నాలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదు! - covid effected woman shares her experience of isolating herself while away from the new born baby
close
Updated : 12/06/2021 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదు!

తన ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు కళ్లారా చూస్తానా అని పరితపించిపోతుంటుంది కాబోయే తల్లి. తనని చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతున్నట్లుగా ఊహించుకొని మైమరచిపోతుంటుంది. అలాంటిది పుట్టిన వెంటనే తన కలల పంటను కనీసం తాకనైనా తాకలేని పరిస్థితి వస్తే? ఆ కన్నతల్లి మనోవేదన మాటల్లో చెప్పలేం! తానూ అలాంటి బాధనే అనుభవించానంటోంది తిరుపతికి చెందిన స్నేహ. ప్రసవానికి వారం రోజుల ముందు కరోనా బారిన పడిన ఆమె.. అత్యవసర పరిస్థితుల్లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో అమ్మగా తన చిన్నారిని గుండెలకు హత్తుకోవాలని ఉన్నా.. దూరంగా ఉండాల్సి వచ్చిందని.. ఇలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదంటూ తన కొవిడ్‌ కథను ఇలా మన ముందుంచింది.
కరోనా మహమ్మారి ఎందరో జీవితాల్లో ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగుల్చుతోంది.. దీని కారణంగా నా జీవితంలోనూ పలు చేదు అనుభవాలు ఎదురవుతాయని నేను కలలో కూడా అనుకోలేదు. మాది ముందు నుంచీ ఉమ్మడి కుటుంబం. మా బంధువులబ్బాయి అజయ్‌తోనే నా పెళ్లి జరిపించారు అమ్మానాన్న. వాళ్లది కూడా ఉమ్మడి కుటుంబమే! మా కుటుంబాల్లో ఎవరింట్లో వేడుక/శుభకార్యం జరిగినా అందరిళ్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇలా ఆయా ప్రత్యేక సందర్భాల్ని అందరం కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవడం మాకు అలవాటు!

కరోనాకు ముందు వరకూ ఇదే ఆనవాయితీ కొనసాగింది. అయితే ఈ మహమ్మారి ఎప్పుడైతే మన మధ్య అడుగుపెట్టిందో అప్పట్నుంచి ఒకరింటికి మరొకరం వెళ్లడం పూర్తిగా తగ్గించేశాం. నిజానికి దీనివల్ల ఎంతో మిస్సవుతున్నట్లుగా అనిపించేది.. కానీ తప్పని పరిస్థితి! ఇక మరోవైపు నేను, మా వారు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో బిజీ అయిపోయాం! ఇలా ఓవైపు ఇంటి పనులు, మరోవైపు ఆఫీస్‌ పనులతోనే నెలలు గడిచిపోయాయి. ఇక అప్పుడప్పుడే కరోనా మొదటి దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. ఆ సమయంలోనే నేను గర్భవతినని తెలిసింది! ఓవైపు సంతోషంగా ఉన్నా.. మరోవైపు మనసులో ఏదో మూల తెలియని భయం.. కారణం కరోనా వల్ల ఏమవుతుందోనని! ఒక్కోసారి రెగ్యులర్‌ చెకప్స్‌, స్కానింగుల కోసం డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా దొరక్కపోయేది.. దీంతో కొన్నిసార్లు ఆన్‌లైన్‌లోనే డాక్టర్‌తో మాట్లాడేదాన్ని.

******

ఇక కొవిడ్‌ ప్రభావం కారణంగా నాకు తినాలనిపించిన పదార్థాల్ని బయటి నుంచి తెచ్చుకోలేక ఇంట్లోనే తయారుచేసుకొని తీసుకునేదాన్ని. మరికొన్ని పదార్థాలు చేసుకునే వీల్లేక నోరు కట్టేసుకునేదాన్ని. ఇలా కాస్త భయం, ఇంకాస్త ఆనందంతోనే నెలలు నిండుకున్నాయి. డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ డేట్‌ కూడా దగ్గర పడుతోంది. ప్రసవానికి పది రోజుల సమయం ఉందనగా ఒంట్లో ఏదో నలతగా అనిపించింది. పొట్ట ఎత్తుగా పెరిగింది కదా.. ఆ ఆయాసం వల్లేనేమో అనుకున్నా. కానీ మరుసటి రోజుకల్లా ఈ అలసటకు కాస్త జ్వరం కూడా తోడైంది. ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ని సంప్రదించాను. కొన్ని మందులు సూచించారు.. ఒకవేళ మరుసటి రోజుకల్లా తగ్గకపోతే ఓసారి కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవడం మంచిదని చెప్పారు. తను ఆ మాట అనేసరికి నాలో గుండె దడ మొదలైంది. మరుసటి రోజుకల్లా అంతా నార్మల్‌ అయిపోవాలని ఆ భగవంతుడిని వేడుకున్నా. కానీ జరిగింది మాత్రం భిన్నం. తెల్లవారే సరికల్లా జ్వరం ఇంకాస్త ఎక్కువైంది.. దీనికి తోడు వాసన, రుచి పసిగట్టలేకపోతున్నానని గ్రహించా.

ఇలా నాలో ఉన్న లక్షణాల గురించి మా గైనకాలజిస్ట్‌తో మాట్లాడాను. తాను ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వచ్చేయమన్నారు. అక్కడే కొవిడ్‌ టెస్ట్‌ చేశారు.. పాజిటివ్‌గా తేలింది. ఇన్నాళ్లూ నేను ఇంట్లోనే ఉన్నాను.. తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. మా కుటుంబ సభ్యులు కూడా బయటికి వెళ్లిన సందర్భాలు తక్కువ! అలాంటిది నాకు వైరస్‌ ఎలా సోకిందో ఇప్పటికీ ప్రశ్నార్థకమే! ఇక నన్ను వైద్యులు డెలివరీ కోసం ఆస్పత్రిలో చేర్చుకొని అబ్జర్వేషన్‌లో ఉంచారు. రెండుమూడు రోజులు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లే అనిపించింది. కానీ ఆ తర్వాత నా ఆక్సిజన్ స్థాయులు క్రమంగా క్షీణించసాగాయి. దాంతో నాకు ఆక్సిజన్‌ అందించడం మొదలుపెట్టారు. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటనే సిజేరియన్‌ చేసి బేబీని బయటికి తీశారు. నేను, మా వారు కోరుకున్నట్లే మాకు మహాలక్ష్మి పుట్టింది. నా ఆరోగ్యం ఎలా ఉన్నా.. మాకు పాప పుట్టిందన్న సంతోషమే నా మనసును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక పాపకు కూడా కొవిడ్‌ పరీక్ష చేయగా నెగెటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నా.

******

ఇక డెలివరీ తర్వాత నన్ను ఐసీయూలో, నా బేబీని ఎన్‌ఐసీయూలో ఉంచారు. దీంతో పుట్టగానే నా పాపను కళ్లారా చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. కేవలం పాలు పట్టేటప్పుడు మాత్రమే నా దగ్గరికి తీసుకొచ్చేవారు. మిగతా సమయాల్లో నా నుంచి దూరంగా ఉంచారు. అది నన్నెంతో బాధపెట్టింది. కానీ బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా తప్పని పరిస్థితి! ప్రసవానికి ముందు వరకు క్రమంగా తగ్గుతూ నన్ను భయపెట్టిన ఆక్సిజన్ లెవెల్స్ డెలివరీ తర్వాత మాత్రం క్రమంగా పెరగసాగాయి. అయినా రెండు రోజుల పాటు నన్ను ఐసీయూలోనే అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత ఐసొలేషన్‌ వార్డుకు మార్చారు. ఆ మరుసటి రోజే నా బిడ్డను డిశ్చార్జ్‌ చేశారు.. నన్ను మాత్రం ఐదు రోజుల తర్వాత మళ్లీ కొవిడ్‌ టెస్ట్‌ చేసి నెగెటివ్‌ వచ్చాక ఇంటికి పంపించారు. ఇంటికెళ్లాక కూడా మరో రెండు వారాల పాటు కొవిడ్‌ నియమాలు కచ్చితంగా పాటించాలని, పాపాయికి దూరంగా ఉండాలని, జాగ్రత్తలు పాటిస్తూనే పాలివ్వాలని చెప్పారు డాక్టర్లు.

ఈ క్రమంలో ఆ రెండు వారాలు నేను పాప నుంచి దూరంగా ప్రత్యేకమైన గదిలోనే గడిపాను. ఇక పాపను అమ్మా వాళ్లు, మా వారు చూసుకునే వారు. పాలిచ్చేటప్పుడు మాత్రమే నా దగ్గరికి తీసుకొచ్చేవాళ్లు. అలా తనను చూడగానే నా మనసులో ఏదో తెలియని ఆనందం.. రోజంతా తనతోనే ఉండాలనిపించేది.. కానీ ఉండలేని పరిస్థితి! దాంతో ఒక్కోసారి ఏడ్చేసేదాన్ని. డెలివరీ తర్వాత పుట్టిన బేబీకి ఇలా దూరంగా ఉండాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. కరోనా ఏమో గానీ ఆ రెండు వారాలూ తల్లిగా తల్లడిల్లిపోయా! ఇలాంటి పరిస్థితి మరే తల్లీకీ రాకూడదని ఆ భగవంతుడిని కోరుకున్నా. ఎలాగైనా సరే.. త్వరగా కోలుకోవాలి.. తిరిగి నా పాపను దగ్గరికి తీసుకోవాలి.. అని నా మనసుకు సర్దిచెప్పుకొని డాక్టర్‌ సూచించిన చిట్కాలన్నీ పాటించడం మొదలుపెట్టా. చక్కటి పోషకాహారం, రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం, స్మెల్‌ ట్రైనింగ్‌, ఉదయం-సాయంత్రం శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటి చిట్కాలన్నీ పాటించా. కొవిడ్‌ లక్షణాలన్నీ తగ్గిపోయి నేను కోలుకోవడానికి సుమారు ఇరవై రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత ఓసారి డాక్టర్‌ను సంప్రదించి తిరిగి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టా..!
బిడ్డను దగ్గరికి తీసుకోవడం, ముద్దులాడడం, పక్కన పడుకోబెట్టుకోవడం.. ఇలా ఈ ఇరవై రోజుల్ల్లో నేను మిస్సయిన అనుభూతులన్నీ ఇప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తున్నా. అమ్మతనంలోని కమ్మదనాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా. ఇక చివరగా మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. అసలు నాకు వైరస్‌ ఎలా సోకిందో ఇప్పటికీ అంతు చిక్కని విషయమే! ఎందుకంటే అన్ని జాగ్రత్తలూ పాటించినా నేను వైరస్‌ బారిన పడ్డా. కాబట్టి ఈ విషయంలో ఏమరపాటుగా ఉండద్దు. ఇక అర్హత ఉన్న వారు వ్యాక్సిన్‌ వేయించుకోవడమే మంచిది. ఎందుకంటే దీనివల్ల తమను తాము రక్షించుకోవడంతో పాటు తమ కుటుంబంలో ఉండే గర్భిణులు, చిన్నపిల్లలు, బాలింతలకు వైరస్‌ సోకకుండా అడ్డుకోవచ్చు. అసలే మరికొన్ని నెలల్లో మూడో దశ ముప్పు ఉందని, ఇది పిల్లలపై మరింత ప్రభావం చూపనుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొనైనా టీకా తీసుకోండి.. అలాగని కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడమూ మరవకండి..!


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని