వంటింట్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - common kitchen mistakes that we should avoid in telugu
close
Published : 05/09/2021 14:54 IST

వంటింట్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

వాడిన నూనెనే పదే పదే వాడడం కొంతమందికి అలవాటు!

కూర పూర్తయ్యాక గరిటెల్ని ప్లాట్‌ఫామ్‌పై పెట్టి అలాగే వదిలేస్తుంటారు మరికొందరు!

వండేటప్పుడు ఉప్పు సరిపోయిందా అని కలిపే గరిటెతోనే రుచి చూడడం ఇంకొందరు చేసే పని!

నిజానికి ఇవన్నీ రోజూ మనం కిచెన్‌లో చేసేవే! చెప్పుకోవడానికీ చాలా సిల్లీగా అనిపిస్తాయి కూడా! అయితే ఇలాంటి అలవాట్లన్నీ వంటను కలుషితం చేసి లేనిపోని అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ అలవాట్లను మార్చుకోమని సూచిస్తున్నారు. మరి, మనకు తెలియకుండానే వంటింట్లో దొర్లే పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుంటేనే వంటలోని పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.

రెండింటికీ ఒకే గరిటా?

కూర చేసేటప్పుడు ఉప్పు/కారం/పులుపు సరిపోయిందా అని రుచి చూడడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ క్రమంలో కొంతమంది టీస్పూన్ ఉపయోగిస్తే.. మరికొంతమందేమో తినేది మనమే కదా అని.. కూర కలిపే గరిటెతోనే రుచీ చూస్తుంటారు. మళ్లీ తిరిగి అదే గరిటెను కూర కోసం వాడుతుంటారు.. ఇంకొంతమందైతే ఒకే స్పూన్‌ని పదే పదే కూరలో పెడుతూ.. ఇతరులకూ రుచి చూపిస్తుంటారు. దీనివల్ల కూర కలుషితమయ్యే ప్రమాదం ఉందని చెబుతోంది ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ). అందుకే అలాంటి అలవాటు మానుకొని రుచి చూడ్డానికి వేరే స్పూన్‌ ఉపయోగించడం, ఎక్కువ మంది రుచి చూడాలనుకుంటే కొంచెం కూరను వేరే బౌల్‌లోకి తీసుకొని టేస్ట్‌ చేయడం.. వంటి చిట్కాలు పాటించచ్చని చెబుతున్నారు నిపుణులు.

అదే నూనె.. పదే పదే!

పిండి వంటలు చేసే క్రమంలో మిగిలిపోయిన నూనెను పదే పదే వాడడం మనకు కొత్త కాదు. అయినా ఇలా చేస్తే ఏమవుతుందిలే అనుకునే వారూ లేకపోలేదు. కానీ ఇది ప్రమాదకరమని చెబుతోంది భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI). ఎందుకంటే నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అందులో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ (చెడు కొవ్వులు) ఉత్పత్తవుతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం! అంతేకాదు.. ఈ నూనెలో శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌, క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్‌ సమ్మేళనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి కోరి అనారోగ్యాల్ని కొని తెచ్చుకునే బదులు డీప్‌ ఫ్రై కోసం అవసరం ఉన్నంత నూనెను మాత్రమే వాడడం మంచిది. అందులోనూ కాస్త మిగిలినా మరోసారి కూరల్లో వేసుకుంటే పదే పదే నూనెను వేడి చేస్తూ వాడే అవసరం రాదు.

వాటిని అలాగే వదిలేస్తున్నారా?

కూరలు వండేటప్పుడు లేదంటే ఏవైనా వంటకాలు/పిండి వంటలు చేసేటప్పుడు.. కలిపిన గరిటెల్ని కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై పెడుతూ, తిరిగి వాటినే ఉపయోగిస్తుంటారు చాలామంది. ఇంకొందరేమో కూర పూర్తయ్యాక గరిటెలపై మూత పెట్టకపోవడం, పాత్రలపై మూతలు నిండుగా పెట్టకపోవడం.. వంటివి చేస్తుంటారు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యమే దీనికి కారణం. కానీ ఈ అలవాటు వల్ల గరిటెలు పెట్టిన కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై క్రిములు, బ్యాక్టీరియా చేరి.. ఇతర వంటకాలకూ అవి వ్యాపించే ప్రమాదం ఉంది. దీనివల్ల తీసుకునే ఆహారం కలుషితమవుతుంది. కాబట్టి వంట పూర్తయ్యాక గరిటెలపై ఓ బౌల్‌ బోర్లించడం, పాత్రలపై నిండుగా మూత పెట్టడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కూర వండే క్రమంలోనూ గరిటెలు పెట్టుకోవడానికి వీలుగా ప్రస్తుతం వివిధ రకాల ‘స్పూన్‌ రెస్ట్‌’లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకుంటే కిచెన్‌ నీట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది.

శుభ్రం చేస్తున్నారా? లేదా?

కిచెన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా వంట చేసే క్రమంలో ప్లాట్‌ఫామ్‌, ఫ్లోర్‌పై నీళ్లు పడి అక్కడంతా తడితడిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి తడిదనానికి వాతావరణంలోని బ్యాక్టీరియా, వైరస్‌లు సులభంగా ఆకర్షితమవుతాయి. వండేటప్పుడు అవి మనకు తెలియకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతాయి. తద్వారా మనకే నష్టం. కాబట్టి కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, ఫ్లోర్‌ను రోజూ డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ద్రావణాలతో శుభ్రం చేయాలని చెబుతున్నారు నిపుణులు. తద్వారా వంటగది నీట్‌గా ఉండడంతో పాటు సూక్ష్మక్రిముల బెడద ఉండదు.

ఇవి కూడా!

* టైంపాస్ కోసమంటూ వివిధ రకాల ప్యాక్‌డ్ ఫుడ్స్ తెచ్చుకొని వంటింట్లో భద్రపరచుకుంటుంటారు చాలామంది. నిజానికి వీటివల్ల ఆరోగ్యానికి హాని తప్ప మరే ప్రయోజనం ఉండదు. మరో విషయం ఏంటంటే.. ఇలాంటి పదార్థాలు ఇంట్లో ఉంటే పండ్లు, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినాలన్న ఆలోచనే రాదంటున్నారు నిపుణులు. ఇదీ ఓ రకంగా అనారోగ్యకరమే కదా! అందుకే వాటికి బదులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తయారుచేసుకొని నిల్వ చేసుకోవడం మంచిదంటున్నారు.

* మాంసాహారం, చేపలు.. వంటివి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిపై ఓ మూత పెట్టి అలాగే వదిలేస్తుంటారు చాలామంది. అయితే దీనివల్ల వాటిలోని జ్యూసులు ఆవిరైపోయి.. అవి మరింత పొడిగా అయిపోతాయట! తద్వారా రుచీ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రై చేశాక వాటిపై నుంచి సిల్వర్‌ ఫాయిల్‌ పేపర్‌ను కవర్‌ చేస్తే ఈ సమస్య ఉండదు.

* టైం లేదంటూ బ్రేక్‌ఫాస్ట్‌ బయటే తినేయడం, ఇంటికొచ్చేటప్పుడు డిన్నర్‌ బయటి నుంచి తెచ్చుకోవడం లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వడం.. వంటివి చాలామందికి అలవాటు. ఇది అకేషనల్‌గా అయితే పర్లేదు.. అంతేకానీ రోజూ ఇలా తింటే మాత్రం లేనిపోని అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. కాబట్టి కాస్త వీలు చూసుకొని ఇంట్లోనే వండుకోవడం ఉత్తమం.

వంట చేసే క్రమంలో ఇలాంటివన్నీ దాదాపుగా అందరూ చేసే పొరపాట్లే! కాబట్టి ఇకనుంచైనా ఇవి పునరావృతం కాకుండా చూసుకుందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!
 మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని