మీరు కోరిన భోజనం మేం వండి పంపిస్తాం!
close
Published : 29/10/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరు కోరిన భోజనం మేం వండి పంపిస్తాం!

మధ్యాహ్నం పన్నెండు అయ్యిందో లేదో  వేడివేడి పదార్థాలతో క్యారేజీ ఇంటికి వచ్చేసింది. బామ్మగారికి ఉప్పు తగ్గించిన వంటలు, తాతగారి షుగర్‌ని నియంత్రించే భోజనం...కొవిడ్‌ బారిన పడినవారికి వ్యాధినిరోధశక్తిని పెంచే ఆహారం...  ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్లు వాళ్లకి ‘లవ్‌ ఫర్‌ ఫుడ్‌’ అందిస్తోన్న ప్రత్యేకమైన మెనూ ఇది. ఈ వినూత్న వ్యాపార ఆలోచనతో దూసుకుపోతోన్నారు హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాళ్లు శైలజా చెరువు, శశికళ టెకాల్‌.
మన అవసరాలు, ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తే చాలు... అద్భుతంగా రాణించొచ్చని నిరూపిస్తున్నారీ స్నేహితురాళ్లు. ‘వంట చేయడం మాకిష్టం. అందులోనే అవకాశాలను వెతుక్కోవాలనుకున్నాం. ‘లవ్‌ ఫర్‌ ఫుడ్‌’ ఆ ప్రయత్నమే. అయితే ఈ ఆలోచన వెనక మాత్రం పెద్ద కథే ఉంది’ అంటారు వారిలో ఒకరైన శైలజ. ‘శశీ నేనూ స్కూల్‌ రోజుల నుంచీ మంచి స్నేహితులం. చదువు పూర్తయ్యాక మాకు నచ్చిన రంగాల్లో స్థిరపడ్డాం. పెళ్లిళ్లూ అయ్యాయి. బాబు పుట్టాక వాడిని చూసుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేశా. ఖాళీ సమయంలో మా అబ్బాయికి ఇష్టమైన కుకీస్‌, చాక్లెట్లు తయారీ నేర్చుకున్నా. దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నా కూడా. తర్వాత ‘చాకోస్‌’ పేరుతో ఇంట్లోనే కుకీస్‌, చాక్లెట్లు తయారు చేసే సంస్థను ప్రారంభించా. క్రమంగా మాకు ఆర్డర్లు పెరిగాయి. కార్పొరేట్‌, ఆటోమొబైల్‌ సంస్థలకు పండగలు, ప్రత్యేక రోజుల్లో గిఫ్ట్‌బాక్సులు సరఫరా చేసేదాన్ని. ఆర్డరుపై పిండివంటలు చేసిచ్చేదాన్ని. ఆ తర్వాత పెళ్లిళ్లు, శుభకార్యాలకు వాటిని అందించే స్థాయికి చేరుకోగలిగా’ అంటారామె. శశికళ నేపథ్యమూ ఇంచుమించు ఇంతే. బాబు కోసం ఉద్యోగం మానుకున్నారు. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పిండివంటలు చేసి బంధువులూ, స్నేహితులకు అందించేవారు. ఓసారి తెలిసినవారొకరు భోజనం వండి పంపించమని అడిగితే వారి అవసరానికి అందించారు. ఆ తర్వాత వివిధ సందర్భాలకు వంటలు చేయడం మొదలుపెట్టారు.  


ఇద్దరూ ఒక్కటై...

స్నేహితులిద్దరూ వేర్వేరుగా ప్రయాణిస్తున్నా... నడిచే మార్గం మాత్రం ఒక్కటే కావడంతో కలిసి అడుగులు వేయాలనుకున్నారు. కానీ మార్కెట్‌లో లెక్కకు మించిన ఫుడ్‌ యాప్‌లు, అంతకు మించి వీధివీధికీ ఫుడ్‌స్టాల్స్‌! వాటికి భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నారు. చివరికి ఇంటి వంట అవసరమయ్యే వృద్ధులు, రోగులు, అవివాహితులతోపాటు ఆరోగ్యం కోసం ఆలోచించేవారికి ఆహారం అందించాలనుకుని రెండేళ్లక్రితం ‘లవ్‌ ఫర్‌ ఫుడ్‌’ మొదలుపెట్టారు. ఇందుకోసం కాయగూరల రుచి, విటమిన్ల శాతాన్ని తగ్గించని ఆధునిక యంత్రాలతో స్మార్ట్‌ కిచెన్‌నీ ఏర్పాటు చేసుకున్నారు. ‘కిచెన్‌ ఏర్పాటుకి ముందే పాత వినియోగదారుల్లో భోజనం అవసరం ఉన్నవారి వివరాలను సేకరించి వాళ్లకి రుచి చూపించాం. పరిశుభ్రత పాటిస్తూ, పోషకాహారానికి ప్రాధాన్యం ఇచ్చి తయారుచేసే మా వంటకాలు వాళ్లని మెప్పించాయి. ఆ వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే మంచి స్పందన వచ్చింది’ అంటారు శైలజ.


సేంద్రియ ఆహారం...

‘బయటి ఆహారం విషయంలో వినియోగదారులకు ఉండే ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని శుచీ, శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాం. ఒకసారి వాడిన వంటనూనెను తిరిగి వినియోగించం. సేంద్రియ ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులను మాత్రమే వాడతాం. ప్రస్తుతం రోజుకి 250-300 మందికి భోజనాలు పంపగలుగుతున్నాం. అన్నం, పప్పు, కూర, పచ్చడి, పెరుగు, రోటీ మెనూలో ఉంటాయి. ఇవి కాకుండా ప్రత్యేకంగా కావాలనుకుంటే తయారుచేస్తాం. ఒంటరి వృద్ధులూ, వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వండి పంపిస్తాం. డైటింగ్‌ చేసేవారికి కీటో, మిల్లెట్‌ డైట్‌ కోరుకునేవారికి అవసరమైన రెడీ టు కుక్‌ పదార్థాలను 15రోజులకు సరిపడా పొడుల రూపంలో పంపిస్తాం. ప్రొటీన్‌ డైట్‌కి సున్నుండలు, నువ్వులుండలు... ఇలా ప్రత్యేకంగా చేయిస్తాం. పన్నెండులోపే వినియోగదారులందరికీ లంచ్‌ చేరిపోతుంది. ప్రస్తుతానికి ఒకపూటే ఆహారాన్ని అందించగలుగుతున్నాం. డీడీకాలనీ, నల్లకుంట, తార్నాక, ఉప్పల్‌, రామాంతపూర్‌, కాచీగూడ, అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌ వంటిప్రాంతాల్లో మా సేవలు అందిస్తున్నాం. ఆహారాన్నిబట్టి రూ.50-100 మధ్య ధర ఉంటుంది. డోర్‌డెలివరీ ఉచితం’ అని చెబుతున్నారీ స్నేహితురాళ్లు.


కిచెన్‌ మునిగిపోయినా...

లాక్‌డౌన్‌ మొదట్లో క్యాంటిన్‌ మూసేశాం. ఏప్రిల్‌ చివర్లో తిరిగి మొదలుపెట్టాం. అప్పట్నుంచీ కొవిడ్‌ బాధితుల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వీరికోసం అందిస్తాం. ఇటీవల వరదలకు మా కిచెన్‌ మునిగిపోయింది. అయినా మమ్మల్ని నమ్ముకుని ఉన్న వారికోసం  మా ఇళ్లల్లోనే వండి పంపిస్తున్నాం.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని