ఈ చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి! - easy ways to boost blood circulation for healthy looking skin in telugu
close
Published : 19/09/2021 18:19 IST

ఈ చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం కొందరు మార్కెట్లో దొరికే రకరకాల సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటే, మరికొందరు బ్యూటీపార్లర్లు, స్పాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. ఇలా రసాయనాలుండే బ్యూటీ ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. పైగా అందరిలోనూ ఇవి సానుకూల ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మొటిమలు, మచ్చలు, గీతలు లాంటి చర్మ సమస్యలకు కారణమేంటన్నది కచ్చితంగా కారణాలు తెలుసుకోవాల్సిందే. ఒక్కోసారి శరీరంలోని కొన్ని వ్యవస్థలు గాడితప్పితే ఆ ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. ప్రత్యేకించి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే పలు రకాల చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అందంగా మెరిసిపోవాలంటే!

చర్మ సౌందర్య నిపుణుల ప్రకారం రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటే శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా శాతం క్రమంగా పెరుగుతుంది. శరీరంలోని హానికారక పదార్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం లోలోపలి నుంచే నిగారింపును సంతరించుకుంటుంది. మరి చర్మ సౌందర్య నిపుణులు సూచిస్తున్నట్లు రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచుకుని, అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.

వ్యాయామం చేయండి..

వ్యాయామాలు, వర్కవుట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. వ్యాయామాలు చేయడం వల్ల హృదయ స్పందనల రేటు పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్తప్రవాహం కూడా పెరుగుతుంది. రన్నింగ్‌, యోగా, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వల్‌ ట్రైనింగ్‌) లాంటి వ్యాయామాలను వారంలో 5 రోజుల చొప్పున కనీసం 30 నిమిషాల పాటు చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.

ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి..

ఎలాంటి రసాయన ఉత్పత్తులు వాడకుండా సహజమైన పద్ధతుల్లో అందంగా మెరిసిపోవాలంటే మంచినీటికి మించిన సాధనం మరొకటి లేదు. చర్మ సౌందర్య నిపుణులు కూడా ఎక్కువగా ఇదే మాట చెబుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల విషతుల్యాలు, హానికారక పదార్థాలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం కచ్చితంగా చర్మంపై పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరంలో తగినంత నీటి స్థాయులు ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలో- మంచి నీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్‌జ్యూస్‌లను తీసుకున్నా మంచి ఫలితముంటుంది.

హెల్దీ ఫుడ్స్..

చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను ఆహారంగా తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం. వీటి స్థానంలో ఆకుపచ్చని కూరగాయలు, సిట్రస్‌ పండ్లను డైట్‌లో భాగం చేసుకుంటే బాగుంటుంది. ఇందులో సమృద్ధిగా ఉండే ఫైబర్‌ రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

చన్నీటి స్నానం..

చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమ పద్ధతిలో రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా శరీర ఆరోగ్యంతో పాటు చర్మం మెరుపును సంతరించుకుంటుంది. శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఫేషియల్‌ మసాజ్..

కొన్ని రకాల ఫేషియల్‌ మసాజ్‌ల వల్ల కూడా చర్మం సహజంగా మెరుపును సంతరించుకుంటుంది. ఈ మసాజ్‌ల వల్ల ముఖం, చర్మంపై ఉండే లింఫ్‌ గ్రంథులపై మర్దన జరిగి ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయి. అంతేకాదు శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా ఆక్సిజన్‌ అందుతుంది. ఫలితంగా చర్మం మృదువుగా, తాజాగా మారుతుంది. రోజూ కనీసం 10-15 నిమిషాల పాటు ఇలా ఫేషియల్‌ మసాజ్‌ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. మసాజ్ కోసం జేడ్ రోలర్ వంటి పరికరాలను కూడా వాడచ్చు.

ఆ అలవాట్లను దూరం చేసుకోండి!

స్మోకింగ్‌, మద్యపానం లాంటి అలవాట్లు ఉన్నవారు వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. ఇవి రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్రత్యేకించి పొగాకు సంబంధిత పదార్థాలు రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఫలితంగా రక్తపోటు, గుండెపోటు లాంటి సమస్యలకు లోను కావడంతో పాటు చర్మం నిగారింపును కోల్పోతుంది.



మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని