వర్షాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే... - follow these tips to manage your weight in this monsoon
close
Published : 31/07/2021 17:29 IST

వర్షాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే...

కొద్దికాలంగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు చల్లటి గాలులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతిని ఆస్వాదిస్తూ వేడి వేడి పకోడీలు, సమోసాలు, బజ్జీలు వంటి వేయించిన పదార్థాలను ఎక్కువగా లాగించేస్తుంటారు చాలామంది. ఇక టీలు, కాఫీల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇలా ఇష్టారీతిన తినడం వల్ల అధిక బరువుపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.

జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోండి!

వర్షాకాలంలో బయట దొరికే ఆహార పదార్థాలను తినడం వల్ల విరేచనాలు, వాంతులు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో వర్షాకాలంలో బరువు పెరగకుండా ఉండేందుకు ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసుకుందాం రండి.

టీ, కాఫీలకు బదులుగా!

ఉదయం టీ తాగనిదే చాలామందికి రోజు ప్రారంభం కాదు. ఇక వర్షాకాలంలో అయితే అదే పనిగా లెక్కలేనన్ని సార్లు టీ, కాఫీలు లాగిస్తుంటారు. అయితే టీ, కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల వీటిలోని కెఫీన్‌ పలు దుష్ర్పభావాలకు దారి తీస్తుంది. అలాగని వీటిని పూర్తిగా మానేయలేం. ఈ నేపథ్యంలో పాలతో చేసిన టీ, కాఫీలకు బదులు గ్రీన్‌టీ, లెమన్ టీలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోమంటున్నారు నిపుణులు. ఇవి జీర్ణక్రియ రేటును మెరుగుపర్చడమే కాకుండా అధిక బరువును కూడా తగ్గిస్తాయి.

తక్కువ క్యాలరీలతో బ్రేక్‌ఫాస్ట్

బ్రేక్‌ఫాస్ట్‌లో అధిక క్యాలరీలున్న ఆహార పదార్థాలను దూరం పెట్టడం మంచిది. వీటికి బదులు తక్కువ కొవ్వులున్న పాలు, స్ప్రౌట్స్‌ (మొలకెత్తిన ధాన్యాలు)ను అల్పాహారంగా తీసుకోవాలి. తక్కువ క్యాలరీలున్న వీటిని తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. మలబద్ధకం, మధుమేహం లాంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.

సీజనల్‌ ఫుడ్స్

ఈ సీజన్‌లో పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు ఎక్కువగా తినాలి. ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉండే కూరగాయలను సలాడ్లుగా లేదా ఉడకబెట్టి తీసుకోవాలి. వేయించుకుని తినాలంటే మాత్రం అతి తక్కువ నూనెను ఉపయోగించడం ఉత్తమం. ఈ కాలంలో సొరకాయ, గుమ్మడి, కాకర, బీరకాయ, క్యారట్‌, చిలగడదుంపలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

డిన్నర్ ‘లైట్’గా ఉండేలా!

రాత్రి వేళల్లో అతిగా తినడం వల్ల బరువు పెరగడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కాబట్టి డిన్నర్‌లోకి తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. వెజ్‌ సూప్స్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ సూప్స్‌, మూంగ్‌దాల్ సూప్స్‌ను తీసుకోవడం మంచిది. నిద్రపోయే రెండు, మూడు గంటల ముందే వీటిని తీసుకోవాలి.

నానబెట్టిన బాదం పప్పు

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవాలి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి అవసరమయ్యే లిపేస్‌ ఎంజైమ్‌ను ఉత్పత్తి చేయడంలో బాదం పప్పులు బాగా సహకరిస్తాయి. ఇక ఇందులోని మోనో శ్యాచురేటెడ్‌ కొవ్వులు ఆకలి కోరికలను అదుపులో ఉంచుతాయి. ఫలితంగా అతిగా తినడం తగ్గిస్తాం.

పండ్లు

అరటి పండ్లను తినడం వల్ల ఆకలి కోరికలు నియంత్రణలో ఉంటాయి. అదేవిధంగా ఈ సీజన్‌లో లభించే చెర్రీ, దానిమ్మ, యాపిల్‌, నేరేడు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

వీటికి దూరంగా ఉండండి!

* వర్షం పడిందంటే చాలు వేడివేడి బజ్జీలు, సమోసాల మీదకు మనసు మళ్లుతుంది. వీటిని మితంగా తీసుకుంటే మంచిదే. అయితే అతిగా తింటే మాత్రం జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి. విరేచనాలు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

* వర్షాకాలంలో ఆకుకూరలను దూరంగా ఉంచడం మేలు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆకుకూరల్లో బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి వచ్చి చేరే అవకాశముంది. ఒకవేళ ఆకు కూరలను వండాలనుకుంటే...ముందుగా వాటిని బాగా కడగండి. ఎక్కువ సేపు ఉడకబెట్టండి.

* ఈ కాలంలో చేపలు... ఇతర సముద్ర జీవుల్లో పునరుత్పత్తి జరుగుతుంది. ఈ సమయంలో వాటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

* బయటి ఆహారానికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. అదేవిధంగా కూల్‌ డ్రింక్స్‌, చల్లటి పానీయాలను తాగకుండా ఉండడం మంచిది.

మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని