ఫైజర్‌ టీకా... ఆమె ‘ప్రేమ’కానుక!
close
Published : 22/11/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫైజర్‌ టీకా... ఆమె ‘ప్రేమ’కానుక!

ప్రేమ... ఆ జంటను కలిపింది  
ఆ జంట... ఓ ఆశయాన్ని ఏర్పరుచుకుంది
ఆ ఆశయం... ఇప్పుడు ప్రపంచానికి ఆశగా, ఆసరాగా మారింది. కరోనాపై యుద్ధం చేసే ఓ ఆయుధమైంది.

దీనికంతటికీ చోదకశక్తిగా నిలిచింది ఆమె...
సైన్స్‌, ప్రేమ  చెట్టపట్టాలేసుకుని కలిసి తిరిగితే ఎలా ఉంటుంది? డాక్టర్‌ ఓజ్లెమ్‌ టురేసి... డాక్టర్‌ ఉరుమ్‌ షాహిన్‌ల జంటలా ఉంటుంది. జర్మనీకి చెందిన ఈ డాక్టర్లు నిజానికి వలసపక్షులు. ఇస్తాంబుల్‌లో పుట్టిన ఓజ్లెమ్‌ తండ్రితో కలిసి జర్మనీకి వలస వచ్చింది. ఆయన డాక్టర్‌ కావడంతో... అతని దగ్గర ఎంతోమంది నన్స్‌ నిస్వార్థంగా వైద్య సేవలు అందించేవారు. వాళ్లను చూసిన ఓజ్లెమ్‌ తానుకూడా పెద్దయ్యాక నన్‌లా మారి రోగులకు సేవలు అందించాలని తపనపడింది. తండ్రిని చూసిన తర్వాత వైద్య వృత్తి కాకుండా మరోవృత్తిని తాను ఊహించుకోలేకపోయింది. డాక్టర్‌ షాహిన్‌ సిరియా-టర్కీ సరిహద్దుల్లో పుట్టాడు. నాలుగేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు బతుకుతెరువుని వెతుక్కుంటూ వాళ్ల కుటుంబం జర్మనీకి చేరుకుంది. ఓజ్లెమ్‌, షాహిన్‌ ఇద్దరూ వైద్యం మీద ప్రేమతో డాక్టర్లయ్యారు. ఇమ్యునో థెరపిస్టులుగా తమతమ కెరీర్లని ప్రారంభించారు. 2001లో హాంబర్గ్‌లోని సార్లాండ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో జరిగిన ఓ సెమినార్‌లో వారిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. వలస జీవితాల నేపథ్యం, వైద్యం మీద ప్రేమ... వాళ్లని ప్రేమ బాట పట్టించాయి. ‘మనమిద్దరం కలిసి ఓ క్యాన్సర్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ని పెడితే ఎలా ఉంటుందంటావ్‌?’ అని షాహిన్‌ని అడిగింది ఓజ్లెమ్‌.  ‘బ్రహ్మాండమైన ఆలోచన’ అన్నాడు షాహిన్‌. అలా అదే ఏడాది వాళ్లు ‘గానిమీడ్‌’ అనే సంస్థను స్థాపించి.. మరుసటి ఏడాదే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా చాలా చిత్రంగా జరిగిందంటారు తోటి శాస్త్రవేత్తలు. ఉదయం యూనిఫామ్‌లో ల్యాబ్‌కు వచ్చిన షాహిన్‌, ఓజ్లెమ్‌లు మధ్యలో ఆ కోట్లు తీసేసి... రిజిస్టర్‌ ఆఫీసుకెళ్లి పెళ్లి చేసుకుని తిరిగి కోట్లు వేసుకుని ఎవరి పని వాళ్లు చేసుకున్నారట. ‘అప్పుడు మా దృష్టంతా క్యాన్సర్‌ని అంతమొందించడానికి కావాల్సిన వ్యాధినిరోధక ఉత్పత్తులపైనే ఉండేది’ అనే ఓజ్లెమ్‌ తర్వాత ఆ సంస్థని జపాన్‌ కంపెనీకి బిలియన్‌ డాలర్లకు అమ్మేసింది. దాంతో శాస్త్రవేత్తలుగా జీవితాన్ని మొదలుపెట్టిన ఆ దంపతులు వ్యాపారవేత్తలుగా మారిపోయారు. ప్రస్తుతం జర్మనీలోని తొలి 100 ధనిక జంటల్లో వాళ్ల జంట కూడా ఒకటి. ‘మేం డబ్బుకోసం ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రజలని వ్యాధుల నుంచి రక్షించాలన్నదే మా కల’ అనే డాక్టర్‌ ఓజ్లెమ్‌ తన చేతికొచ్చిన డబ్బుతో 2008లో బయోఎన్‌టెక్‌ సంస్థని స్థాపించింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.. క్యాన్సర్‌ని ఎదిరించడం. అందరికీ ఒకేరకం క్యాన్సర్‌ మందులు కాకుండా... జన్యువుల ఆధారంగా వ్యక్తిగత క్యాన్సర్‌ మందులని తయారుచేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా ఎమ్‌ ఆర్‌ఎన్‌ఏ అనే మాలిక్యూల్‌ సముదాయాన్ని తయారుచేసింది. దీని లక్ష్యం... శరీరంలోని జన్యువులని క్యాన్సర్‌ కణాలపై పోరాడేలా సిద్ధం చేయడం. మరోపక్క అమెరికా కంపెనీ ఫైజర్‌తో కలిసి ఫ్లూవ్యాక్సిన్‌ తయారీ కూడా అప్పుడే మొదలుపెట్టింది. అప్పటికే బయోఎన్‌టెక్‌కి 60 దేశాల్లో 1400 మంది ఉద్యోగులున్నారు.  
2020... జనవరి 24న.. వూహాన్‌లో కరోనా మహమ్మారి విస్తరిస్తుందన్న వార్తని చదివారు డాక్టర్‌ ఓజ్లెమ్‌ దంపతులు. హుటాహుటిన ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘మనం కరోనాని అరికట్టడానికి వ్యాక్సిన్‌ని తయారుచేస్తున్నాం’ అని ప్రకటించారు. అప్పటికి కరోనా అంతగా విస్తరించకపోవడంతో ఉద్యోగులకు ఈ మాటలు రుచించలేదు. అయినా ఓజ్లెమ్‌ ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంది.

లైట్‌స్పీడ్‌ సాధించింది...

నాలుగువందల మంది నిపుణులతో ‘లైట్‌ స్పీడ్‌’ అనే ఒక బృందాన్ని తయారుచేసింది. వాళ్లు అప్పటికే కనిపెట్టిన ఎమ్‌ఆర్‌ఎన్‌ఏతోనే కరోనా వైరస్‌ని తుదముట్టించాలని ప్రణాళిక వేసుకున్నారు. లైట్‌స్పీడ్‌ బృందం అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ తయారీని పూర్తిచేసింది. ఫైజర్‌తో ఇందుకు సంబంధించిన ఒప్పందాలూ జరిగాయి. ‘సంప్రదాయ వ్యాక్సిన్లు వైరస్‌ని బలహీనం చేస్తాయి. కానీ మేం తయారుచేసిన వ్యాక్సిన్‌ వైరస్‌ జన్యువుల్లోనే మార్పు చేస్తుంది’ అనే ఓజ్లెమ్‌ దంపతులపై ప్రపంచ దేశాలు తమ నమ్మకాన్ని ఉంచాయి. బిల్‌మిలిందాగేట్స్‌ ఫౌండేషన్‌ ఇందులో 55 మిలియన్‌ పౌండ్లని పెట్టుబడిగా పెట్టింది. పెద్దఎత్తున క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడంతో... బ్రిటన్‌ ప్రభుత్వం ఇంతవరకు నాలుగు కోట్ల డోసులని కొనుగోలు చేసింది. వివిధ దేశాలు ఈ వ్యాక్సిన్‌ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో బయోఎన్‌టెక్‌ సంస్థ విలువ అమాంతం పెరిగిపోయింది. గత ఏడాది నాలుగు బిలియన్‌ యూరోలు ఉన్న వీరి వ్యాపారం.. ప్రస్తుతం 21 బిలియన్‌ యూరోలకు చేరుకుంది. అయితే షాహిన్‌కానీ, ఓజ్లెమ్‌కానీ తమ కంపెనీ షేర్ల గురించి ఎప్పుడూ ఆలోచించరట. దానికంటే సైన్స్‌ మ్యాగజైన్లని తిరగేస్తూ ఉండటమే ఇష్టంగా భావిస్తారట. అంతకంటే చిత్రమేంటంటే కోట్లు సంపాదించినా ఇప్పటికీ సాధారణ ఇంట్లోనే ఉంటూ ల్యాబ్‌కి సైకిల్‌మీద వెళ్లి, రావడం షాహిన్‌కి అలవాటు. ఎన్‌బయోటెక్‌ కంపెనీకి షాహిన్‌ సీఈవో అయితే ఆమె.. ఆ సంస్థ మెడికల్‌ డైరెక్టర్‌, క్లినికల్‌ అండ్‌ సైంటిఫిక్‌ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు. అన్నట్టు వీళ్లకి ఓ అమ్మాయి కూడా ఉంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని