయడం అంటే అలా ఇలా వండడం కాదు.. నలభీమ పాకాన్ని మరిపించేవారూ ఎంతోమంది.. రకరకాల వంటకాలను, వివిధ రకాల వంట పద్ధతులను నేర్చుకొని, వాటిని ప్రయత్నిస్తుంటారు ఇలాంటివారు. ఇలా కొన్ని రోజులకే ఆయా వంటకాలు చేయడంలో చేయి తిరిగిన వ్యక్తిగా మారిపోతారు. అందుకే ఇలాంటివారు మీ భాగస్వామి అయితే మీకు ఏదైనా వంటకం అంటే ఇష్టమైనా, లేక ఏదైనా పదార్థం బాగా తినాలనిపిస్తోన్నా.. వెంటనే మీ భాగస్వామికి చెప్పేయండి.. చిటికెలో మీకు నచ్చిన వంటకం టేబుల్‌పై దర్శనమిస్తుంది. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి? ఎంచక్కా నచ్చిన ఆహారం తింటూ.. నచ్చిన వ్యక్తితో జీవితం గడిపేయొచ్చు.

మీ టీచర్ కూడా!

భోజనమంటే ఇష్టముండి, వంట కూడా వచ్చిందంటే.. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాల గురించీ తనకు తెలిసే ఉంటుంది. మీకు ఏదైనా ప్రాంతపు వంటకం నేర్చుకోవాలనిపిస్తే వెంటనే తన వద్ద నేర్చేసుకోవచ్చు. రకరకాల మసాలాలు, సాస్‌ల గురించీ తనకు తెలుసు కాబట్టి.. తనతో ఉంటూ వాటి గురించి కూడా మీరు నేర్చుకొని, పాకశాస్త్రంలో మీకున్న పరిధిని విస్తృతం చేసుకోవచ్చు. మీ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని స్నేహితుల ముందు ప్రదర్శించి, మంచి పేరు తెచ్చుకోవచ్చు. హోటల్స్‌కి వెళ్లినప్పుడు ఎలా వ్యవహరించాలో.. స్పూన్, ఫోర్క్ ఎలా పట్టుకోవాలో.. కట్లరీని ఎలా ఉపయోగించాలో.. ఇలా రకరకాల ఎటికెట్స్‌ని కూడా వారివద్ద నుంచి నేర్చుకోవచ్చు. చివరికి కొన్ని రకాల ఆహారపదార్థాలను ఎలా తినాలో కూడా వారివద్ద నేర్చుకోవచ్చు. ఉదాహరణకు మీకు చైనీస్ ఇష్టమైనా, చాప్‌స్టిక్స్ ఉపయోగించడం రాకపోతే దాన్ని ఇప్పుడు నేర్చుకోవచ్చు.

ప్లానింగ్ అవసరమే లేదు..

మీ భాగస్వామికి భోజనం అంటే ఇష్టముంటే.. ఆ భోజనాన్ని అత్యంత రుచికరంగా ఎలా మార్చాలా అనే తపన తప్పనిసరిగా ఉండే ఉంటుంది. అందుకే మీ ప్రాంతంలో వంటకు అవసరమైన సామగ్రి, కూరగాయలు, మాంసం వంటివి ఎక్కడ నాణ్యమైనవి దొరుకుతాయో.. అక్కడికే వెళ్లి వారు తీసుకొస్తారు. అది ఇంటికి కాస్త దూరమైనా శ్రమపడైనా మీకోసం, తమకోసం అత్యద్భుతమైన వంటకాన్ని సిద్ధం చేస్తారు. ఇక మీ ప్రాంతంలోని ప్రతి హోటల్ వారికి పరిచయమై ఉండే ఉంటుంది. అందుకే బయటకు వెళ్లాలంటే ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఏం తినాలనుందో చెబితే చాలు.. ఎక్కడికి వెళ్లాలి.. ఎప్పుడు వెళ్లాలి.. టేబుల్ బుకింగ్ వంటివన్నీ తనకే అప్పగించేయొచ్చు.

చూశారుగా.. ఎప్పుడూ.. ఆహారప్రియులు అంటూ వారిని ఆడిపోసుకోక వారితో పాటు జీవితాన్ని ఆనందించడం నేర్చుకోండి. అప్పుడు మీ జీవితంలోనూ ఎన్నో రుచులు తోడవుతాయి.


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని