బంధం వీగిపోయినంత మాత్రాన ప్రేమ దూరమవదు..! - celebrity couples who ended their relationship after being marriage for several years
close
Updated : 06/07/2021 12:18 IST

బంధం వీగిపోయినంత మాత్రాన ప్రేమ దూరమవదు..!

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత, వృత్తిపరమైన విభేదాలు రావడం, ఒకరిపై ఒకరికి గౌరవం తగ్గి పోవడం, వివాహేతర సంబంధాలు.. ఇలా వైవాహిక బంధం మధ్యలోనే వీగిపోవడానికి కారణాలెన్నో..!

ఇలా సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. దాంపత్య బంధంలో ఉన్నంత సేపు రిలేషన్‌షిప్‌ గోల్స్‌ నేర్పించిన కొన్ని ప్రముఖ జంటలు.. ఒక్కసారిగా తాము విడిపోతున్నామంటూ ప్రకటించి తమ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్‌ దంపతులు తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్ని విస్మయానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో ఇకపై కలిసుండలేమంటూ విడిపోయిన కొన్ని సెలబ్రిటీ జంటల గురించి తెలుసుకుందాం..

ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్‌

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరుగాంచిన ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్‌ దంపతులు తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తాజాగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో ‘తాము తీసుకున్న ఈ నిర్ణయం ముగింపు కాదని.. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం..’ అంటూ పేర్కొన్నారు. ఆమిర్‌ మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయాక కిరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘లగాన్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన కిరణ్‌తో ప్రేమలో పడిన ఈ కండల వీరుడు.. 2005 డిసెంబర్‌ 28న ఆమెతో ఏడడుగులు వేశాడు. 2011లో ఆజాద్‌ అనే బాబుకి సరోగసీ పద్ధతిలో జన్మనిచ్చారీ బాలీవుడ్‌ కపుల్‌. అయితే తమ బంధం వీగిపోయినా ఒకరికొకరు అండగా నిలబడతామంటూ తాజాగా చెప్పుకొచ్చారు.


బిల్‌గేట్స్‌ - మెలిందా

ప్రజా సేవలోనే సంతోషం, సంతృప్తి వెతుక్కున్నారు ‘బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌, మెలిందా. తమ సేవా సంస్థ వేదికగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకున్న ఈ జంట.. ఇటీవలే తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. 27 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్లు ట్విట్టర్‌ వేదికగా సంయుక్త ప్రకటన చేశారు బిల్‌, మెలిందా. అయితే దంపతులుగా విడిపోయినంత మాత్రాన సంస్థలో ఇద్దరి భాగస్వామ్యం, ఇతర సేవా కార్యక్రమాలపై ఏమాత్రం ఉండదని, ఇకపైనా కలిసే పనిచేస్తామని చెప్పుకొచ్చారు. వీరికి జెన్నిఫర్‌ క్యాథరిన్‌ గేట్స్‌, ఫోబే అడెలే గేట్స్‌, రోరీ జాన్‌ గేట్స్‌.. అనే ముగ్గురు పిల్లలున్నారు.


దియా మీర్జా- సాహిల్‌ సంఘా..

మరో బాలీవుడ్‌ జంట దియామీర్జా- సాహిల్‌లు.. 2019లో విడాకులు తీసుకుంది. 2009లో ప్రేమలో పడిన ఈ జంట.. 2014లో ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు. ఇక తమ 5 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సంయుక్త ప్రకటన చేశారు దియా-సాహిల్‌. అయితే తాము విడాకులు తీసుకున్నా.. ఎప్పటికీ స్నేహితుల్లానే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక విడాకుల అనంతరం ముంబయికి చెందిన వ్యాపార వేత్త వైభవ్‌ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరి 15న వివాహం చేసుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం గర్భవతి అయిన దియా.. కాబోయే అమ్మగా  మధురానుభూతుల్ని ఆస్వాదిస్తోంది. ఆ అనుభవాలను తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ మురిసిపోతోంది.


మంచు మనోజ్‌- ప్రణతీ రెడ్డి

హీరో మంచు మనోజ్‌-ప్రణతీ రెడ్డి దంపతులు తమ నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్నారు. 2015లో పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు మనోజ్‌. ‘కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. అయితే కొన్ని విభేదాలు తలెత్తడంతో.. బాగా ఆలోచించి మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోయినా.. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం అలాగే ఉంటుంది’ అన్నాడీ టాలీవుడ్‌ హీరో.


శ్వేతా బసు ప్రసాద్‌- రోహిత్‌ మిట్టల్‌

‘కొత్త బంగారు లోకం’ సినిమాలో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించిన శ్వేతా బసు ప్రసాద్‌ పెళ్లైన ఏడాదిలోపే తన భర్తతో విడాకులు తీసుకుంది. ముంబయికి చెందిన ఫిల్మ్‌ మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌తో తన అనుబంధానికి 2018లో ముగింపు పలికిందీ అందాల తార. నాలుగేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018 డిసెంబర్‌ 13న పుణే వేదికగా పెళ్లిపీటలెక్కింది. అయితే మొదటి పెళ్లి రోజు జరుపుకోవడానికి మూడు రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందీ అందాల జంట. ‘పుస్తకంలోని అన్ని పేజీలు చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు.. కొన్ని విషయాలు అసంపూర్ణంగా ఉంటేనే బాగుంటాయని అనుకుంటున్నా.. నా జీవితంలో మధుర జ్ఞాపకాలను మిగిల్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూ్ర్తిగా నిలిచినందుకు థ్యాంక్యూ రోహిత్‌’ అని ఇన్‌స్టా వేదికగా తన విడాకుల విషయాన్ని బయటపెట్టిందీ క్యూటీ.


కనికా ధిల్లాన్‌-ప్రకాశ్‌ కోవెలమూడి

సినిమా రంగంలో కొనసాగుతూ పెళ్లి పీటలెక్కిన జంట కనికా ధిల్లాన్‌- ప్రకాశ్‌ కోవెలమూడి. డైరెక్టర్‌గా, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా, యాక్టర్‌గా ప్రకాశ్‌ గుర్తింపు పొందగా.. పలు సినిమాలకు కథా రచయితగా, స్ర్కీన్‌ప్లే రైటర్‌గా పని చేసింది కనిక. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి..2014లో ఏడడుగులు నడిచారీ లవ్లీ కపుల్‌. 2019 జులైలో విడుదలైన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమాకు కలిసి పనిచేసిన ఈ స్వీట్‌ కపుల్‌.. ఆ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా తాము 2017లోనే విడిపోయినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక ఈ ఏడాది ఫిల్మ్‌ మేకర్‌ హిమాన్షు శర్మతో ఏడడుగులు నడిచింది కనిక.


అర్జున్‌ రాంపాల్‌- మెహ్ర్‌ జెస్సియా

సంసార సాగరంలోని ఒడిదొడుకుల్ని తట్టుకుంటూ 21 ఏళ్ల పాటు కలిసున్నారు బాలీవుడ్‌ కపుల్‌ అర్జున్‌ రాంపాల్‌- మెహ్ర్‌ జెస్సియా. అయితే 2018మేలోనే తాము విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంటకు.. ముంబయిలోని బాంద్రా కోర్టు 2019 నవంబర్‌లో అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. తద్వారా తమ వైవాహిక బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికారీ స్వీట్‌ కపుల్. మోడలింగ్‌తో మొదలైన తమ ప్రేమ ప్రయాణాన్ని 1998లో పెళ్లిపీటలెక్కించిన అర్జున్‌-జెస్సియాకు 2002లో మైరా, 2008లో మహికా అనే ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మెహ్ర్‌తో విడిపోయాక అర్జున్‌ దక్షిణాఫ్రికా తార గ్యాబ్రియెల్లాతో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 2019లో ఆరిక్‌ అనే కొడుకు పుట్టాడు.


జెఫ్‌ బెజోస్‌- మెకంజీ స్కాట్‌

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా పేరు పొందిన ‘అమెజాన్‌’ సీఈవో జెఫ్‌ బెజోస్‌, ఆయన సతీమణి మెకంజీ స్కాట్‌ కూడా 2019లో అధికారికంగా విడిపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా నిరంతరం వార్తల్లో నిలిచే ఈ జంట... తమ పాతికేళ్ల దాంపత్య బంధానికి గుడ్‌బై చెప్పింది. 1993లో ఉద్యోగాన్వేషణలో భాగంగా మెకంజీని జెఫ్‌ ఇంటర్వ్యూ చేయడం.. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి పీటలెక్కారీ లవ్లీ కపుల్‌. వాళ్లిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా నలుగురు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలో తానెంతో ప్రేమించే భర్త నుంచి విడిపోవడం వల్ల వచ్చే రూ. 2.49 లక్షల కోట్ల భరణం తనకొద్దని తృణప్రాయంగా వదులుకుంది మెకంజీ. ఇక ఈ ఏడాది డాన్‌ జెవెట్‌ అనే స్కూల్‌ టీచర్‌ని మళ్లీ పెళ్లి చేసుకుందామె.

ఇలా పెళ్లి తర్వాతే కాదు.. నిశ్చితార్థం తర్వాత కూడా వివిధ కారణాల రీత్యా విడిపోతున్నారు కొందరు సెలబ్రిటీలు. తాజాగా మెహ్రీన్‌-భవ్య, గతంలో త్రిష-వరుణ్‌ మణియన్‌, రష్మిక-రక్షిత్‌ శెట్టి, విశాల్‌-అనీషా రెడ్డి, అక్కినేని అఖిల్‌ - శ్రియా భూపాల్‌.. తదితరులు ఎంగేజ్‌మెంట్‌ తర్వాత బ్రేకప్‌ చెప్పి ఎవరి దారి వారు చూసుకున్నారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని