ఆఖరి చూపుకీ నోచుకోలేదు.. వీడియో కాల్‌లోనే తండ్రికి అంతిమ వీడ్కోలు! - delhi doctor shares her experiences about treating covid patients
close
Updated : 25/06/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఖరి చూపుకీ నోచుకోలేదు.. వీడియో కాల్‌లోనే తండ్రికి అంతిమ వీడ్కోలు!

ఒకవేళ కరోనా సోకితే ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఐసొలేషన్లో విడిగా ఉండక తప్పని పరిస్థితి.. అయితే ఈ ఒంటరితనం కొద్ది రోజులకు మాత్రమే పరిమితమవుతుంది. మళ్లీ కోలుకున్నాక, ఆరోగ్యం కుదుటపడ్డాక  మునుపటి లాగే కుటుంబంతో కలిసి ఉండచ్చు.. అయితే నిరంతరం కొవిడ్‌ బాధితులకు సేవ చేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది మాత్రం కొన్ని సందర్భాలలో ఏకంగా నెలల తరబడి వారి కుటుంబాలకే దూరం కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ.. తిరిగి తమ కుటుంబ సభ్యులతో మునుపటిలా ఎప్పుడు కలుస్తామోనన్న మానసిక వేదన ఎంతోమంది వైద్య సిబ్బందిలో ఉందనడం కాదనలేని సత్యం.

తానూ ఇలాంటి క్షోభనే అనుభవిస్తున్నానని చెబుతోంది దిల్లీకి చెందిన విజితా సాహ్ని అనే వైద్యురాలు. సుమారు ఏడాది కాలంగా కరోనా రోగుల అవస్థల్ని దగ్గర్నుంచి చూస్తోన్న ఆమె.. ఇలాంటి దయనీయ పరిస్థితులు పగ వారికి కూడా రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానంటోంది. అంతేకాదు.. శారీరకంగా, మానసికంగా హింస పెట్టే ఈ మహమ్మారి బారిన పడకూడదంటే టీకా వేయించుకోవడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించడమే పరిష్కారమంటూ.. తన మానసిక వేదనను ఇలా మన ముందుంచింది.

మాది దిల్లీ. అమ్మా, నాన్న, చెల్లితో కలిసి ఇక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నా. నేను వృత్తిరీత్యా డాక్టర్‌ని. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనాకు ముందు, తర్వాత అన్నట్లుగా మారాయి. ఏడాదికి ముందు వరకు రోజూ హాస్పిటల్‌కి వెళ్లి రావడం, కాసేపు ఇంట్లో వాళ్లతో సమయం గడపడం, ఆపై అందరం కలిసి డిన్నర్‌ చేయడం.. ఇలా మా ఫ్యామిలీ రొటీన్‌ సాగేది. కానీ ఎప్పుడైతే ఈ మహమ్మారి మన మధ్యన అడుగుపెట్టిందో.. మనుషుల మధ్య దూరం పెరిగింది. అదెంతలా అంటే.. మాలాంటి వైద్య సిబ్బందైతే నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పటివరకు ఒంటరితనం గురించి వినడమే కానీ.. అది ప్రత్యక్ష నరకం అని ఇప్పుడు అనుభవిస్తుంటే నాకు అర్థమవుతోంది.

గతేడాది కరోనా మన దేశంలోకి ప్రవేశించినప్పట్నుంచి నేను మా ఆస్పత్రి ఐసీయూలోనే విధులు నిర్వర్తిస్తున్నా. మొదటి దశ కంటే రెండో దశలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో నా వల్ల నా కుటుంబం ప్రమాదంలో పడకూడదన్న ఉద్దేశంతో కనీసం ఇంటికి కూడా వెళ్లట్లేదు. కానీ వాళ్లను దగ్గర్నుంచి చూసేందుకు వీలుగా మా అపార్ట్‌మెంట్‌లోనే వేరే ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నా. రోజూ హాస్పిటల్‌కి వచ్చేటప్పుడు, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మెట్లపై నుంచే వారిని పలకరించడం.. కుదిరినప్పుడల్లా వీడియో కాల్స్‌ చేయడం.. ఇలా వాళ్లకు దూరంగా ఉండడం ఎంతో బాధగా ఉన్నా తప్పట్లేదు. ఇక ఈ ఏడాది కాలంలో ఎన్నిసార్లు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నానో నాకే తెలియదు.. మళ్లీ వాళ్లతో కలిసి మునుపటిలా హాయిగా కబుర్లు చెబుతూ భోంచేసే భాగ్యం ఎప్పటికి ఉందో ఏమో! అనిపిస్తోంది.

ఇలా ఇంటి దగ్గర ఒంటరితనంతో మనసు కకావికలమవుతుంటే.. ఆస్పత్రిలో శారీరకంగా అలసిపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా బాధితులకు సేవలందించే క్రమంలో గంటల తరబడి పీపీఈ కిట్లలోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆహారం తినడం, నీళ్లు తాగే వెసులుబాటు కూడా ఉండదు. ఇలా ఒకసారి కిట్‌ ధరించామంటే ఇక షిఫ్ట్‌ ముగిసే దాకా దాన్ని తొలగించడానికి వీలుండదు. ఈ క్రమంలో రోజుకు ఎనిమిది నుంచి పది గంటల పాటు ఉక్కపోతను తట్టుకుంటూ పీపీఈలో ఉండాల్సిందే! దీనికి తోడు పిరియడ్స్‌ వచ్చినప్పుడు మా పరిస్థితి మరింత దారుణం. పీపీఈలో ఉన్నప్పుడు పదే పదే శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ మార్చుకోవడం కుదరదు. ఆ సమయంలో డైపర్లే మమ్మల్ని రక్షిస్తున్నాయని చెప్పచ్చు. ఇక సాధారణ సమయాల్లో కూడా మధ్యలో ఎలాంటి విరామం ఉండదు కాబట్టి డైపర్లు వేసుకోవాల్సిందే! నిజానికి ఈ పరిస్థితి శారీరకంగానే కాదు.. మానసికంగానూ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.

******

అయినా ఇవన్నీ భరిస్తూ కరోనా బాధితులకు సేవ చేయడం మా బాధ్యత! పేషెంట్స్‌నే మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారిని ఈ మహమ్మారి నుంచి బయటపడేలా చేస్తున్నాం. అయితే కొంతమంది రోగులు మాత్రం ఈ వైరస్‌ నుంచి కోలుకోలేకపోవడం చాలా బాధగా అనిపిస్తోంది. ఆరోగ్యం బాగోలేనప్పుడు, మనసు మన అధీనంలో లేనప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరి తోడు కావాలనుకుంటాం.. కానీ కరోనా అది కూడా లేకుండా చేసింది. మా ఐసీయూలో చికిత్స పొందుతోన్న చాలామంది బాధితులు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. కొంతమందైతే ఐసీయూలో చేరితే మళ్లీ తిరిగి ఇంటికి వెళ్తామో, లేదో.. కుటుంబ సభ్యుల్ని చూస్తామో లేదోనన్న భయాందోళనల్లో ఉన్నారు. వీళ్లే కాదు.. ఇంట్లో ఉన్న వీరి కుటుంబ సభ్యుల పరిస్థితీ ఇదే! ఓరోజు ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు మా ఆస్పత్రికి ఫోన్‌ చేసి.. తాము ఆ వ్యక్తిని దగ్గరుండి చూసుకుంటామని అడిగారు.. ఎంతో బతిమాలారు.. కానీ కొవిడ్‌తో చికిత్స పొందుతోన్న బాధితుల విషయంలో ఎక్కడా ఆ అవకాశం లేదు. ఇదే విషయం చెప్పేసరికి ఎంతో నిరాశకు గురయ్యారు.

ఇక మరో వ్యక్తి చావుబతుకుల మధ్య ఉన్న తన తండ్రిని ఆఖరి చూపు చూడ్డానికి వచ్చారు. లోపలికి వస్తానంటూ ఎంతో ప్రాధేయపడ్డాడు.. గొడవపడ్డాడు. అయినా అది కుదరకపోయే సరికి.. ఆఖరికి వీడియో కాల్‌లోనే ఆయనకు వీడ్కోలు పలకడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. ఒకటా రెండా.. ఈ ఏడాది కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాను. వాటన్నింటినీ తలచుకుంటుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇలాంటి పరిస్థితులు శత్రువులకు కూడా ఎదురుకాకూడదు. నా కెరీర్‌లో ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూస్తానని కలలో కూడా అనుకోలేదు. నిజానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్‌కు దూరంగా ఉంటోన్న వారంతా అదృష్టవంతులు అని చెప్పచ్చు.

******

అయితే అదే సమయంలో కొంతమంది టీకా తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగానూ ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు క్రమంగా తగ్గడం కూడా ఇందుకు కారణం. కానీ ఇలాంటి అలక్ష్యం మూడో దశ ముప్పును తెచ్చిపెడుతుంది. అదే జరిగితే చిన్నారులకు ముప్పు తప్పదని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కాబట్టి కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకునే బదులు ముందు జాగ్రత్తగా ఉండడమే మంచిది. పిల్లలకు ప్రస్తుతం ఎలాగూ టీకా అందుబాటులో లేదు కాబట్టి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. వారికి మూడో దశ ముప్పును తప్పించాలి. మాస్క్‌ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఇవే మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని కరోనా ముప్పు నుంచి కాపాడతాయి. వైరస్‌ విషయంలో మనందరం ఇలా మూకుమ్మడిగా పోరాటం చేస్తే అది అంతమవడానికి ఎన్నో రోజులు పట్టదు!
స్టే స్ట్రాంగ్‌.. స్టే సేఫ్‌!


మరిన్ని

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని