అబ్బాయిలు నన్ను చూసి ‘నల్ల దయ్యం’ అని పిలిచేవారు! - chennai model opens up on being bullied for skin colour
close
Published : 25/06/2021 13:30 IST

అబ్బాయిలు నన్ను చూసి ‘నల్ల దయ్యం’ అని పిలిచేవారు!

Photos: Instagram

‘చూడ్డానికి పాలరాతి శిల్పంలా తెల్లగా ఉండాలి. మంచి ఎత్తు ఉండాలి. దానికి తగ్గ చక్కని శరీర సౌష్టవం ఉండాలి’... అమ్మాయిల అందానికి ప్రామాణికమేంటని అడిగితే చాలామంది ఇవే చెబుతారు. వీటిలో ఏ ఒక్క విషయంలో తేడా వచ్చినా ఆ అమ్మాయిలు అందంగా లేనట్లుగానే భావిస్తుంటారు. అలాంటివారు సమాజం నుంచే కాదు సొంత కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు, అవమానాలు ఎదుర్కొంటుంటారు. ఇక సోషల్‌ మీడియాలోనైతే ఇలాంటి ట్రోల్స్‌, బాడీ షేమింగ్‌ కామెంట్లు మరీ మితిమీరిపోతున్నాయి.

ఇలాంటి విమర్శలు, హేళనలను బయటపెట్టకుండా తమలోనే దాచుకుని కుమిలిపోయేవారు కొందరైతే... తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను నలుగురితో పంచుకుని బాడీ షేమింగ్‌ని అణచివేయాలని ధైర్యంగా ముందుకొచ్చే వారు మరికొందరు. ఈ రెండో కోవకే చెందుతుంది చెన్నైకి చెందిన లతా రవిచంద్రన్‌ అనే మోడల్‌. చిన్నతనం నుంచి తన చర్మఛాయ విషయంలో తానెదుర్కొంటోన్న వివక్ష, అవమానాలను సోషల్‌ మీడియా బ్లాగ్‌ ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’తో షేర్‌ చేసుకుందీ యంగ్‌ గర్ల్‌. మరి, ఆమె ఆవేదనేంటో మనమూ విందాం రండి..

‘కాలీ’ అని పిలిచేవారు!

‘నా చిన్నతనంలో చాలామంది నన్ను ‘కాలీ(నల్ల పిల్ల)’ అని పిలిచేవారు. మా బంధువుల్లో కూడా చాలామంది నన్ను అలాగే పిలుస్తుండేవారు. దీంతో ‘కాలీ’ అనేది కూడా నా మరో పేరేమో అనుకునేదాన్ని. అయితే అది నా చర్మఛాయను చూసి వారు చేస్తున్న హేళనని అర్థం చేసుకోలేకపోయాను. ఇక మా అమ్మమ్మ అయితే నా రంగును చూసి అప్పుడప్పుడు ‘దీనికి పెళ్లి చేయాలంటే బోలెడంత కట్న కానుకలు ధారపోయాల్సిందే’ అని అమ్మతో చెప్పేది.’

తెల్లగా మారాలని అలా చేసేదాన్ని!

‘చిన్నప్పటి నుంచి నేను మోడల్‌ అవ్వాలని ఎన్నో కలలు కనేదాన్ని. అయితే చిన్నతనంలో, ఆ తర్వాత స్కూల్లో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలతో ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింది. ముఖ్యంగా నేను చదువుకున్న పాఠశాలలో ఎవరూ నా పక్కన కూర్చోవడానికి ఇష్టపడేవారు కాదు. నా చర్మ ఛాయ కారణంగానే ఇలా జరుగుతుందని నాకు అర్థమైంది. దీంతో అందంగా మారి మా అమ్మమ్మతో పాటు నన్ను అవమానించిన వారందరి నోళ్లు మూయిద్దామనుకున్నాను. ఈక్రమంలో తెల్లగా కనిపించేందుకు ఎన్నో రకాల ఫెయిర్‌నెస్‌ క్రీంలు, ట్యాల్కమ్‌ పౌడర్లు ఉపయోగించాను. అయితే ఇవి నా ముఖాన్ని మరింత అంద విహీనంగా మార్చాయి. దాంతో నన్ను చూసి స్కూల్లో అబ్బాయిలు ‘కాలీ భూత్‌’ (నల్ల దయ్యం) అని పిలవడం ప్రారంభించారు.’

ఫంక్షన్లకు వెళ్లడమే మానేశాను!

‘టీవీల్లో రోజూ ఫ్యాషన్‌ షోలు చూసి అలా క్యాట్‌ వాక్‌ చేయాలని కలలు కన్న నేను.. నాకెదురవుతోన్న అవహేళనలతో వాటన్నింటినీ విరమించుకున్నాను. ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లడమే మానేశాను. వీలైనంత వరకు ఇంట్లోనే ఒంటరిగా గడపడం అలవాటు చేసుకున్నా. ఇలా నా రంగుతో అడుగడుగునా ఎదురవుతున్న అవమానాలను దిగమింగుతూనే కాలేజీ చదువు పూర్తిచేశాను. ఉద్యోగాన్వేషణలో పడిపోయాను. చివరకు ఓ మార్కెటింగ్‌ కంపెనీలో చేరాను. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అక్కడ నా సహోద్యోగులు కానీ, ఇతర సిబ్బంది కానీ ఎవరూ నా రంగు గురించి మాట్లాడేవారు కాదు. పైగా నా పని, నైపుణ్యాలను మెచ్చుకునేవారు.’

అద్దంలో నన్ను నేను చూసుకుని నవ్వుకున్నా!

‘ఇదిలా ఉండగా ఒక రోజు నా సహోద్యోగి తనకు తెలిసిన ఓ ఫొటోగ్రాఫర్‌ను నాకు పరిచయం చేశారు. ‘మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఓకే అంటే మీతో కలిసి ఓ ఫొటోషూట్‌ ప్లాన్‌ చేద్దామనుకుంటున్నాను’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ అడిగారు. అయితే అద్దంలో నా ముఖం చూసుకోవడానికే ఇష్టపడని నేను ఆరోజు రాత్రి మాత్రం అద్దం ముందు మొదటిసారిగా చాలా సేపు నిల్చున్నాను. నన్ను నేను చూసుకుంటూ నాలో నేనే నవ్వుకున్నాను. ఎందుకంటే అప్పటివరకు ఎవరూ నా గురించి అలా పాజిటివ్‌గా మాట్లాడింది లేదు. దీంతో నాపై నాకే అసహ్యమేసేది. అలాంటిది మొదటిసారి ఒకరు నేను అందంగా ఉన్నానని ప్రశంసించడంతో మాటల్లో చెప్పలేనంత సంతోషపడ్డా. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫొటోషూట్‌కు అంగీకారం తెలిపాను’.

దాంతో నా జీవితమే మారిపోయింది!

‘ఈ ఫొటోషూట్‌ జరిగిన తర్వాత నా జీవితమే మారిపోయింది. నా ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలయ్యాయి. నేను ఎంతో అందంగా ఉన్నానంటూ ప్రశంసల వర్షం కురిపించారు. పలువురు ఫొటోగ్రాఫర్లు నాతో కలిసి పనిచేయాలన్న ఆసక్తిని కనబరిచారు. అదేవిధంగా వివిధ బ్రాండ్ల యజమానులు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం నన్ను సంప్రదించారు. అప్పటివరకు నేను ముదురు రంగు దుస్తులు అసలు ధరించేదాన్నే కాదు. ఎందుకంటే అలాంటివి నాకు నప్పవని అమ్మ చెప్పింది. అయితే ఫొటోషూట్‌ తర్వాత బ్రైట్‌ కలర్స్‌ దుస్తులనే ఎక్కువగా కొనుగోలు చేశాను. వాటిని ధరించడం చూసి అమ్మ నోటి వెంట మాట రాలేదు. అంతేకాదు...ఒకానొక సందర్భంలో బంధువులతో ‘నా కూతురు...హీరోయిన్‌’ అంటూ నన్ను పరిచయం చేసింది కూడా!’

25 ఏళ్లు వృథా చేశాననిపించింది!

‘నాకు వచ్చిన గుర్తింపుతో అప్పటివరకు నా చుట్టూ ఉన్న అంధకారం ఒక్కసారిగా తొలగిపోయింది. చీకట్లో జీవిస్తూ 25 ఏళ్ల పాటు నా జీవితాన్ని వృథా చేసుకున్నానని మనసులో అనిపించింది. మరింత వెలుగులోకి వచ్చినప్పుడే మనల్ని ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటారని అర్థమైంది. దీంతో నన్ను నేను మరింతగా ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ వేసుకుని కెమెరా ముందు నిల్చోవడానికి నేను ఏ మాత్రం సంకోచించడం లేదు. ‘కాలీ’ లేదా ఇంకోపేరుతో పిలిచినా నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. బహుశా గోధుమ వర్ణపు ఛాయలో కూడా ఎంతో అందముంటుందన్న విషయం వాళ్లకి తెలిసి ఉండకపోవచ్చు. అయినా అది నా సమస్య కాదు.. సో.. ఐ డోంట్‌ కేర్‌!’ అంటూ తనను విమర్శిస్తోన్న వాళ్ల నోటికి తాళం వేసిందీ యంగ్‌ మోడల్‌.

మీ మాటలతో స్ఫూర్తినింపారు!

ఇలా చర్మ ఛాయపై సమాజంలో కొనసాగుతోన్న వివక్షకు చరమగీతం పాడాలంటూ లతా రవిచంద్రన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాడీ షేమింగ్‌తో బాధపడుతోన్న ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది. ఈ సందర్భంగా నెటిజన్లు ‘మీరెంతో అందంగా ఉన్నారు... మీ మనసు అంతకంటే అందమైనది. మీ మాటలతో చాలామందిలో స్ఫూర్తి నింపారు... సూపర్బ్‌ మేడమ్‌!’ అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని