ఆ ఫైల్స్‌ అన్నీ ఇలా పొందికగా సర్దేద్దాం! - easy ways to organize files in your home
close
Updated : 24/06/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఫైల్స్‌ అన్నీ ఇలా పొందికగా సర్దేద్దాం!

ఆఫీస్‌ ఫైల్స్‌, పిల్లల మార్క్‌ మెమోలు, సర్టిఫికెట్లు,  పెద్దవాళ్ల మెడికల్‌ రిపోర్టులు.. నిజానికి ఇలాంటి ఫైల్స్‌ అన్నీ ఇంట్లో ఎక్కడెక్కడో ఉంటాయి. తీరా సమయానికి ఓ పట్టాన దొరకవు. దాంతో సమయం వృథా అవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వెతికే శ్రమా తప్పదు. మరి, ఇలా జరగకూడదంటే ఫైల్స్‌ అన్నీ ఒకేచోట పొందికగా సర్దుకోవడం ఒక్కటే మార్గం. ఆ ఓర్పు, నేర్పు మనకు తప్ప మరెవరికి ఉంటుంది చెప్పండి! అయితే ఆలస్యమెందుకు..? ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూనే వాటిని నీట్‌గా సర్దేద్దాం రండి!

అనువుగా ఉన్న చోట!

పిల్లల మార్క్‌ మెమోలు, ప్రోగ్రెస్‌ రిపోర్టులు, పెద్దలకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులు.. వంటివన్నీ వేటికవే విడివిడిగా ఒక కవర్లో పెట్టినప్పటికీ.. వాటిని బీరువా/అల్మరాలో ఏదో మూల పడేయడం.. అవసరం ఉన్నప్పుడు మళ్లీ తీసుకోవచ్చులే అంటూ వాటి పట్ల నిర్లక్ష్యం చేస్తుంటారు కొంతమంది. ఇక ఈ పనిని పిల్లలు, పెద్దలకు అప్పగిస్తే వారు ఎక్కడో పెట్టి మర్చిపోయే అవకాశమూ లేకపోలేదు. తీరా అవి కావాలనుకున్నప్పుడు ఆ ఫైల్‌ ఎక్కడ పెట్టానబ్బా అని వెతుకుతుంటాం.. మరి, ఈ శ్రమంతా పడే బదులు.. విడివిడిగా అమర్చిన ఆ కవర్లన్నీ ఇంట్లో మీకు అనువుగా ఉన్న చోట, మీకు బాగా గుర్తుండే చోట పెట్టుకుంటే  వెంటనే తీసుకోవచ్చు. ఈ క్రమంలో కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, పడక గది.. ఇలా మీకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడ అల్మరాలో లేదంటే టేబుల్‌ డ్రాలో పెట్టుకుంటే పని సులువవుతుంది.

వాటిని గది దాటనీయకండి!

వృత్తిలో భాగంగా కొంతమంది పేపర్‌ క్లిప్పింగ్స్‌ సేకరిస్తుంటారు.. ఆర్టికల్స్‌ రాయడం, ఇతర పేపర్లలోని ఆర్టికల్స్‌ని, యాడ్స్‌ని కలెక్ట్‌ చేయడం.. వంటివి చేస్తుంటారు. ఇలా మీరు చేసే పేపర్‌ వర్క్‌ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతే సమయానికి అవి దొరక్కపోవచ్చు. కాబట్టి ఇలాంటి ఆఫీస్‌కి సంబంధించిన కాగితాలన్నీ హోమ్‌ ఆఫీస్‌ క్యాబిన్‌ దాటకుండా చూసుకోవడమే మంచిది. ఎలాగూ ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు.. అందుకోసం ప్రత్యేకంగా ఓ గది లేదంటే ఆఫీస్‌ సెటప్‌ చేసుకొనే ఉంటారు కాబట్టి అక్కడ మీరు ఏర్పాటు చేసుకున్న టేబుల్ పైనే ఓ పద్ధతి ప్రకారం వీటిని అమర్చుకోవచ్చు. కావాలంటే వీటిని దేనికదే విభజించుకొని ప్రత్యేకమైన ఫోల్డర్స్‌లో పెట్టుకోవడం.. గుర్తుగా వాటిపై ఓ చిన్న లేబుల్‌ రాసి అతికించుకోవడం చేస్తే ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటాయి. అలాగే- వీలైనంత వరకు ఇలాంటి పేపర్‌ క్లిప్పింగ్స్ తాలూకు డిజిటల్ ఫైల్స్ సేకరించి కంప్యూటర్‌లో సేవ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

అవన్నీ ఎంట్రన్స్‌లోనే..!

ఇంట్లో ఫైల్సే కాదు.. కరెంట్‌ బిల్లు, డిష్‌ బిల్లు, పేపర్‌ బిల్లు, సిలిండర్‌ తీసుకున్నప్పుడు వాళ్లిచ్చే రసీదు.. ఏదైనా వస్తువు కొంటే గ్యారంటీ కార్డు, కూపన్లు.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటన్నింటినీ మిగతా ఫైల్స్‌తో కలిపి బీరువాలో పెడితే పదే పదే తీయాల్సి రావచ్చు.. అలాగే మరికొంతమంది ఈ బిల్లులన్నీ ఫ్రిజ్‌ కవర్‌కి ఉండే పాకెట్స్‌లో వేసేస్తుంటారు. దీనివల్ల చెత్త పేరుకుపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలా బిల్లులన్నీ చెల్లించాక పడేసే పేపర్లన్నీ ముందు రూమ్‌లోనే అమర్చడం మంచిది. ఇందుకోసం గోడకు తగిలించుకునేలా ఓ ఫైల్‌ హోల్డర్‌/ఆర్గనైజర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక వీటితో పని పూర్తయ్యాక ఎప్పటికప్పుడు పడేసేలా అక్కడే ఓ చిన్న డస్ట్‌ బిన్‌ ఏర్పాటు చేసుకుంటే పని మరింత సులువవుతుంది. ఫోల్డర్‌ కూడా నీట్‌గా ఉంటుంది.

వీటితో మరింత ఆకర్షణీయంగా!

ఫైల్స్‌ అన్నీ ఎక్కడెక్కడో పెట్టడం వద్దు.. అన్నీ ఒకే చోట అమర్చుకోవాలనుకునే వారు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఫైల్‌ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.. ఇక స్థలం ఆదా చేసుకోవాలనుకునే వారు మీ ఇంట్లో ఖాళీ ఉన్న చోట లేదంటే ఆఫీస్‌ క్యాబినెట్‌ దగ్గర వాల్‌ మౌంటెడ్‌ ఫైల్‌ క్యాబినెట్‌ కూడా డిజైన్‌ చేయించుకోవచ్చు. వీటిలో వేటికవే సెపరేట్‌గా అమర్చుకుంటే కావాలనుకున్నప్పుడు సులభంగా దొరుకుతాయి.. అలాగే నీట్‌గా కూడా ఉంటుంది.

ఇవి కూడా!

* ఫైల్స్‌తో పాటు పెన్నులు, పెన్సిళ్లు, కత్తెర, పేపర్‌ క్లిప్స్, స్టాప్లర్.. వంటి స్టేషనరీ యాక్సెసరీస్‌ నీట్‌గా సర్దుకోవడానికి వీలుగా ఒకే క్యాబిన్‌లో విడివిడిగా పార్టిషన్స్‌ చేయచ్చు.. లేదంటే బాక్సుల్లో అమర్చుకొని డ్రాలో పెట్టేసుకోవచ్చు.
* ఇంట్లో ఉండే ఫైల్స్‌ని పొందికగా అమర్చుకోవడానికి కలర్‌ కోడింగ్‌ పద్ధతిని సైతం ఉపయోగించుకోవచ్చు. అలాగని అదేం పెద్ద పని కూడా కాదు.. ఆఫీస్‌ ఫైల్స్‌, మెడికల్‌ రిపోర్టులు, బిల్లులు.. ఇలా వీటన్నింటికీ ప్రత్యేకంగా ఒక్కో కలర్‌ని ఎంచుకోవాలి. దాన్ని బట్టి ఆయా కలర్‌ ఫోల్డర్లలో పెట్టచ్చు.. లేదంటే ఫైల్‌ క్యాబిన్‌కు ఆయా రంగులు కూడా వేసుకోవచ్చు.
చూశారుగా.. ఇంట్లో ఉండే ఫైల్స్‌/పేపర్స్‌ని చిందర వందరగా పడేయకుండా పొందికగా అమర్చుకునే మార్గాలేంటో! మరి, మీ ఇంట్లో ఫైల్స్‌ని మీరెలా సర్దుకున్నారు? ఆ చిట్కాలేంటో మాతో పంచుకోండి.. తోటి మహిళలకూ అవి ఉపయోగపడచ్చు!


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని