కరోనా టీకా తీసుకుంటే ఐదేళ్లలో చనిపోతామనేవారు! - binal rathwa busting covid vaccine myths in tribal villages of her home district
close
Updated : 20/06/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా తీసుకుంటే ఐదేళ్లలో చనిపోతామనేవారు!

Photo: Twitter

పెద్ద పెద్ద చదువులు చదివి, లోకజ్ఞానం ఉన్న మనకే కరోనా విషయంలో ఇంకా కొన్ని సందేహాలు, అపోహలు ఉన్నాయి. అలాంటిది జనావాసాలకు దూరంగా, ఏదో మారుమూల కొండ కోనల్లో గడిపే గిరిజనుల పరిస్థితేంటి? అసలే మూసధోరణులు గూడుకట్టుకొని, నిరక్షరాస్యత తాండవించే అక్కడి ప్రజల్లో కొవిడ్‌, అది రాకుండా నివారించే టీకా.. వంటి విషయాల్లో అవగాహన కల్పించేవారెవరు? ఆ బాధ్యతను తాను తీసుకున్నానంటోంది గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల బైనల్‌ రాథ్వా. ఓవైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు అక్కడి గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తోంది.. అంతేకాదు.. టీకా ప్రాముఖ్యం గురించి తెలియజేస్తూ వారిలో లేనిపోని అపోహలు, భయాల్ని తొలగిస్తోంది. అందుకే ఈ అమ్మాయిని ప్రస్తుతం దేశమంతా ప్రశంసిస్తోంది.

బైనల్‌ రాథ్వా.. గుజరాత్‌లోని ఛోటా ఉదేపూర్ ఆమె స్వస్థలం. ప్రస్తుతం వదోదరలోని ఎంఎస్‌ యూనివర్సిటీలో సైన్స్‌ విభాగంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోన్న ఆమె.. ఈ కరోనా కల్లోల సమయంలో తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే గిరిజనుల్లో కరోనా పట్ల అవగాహన లేదని, టీకా విషయంలో ఏవేవో అపోహలు నెలకొన్నాయని తెలుసుకున్న ఆమె.. ఈ విషయంపై వారిలో అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. ఇందుకు గతేడాది అక్టోబర్‌లోనే శ్రీకారం చుట్టింది బైనల్.


తండ్రితో కలిసి ఊరూరా..!
బైనల్‌ తండ్రి ఓ స్కూల్‌ టీచర్‌. మొదట కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆమెకు.. కొవిడ్‌ రెండో దశ సమయం నుంచి ఆమె తండ్రి కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై ఆయా గ్రామాల్లో పర్యటించడం.. అక్కడి వారికి మాస్కులు పంపిణీ చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత, కరోనా గురించి వారిలో ఉన్న అపోహలు తొలగించి.. కనీస అవగాహన కల్పించడం, టీకా ప్రాముఖ్యం గురించి వివరించడం.. వంటివి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బొమ్మల రూపంలో పెద్ద పెద్ద బ్యానర్లు సైతం రూపొందించుకుంటోంది బైనల్‌. ఈ క్రమంలో ఓవైపు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతూనే.. మరోవైపు ఇప్పటిదాకా సుమారు 93 గిరిజన గ్రామాల్లో పర్యటించిందీ యువకెరటం. అంతేకాదు.. ఛోటా ఉదేపూర్ జిల్లా ఆరోగ్య శాఖలో వలంటీర్‌గా సైతం సేవలందిస్తోందీ అమ్మాయి.

వాళ్ల మైండ్‌సెట్‌ మార్చడం కష్టమైంది!
గిరిజనులంటేనే సాధారణ ప్రజా జీవితానికి ఆమడ దూరంలో ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా మందులు మాకులతో పనిలేకుండా వాళ్ల పాత కాలపు పద్ధతులు, సంప్రదాయ చికిత్సలను అనుసరించి నయం చేసుకుంటారు. అయితే అలాంటి చికిత్సలకు కరోనా లొంగదని వారికి అర్థం చేయించడానికి చాలానే కష్టపడాల్సి వచ్చిందంటోంది బైనల్.
‘ఇక్కడి గిరిజనుల్లో చాలా వరకు నిరక్షరాస్యులే.. అందులోనూ ఎలాంటి అనారోగ్యమొచ్చినా ఆస్పత్రులు, మందులు వంటివి తెలియకుండా వాళ్ల పాత కాలపు పద్ధతులతో నయం చేసుకుంటారు. మొదటి దశ కరోనా సమయంలోనూ వాళ్లు ఇలాగే చేశారు. కరోనా వైరస్‌ అలాంటి వైద్య చికిత్సకు లొంగేది కాదని ఎంత చెప్పినా వినేవారు కాదు. కానీ రెండో దశ విజృంభణ సమయంలో వారి ఆలోచనా ధోరణిలో క్రమంగా మార్పొచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, తీవ్ర లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం గురించి వివరిస్తే అర్థం చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉందనుకుంటే.. టీకా విషయంలో మరింత మొండిగా ప్రవర్తించేవారు. ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు వేసుకుంటే ఐదేళ్లలో చనిపోతామనే వారి మూఢనమ్మకాన్ని వాళ్ల మనసుల్లో నుంచి తీసేయడం అంత సులభమేమీ కాలేదు.. ఏదేమైనా నాకున్న విషయ పరిజ్ఞానంతో వారిలో టీకా గురించి అవగాహన కల్పిస్తున్నా.. దీంతో ఇప్పుడిప్పుడే వారిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది.. వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ముందుకొస్తున్నారు..’ అంటోందీ యువ కొవిడ్‌ వారియర్.

ఇలా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో స్వార్థానికి పోకుండా సాటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ.. వారిలో స్ఫూర్తి నింపుతోన్న బైనల్‌ను ప్రస్తుతం తాను చదువుతోన్న యూనివర్సిటీ యాజమాన్యం, సహ విద్యార్థులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అంతేకాదు.. ఆమె ప్రచార కార్యక్రమాల కోసం తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. మరోవైపు ఈ యువకెరటం చేస్తోన్న సేవల్ని దేశం సైతం కొనియాడుతోంది.
హ్యాట్సాఫ్‌ బైనల్!


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని