అందుకే మనం ప్రొటీన్లు తీసుకోవాలట! - common protein myths and truth about them in telugu
close
Updated : 25/06/2021 17:39 IST

అందుకే మనం ప్రొటీన్లు తీసుకోవాలట!

జీవక్రియల పనితీరుకు, కండరాల దృఢత్వానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అలాగే గుండె పదిలంగా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి దోహదం చేస్తాయి. అయితే ప్రొటీన్లను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారని, కిడ్నీ సంబంధిత సమస్యలొస్తాయని, కండరాల పరిమాణం పెరిగి అబ్బాయిలా కనిపిస్తామేమోనని.. ఇలా ప్రొటీన్ల విషయంలో చాలామందిలో ఎన్నో అపోహలున్నాయి. ఫలితంగా ఎంతోమంది వీటిని దూరం పెడుతున్నారు. దీంతో చివరకు ప్రొటీన్ల లోపంతో పలు అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారు.

ఎంత తీసుకోవాలో తెలియట్లేదు!

ప్రొటీన్‌ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఇందులో భాగంగా ఆమె ఏం చెప్పారంటే..!

* భారతీయుల్లో సుమారు 73 శాతం మంది ప్రొటీన్‌ లోపంతో బాధపడుతున్నారు.

* 90 శాతం మందికి రోజుకు ఎంత మోతాదులో ప్రొటీన్లు తీసుకోవాలన్న విషయం కూడా తెలియదు.

* ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని జీర్ణం చేసుకోవడం కష్టమని 72 శాతం మంది భావిస్తున్నారు! అందుకే రాత్రిపూట వీటిని పూర్తిగా దూరం పెడుతున్నారు.

* ప్రొటీన్‌ ఫుడ్స్‌ ఖరీదైనవని 79 శాతం మంది భావన!

* ఇక 85 శాతం మంది ప్రొటీన్‌ అధిక బరువుకు దారితీస్తుందని, ఇది కేవలం బాడీ బిల్డర్స్‌కు మాత్రమే అవసరమ్యే పోషకమని అనుకుంటున్నారు.

* ప్రొటీన్ల విషయంలో ఉన్న అపోహల కారణంగా చాలామంది మహిళలు.. ముఖ్యంగా తల్లులు ఈ పోషకానికి దూరంగా ఉంటున్నారు.

అన్ని వయసుల వారికీ!

ప్రొటీన్లు శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు. శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా ఎముకలు, కండరాలను, కీళ్లను బలోపేతం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పోషకాలు ఎంతో అవసరం. వివిధ ప్రమాదాల కారణంగా శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడంలో ప్రొటీన్లు బాగా తోడ్పడతాయి. దీనివల్ల త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయడంలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి అన్ని వయసుల వారూ ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి..’ అంటున్నారు పూజ. అంతేకాదు.. ఈ నేపథ్యంలో ప్రొటీన్‌ పిజ్జా రెసిపీని సైతం పంచుకున్నారామె.

ప్రొటీన్‌ పిజ్జా ఇలా తయారుచేద్దాం!

కావాల్సిన పదార్థాలు

* నానబెట్టిన పెసలు - ఒక కప్పు

* పచ్చిమిర్చి - 2

* కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు

* బేకింగ్‌ సోడా - అర టీస్పూన్‌

* పిజ్జా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

* పుట్టగొడుగులు - 2 నుంచి 4 (సగానికి కట్‌ చేసుకోవాలి)

* ఆలివ్స్‌ - 2

* క్యాప్సికం ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు

* ఛీజ్‌ - 2 టేబుల్ స్పూన్లు

* ఉప్పు - రుచికి సరిపడా

* అల్లం - కొద్దిగా

తయారీ

రాత్రంతా నానబెట్టిన పెసళ్లను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ అరగంట పాటు పక్కన పెట్టి.. ఆ తర్వాత ఉప్పు, బేకింగ్‌ సోడా కలిపి స్మూతీ మాదిరిగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు వేడిచేసిన ప్యాన్‌పై ఈ మిశ్రమాన్ని కాస్త మందంగా పోయాలి. దీనిపై నూనె వేస్తూ రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపై పిజ్జా సాస్‌ అప్లై చేసి, పుట్టగొడుగులు, ఆలివ్స్‌, క్యాప్సికం ముక్కలు, ఛీజ్‌ను పరవాలి. చివరగా మూత పెట్టి 3నుంచి 5 నిమిషాలు సిమ్‌లో ఉంచితే రుచికరమైన ప్రొటీన్‌ పిజ్జా రడీ!

 

ఈ అపోహలు వీడండి!

* ప్రొటీన్లు అధికంగా తీసుకుంటే కిడ్నీ సంబంధిత సమస్యలొస్తాయి..

ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం లేకపోయినప్పటికీ.. ఇప్పటికే కిడ్నీలో రాళ్లు, ఇతర మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం వీటిని మితంగానే తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ సమస్యలున్న వారిలో ప్రొటీన్లు జరిపిన జీవక్రియల వల్ల వెలువడిన అన్ని వ్యర్థ పదార్థాలను శరీరం తొలగించలేకపోవచ్చు. తద్వారా కిడ్నీలపై మరింత భారం పడుతుంది. కాబట్టి ఇలాంటి వారు రోజుకు ఎంత ప్రొటీన్‌ తీసుకోవాలన్నది డాక్టర్‌ సలహా మేరకే నిర్ణయించుకోవడం మంచిది.

* ప్రొటీన్‌ అధిక బరువుకు కారణమవుతుంది.

ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే అనర్థమే! ప్రొటీన్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల అది శరీరంలో కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. తద్వారా బరువు పెరుగుతాం. అదే రోజువారీ ఎంత అవసరమో అంతే తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫలితంగా ఆహార కోరికలను అదుపు చేసుకొని బరువు తగ్గుతాం. కాబట్టి ప్రొటీన్‌ను మోతాదులో తీసుకున్నంత వరకు బరువు పెరుగుతామన్న భయమే అక్కర్లేదంటున్నారు నిపుణులు.

* కండలు పెంచుకోవాలనుకునే  వారికే ప్రొటీన్లు అవసరం.

ప్రొటీన్లలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల దృఢత్వానికి అవసరం. అలాగే ఈ ఆహారంతో ఎముకలు, కీళ్లు, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ప్రొటీన్‌ ఆహారాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. అయితే మోతాదులో తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది.

* మాంసాహారంలోనే ప్రొటీన్లు ఉంటాయి.

ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చేపలు, చికెన్‌, మటన్‌ లాంటి పదార్థాల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ.. కందులు, పెసలు, మినుములు, ఓట్స్‌, సబ్జా, నట్స్‌, పచ్చి బఠాణీలు, క్వినోవా, సోయా బీన్స్‌, చిక్కుళ్లు, బచ్చలి కూర, బంగాళాదుంపలు, బ్రకలీ, అరటి, జామ, బెర్రీ పండ్లలో కూడా ప్రొటీన్లు పుష్కలంగానే ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి శాకాహారులు కూడా మాంసాహారం తీసుకోకపోయినా శరీరానికి అవసరమైన మొత్తంలో ప్రొటీన్లను పొందచ్చు.

ఎవరైనా సరే.. రోజుకు ఎంత ప్రొటీన్‌ తీసుకోవాలనేది వాళ్ల బరువుపై ఆధారపడి ఉంటుందట! ఈ క్రమంలో ఆరోగ్యవంతులు ఒక కిలోకు 0.8 గ్రాముల చొప్పున ప్రొటీన్‌ తీసుకోవాలంటున్నారు నిపుణులు. అంటే సాధారణ బరువున్న మహిళలు రోజుకు 46 గ్రాముల దాకా ప్రొటీన్‌ను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చంటున్నారు. ఈ క్రమంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిదంటున్నారు.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని