ప్లాస్టిక్‌ డబ్బాల్ని ఇలా శుభ్రం చేద్దాం..! - easy ways to clean plastic food boxes in telugu
close
Published : 02/07/2021 15:16 IST

ప్లాస్టిక్‌ డబ్బాల్ని ఇలా శుభ్రం చేద్దాం..!

ప్లాస్టిక్‌ని మన జీవితం నుంచి ఎంత దూరం చేసుకోవాలనుకున్నా అప్పుడప్పుడూ ఏదో ఒక విధంగా ఆ వస్తువుల్ని వాడాల్సి వస్తోంది. స్నాక్స్‌ నిల్వ చేసుకోవడం, మిగిలిపోయిన పదార్థాల్ని అందులో పెట్టడం, పప్పుల్లాంటి నిత్యావసరాలు భద్రపరచుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ప్లాస్టిక్‌ డబ్బాల్ని ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వాడడమే కాదు.. ఎప్పటిప్పుడు శుభ్రం చేయడమూ ముఖ్యమే! లేదంటే వాటిల్లో నిల్వ చేసిన కూరలు, ఇతర పదార్థాల వాసన ఓ పట్టాన వదలదు.. అలా సబ్బునీటితో పైపైన కడిగేసి వేరే పదార్థం ఆ డబ్బాలో నిల్వ చేసినా ఆ వాసన దీనికి పడుతుంటుంది. మరి, ఇలా జరగకూడదంటే ప్లాస్టిక్‌ డబ్బాల్ని శుభ్రం చేసే క్రమంలో ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

* ముందుగా చల్లటి నీటితో ప్లాస్టిక్‌ డబ్బాల్ని/పాత్రల్ని ఓసారి కడిగేయాలి. ఆ తర్వాత వీటిలో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడా వేయాలి. దీన్ని ఓ రోజంతా అలాగే ఉంచి.. ఆపై సబ్బునీటితో కడిగేస్తే సరిపోతుంది. బేకింగ్‌ సోడా పాత్రల్లోని చెడు వాసనను దూరం చేయడంలో సహకరిస్తుంది.

* కాఫీ తాగాక మిగిలిన పిప్పితో కూడా ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి వచ్చే దుర్వాసనల్ని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం ఆ పిప్పిని డబ్బాలో వేసి రోజంతా అలాగే ఉంచేయాలి. తద్వారా కాఫీ పిప్పి ఆ దుర్వాసనను పీల్చేసుకుంటుంది.

* నిమ్మరసంలోని సిట్రికామ్లం పాత్రలకు అంటుకున్న పదార్థాల వాసనను దూరం చేయడంలో మరింత సమర్థంగా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మచెక్కతో ఆ పాత్రను ఓసారి రుద్ది.. ఆపై సబ్బునీటితో కడిగేయాలి.

* కొన్ని ప్లాస్టిక్‌ డబ్బాలు ఎంత శుభ్రం చేసినా అందులో నిల్వ చేసిన పదార్థాల వాసన ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు వెనిగర్‌తో వాటిని శుభ్రపరిస్తే ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఆయా పాత్రలు/డబ్బాల్లో చల్లటి నీరు/గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో పావు కప్పు వెనిగర్‌ వేయాలి. ఇలా ఐదారు గంటల పాటు దాన్ని పక్కన పెట్టి.. ఆపై సబ్బునీటితో కడిగేయాలి. వెనిగర్‌ సహజసిద్ధమైన డియోడరెంట్‌గా పనిచేస్తుంది.

* వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కూడా ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి వచ్చే వాసనల్ని తొలగించడంలో సహకరిస్తుంది. ఈ క్రమంలో ఆయా డబ్బాల్ని వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌తో నేరుగా రుద్దాలి. లేదంటే డబ్బాలో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో కొద్దిగా వెనీలా వేసి.. ఓసారి షేక్‌ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. ఆపై సాధారణ పాత్రల్లాగే సబ్బునీటితో కడిగేస్తే సరిపోతుంది.

* ప్లాస్టిక్‌ డబ్బాల నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు ఒక చార్‌కోల్‌ ముక్కను అందులో వేసి మూత పెట్టేయాలి. ఇలా రెండు రోజులు దాన్ని ముట్టకుండా పక్కన పెట్టేస్తే.. ఆ వాసనంతా చార్‌కోల్‌ పీల్చేసుకుంటుంది.

* కొన్నిసార్లు డబ్బాల్ని కడిగిన వెంటనే మూత పెట్టేసి పక్కనుంచుతాం. అయితే ఈ క్రమంలో అవి పూర్తిగా ఆరకపోయినా అందులో నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు వాటిని మూత తీసి ఓ రోజంతా గాలి తగిలేలా ఉంచాలి.. లేదంటే నేరుగా ఎండ పడే చోట ఉంచినా ఫలితం ఉంటుంది.

* రోజూ పాలు తెచ్చుకునే ప్లాస్టిక్‌ డబ్బాలు/బాటిల్స్‌ నుంచి అదో రకమైన వాసన రావడం మనకు అనుభవమే! ఇక ఈ వాసన ఎంత కడిగినా పోదు. అలాంటప్పుడు ఆ డబ్బా/బాటిల్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. తద్వారా చక్కటి ఫలితం ఉంటుంది.

* ఒక న్యూస్‌పేపర్‌ని మడిచి వాసన వచ్చే ప్లాస్టిక్‌ డబ్బాలో చొప్పించి మూత పెట్టేయాలి. ఇలా దీన్ని ఒకట్రెండు రోజులు పక్కన పెట్టేయాలి. ఈ చిట్కా వల్ల కూడా ప్లాస్టిక్‌ డబ్బాల్లోని దుర్వాసనలు దూరమవుతాయట!

ఈ చిట్కాలన్నింటితో ప్లాస్టిక్‌ డబ్బాల్లోని దుర్వాసనలే కాదు.. వాటిపై పడిన పదార్థాల మరకలు సైతం వదిలిపోతాయి. మరి, మీ ఇంట్లో ఉండే ప్లాస్టిక్‌ వస్తువుల్ని శుభ్రం చేసుకోవాలంటే మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారో మాతో పంచుకోండి.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని