వ్యాధికారక కణాలపై దేవి రణం
close
Updated : 23/11/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాధికారక కణాలపై దేవి రణం

కొత్తగూడెంలో స్కూల్‌కి వెళ్లే దారిలో కుష్టు, పోలియో వ్యాధిగ్రస్తుల్ని చూసి చలించిపోయిన ఓ అమ్మాయి... ఆ వ్యాధులకు కారణమేంటో తెలుసుకుని నివారించాలనీ, వారిలా ఇంకెవరూ బాధ పడకూడదనీ గట్టిగా నిర్ణయించుకుంది. పెద్దయ్యాకా తన లక్ష్యాన్ని మర్చిపోకుండా శాస్త్రవేత్త అయ్యింది. ఆ దిశగా ఎన్నో పరిశోధనలూ చేసింది. తాజాగా ఆమె దృష్టిని కరోనా మీదకు మరల్చి కొవిడ్‌-19కి ఓ సరికొత్త చికిత్సా విధానాన్ని కనుగొంది. ఆ కొత్తగూడెం అమ్మాయే ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త కన్నెగంటి తిరుమలా దేవి. శాస్త్రవేత్తగా తన ప్రయాణం గురించి ఆమె ఏం చెబుతారంటే...

మాసొంతూరు గుంటూరు. నాన్న ఉద్యోగరీత్యా కొత్తగూడెంలో స్థిరపడ్డాం. స్కూల్‌కి వెళ్లే రోజుల్లో రోడ్డు పక్కన కుష్టు, పోలియో బాధితులు బిచ్చగాళ్లుగా కనిపిస్తుండేవాళ్లు. వాళ్లని చూసినపుడల్లా ఎంతో బాధపడేదాన్ని. ఆ రోగాల కారణంగా కుటుంబాలూ వాళ్లని దూరం పెట్టేవి కూడా. ‘ఈ వ్యాధులు ఎందుకు వస్తాయో తెలుసుకుని, రాకుండా ఉండటానికి ఏదైనా చేయాలి’ అనుకున్నా. అప్పుడే బ్యాక్టీరియా, వైరస్‌ల గురించి పాఠాలు వినడం మొదలైంది. సైన్స్‌తో నాకో దారి దొరికిందనిపించింది. మా ఇంట్లో ఎవరూ పదో తరగతి దాటి చదవలేదు. అయినా శాస్త్రవేత్త అవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నా.
ఉస్మానియాలో పీహెచ్‌డీ...
కొత్తగూడెంలో డిగ్రీ(బీజెడ్‌సీ) చేశాక, ఉస్మానియాలో పీజీ, పీహెచ్‌డీ చేశా. మైక్రో బయాలజీలో పీహెచ్‌డీ చేశాక కొన్నాళ్లు ఇక్రిశాట్‌లో పరిశోధకురాలిగా పనిచేశా. తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ విస్కన్‌సిన్‌-మేడిసన్‌లో పోస్ట్‌ డాక్టోరియల్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడ మొక్కల్లో వ్యాధికారక క్రిముల మీద పరిశోధన చేశాను. ఆ తర్వాత మరో రెండు పోస్ట్‌డాక్టోరియళ్లు చేశా. ఓహియో స్టేట్‌ యూనివర్సిటీలో పనిచేసినపుడు 1800ల్లో మొదటిసారి బంగాళాదుంపల్లో కనిపించిన ఓ వ్యాధి మీద పరిశోధన చేసి దానికి నివారణను చూపించా. మరోవైపు క్షీరదాల్లో వ్యాధినిరోధక వ్యవస్థపైనా అధ్యయనం చేశా. ఈ అనుభవంతో ఒక పరిశోధక ల్యాబ్‌లో ఏం ఉండాలో అర్థమైంది. 2007 నుంచి అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం, మెంఫిస్‌ నగరంలో ఉన్న సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రిసర్చ్‌ హాస్పిటల్‌లో బోధకురాలిగా, అక్కడి ల్యాబ్‌లో ప్రధాన పరిశోధరకురాలిగా పనిచేస్తున్నా. ప్రధానంగా ఇమ్యునాలజీ, క్యాన్సర్‌, బయోమెడికల్‌ సైన్సెస్‌ విభాగాల్లో పరిశోధనలు చేస్తున్నా. ప్రస్తుతం మా ల్యాబ్‌లో క్షీరదాల్లోని కణాల మీద ప్రధానంగా పరిశోధనలు చేస్తున్నాం. ‘కొన్ని కణాలు రోగాలకు అతీతంగా ఎలా ఉంటున్నాయి. మరికొన్ని ఎందుకు రోగాలకు గురవుతున్నాయి...’ లాంటి అంశాలపైన నా నేతృత్వంలోని బృందం పరిశోధనలు చేస్తుంది. ప్రయోగశాలల్లో ముఖ్యంగా ఎలుకల్లాంటి క్షీరదాల్లో మేం వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌లను ప్రవేశపెట్టి అవి వాటిలో ఎలా జీవించగలుగుతున్నాయో, ఎలా మరణిస్తున్నాయో గమనిస్తాం. ఆపైన ఆ పరిశోధన ఫలితాలు మానవులకి ఎలా ఉపయోగపడతాయో చూస్తాం. శరీరంలోని అనంతమైన వ్యాధి నిరోధక శక్తిమీద నిరంతరం పరిశోధించడం నాకు ఆసక్తి. ఎందుకంటే అదే శరీరంలో మొట్టమొదటి రక్షణ గోడ. వ్యాధి ఎలా సంక్రమిస్తుందో తెలుసుకుంటే వాటికి నివారణా మార్గాలూ తెలుసుకోవచ్చు.

క్యాన్సర్‌ మీద పరిశోధనలకుగానూ నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(అమెరికా) 2020కిగానూ ఔట్‌స్టాండింగ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్డును అందించింది.

ఇరవై పరిశోధనలు
ల్యాబ్‌లో ఉన్నపుడు మా పరిశోధక విద్యార్థులతో విడివిడిగా మాట్లాడతాను. ప్రతి ఒక్కరి పరిశోధన అంశాల్నీ, డేటానీ తరచూ పరిశీలిస్తా. వాటితో కొత్తగా, వినూత్నంగా ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని మార్గనిర్దేశం చేస్తాను. మేం చేసే పరిశోధనలన్నీ వ్యాధుల నివారణ గురించే ఉంటాయి. ఇమ్యునాలజీ డిపార్ట్‌మెంట్‌లో వైస్‌ ఛైర్మన్‌గా, విద్యార్థుల పరిశోధనలకు సీనియర్‌ ఆథర్‌గా పరిశోధక విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూ నేనూ దాదాపు 20 పరిశోధనల్లో భాగమవుతా. సైన్స్‌లో ఫలితాలు రావడం అంత సులభంగా జరగదు. దానికి పరిశోధక అంశంపైన ఆసక్తి, ఇష్టంతోపాటు ఓపిక కూడా అవసరం. విద్యార్థుల్లో నిత్యం స్ఫూర్తినింపుతూ, ఏళ్లపాటు వాళ్లు పరిశోధనలమీద దృష్టి పెట్టేలా చేయడం చాలా పెద్ద పని. పరిశోధన సమయంలో రకరకాల ప్రశ్నలూ, సందేహాలూ వస్తాయి. కొన్నింటికి జవాబులు వెంటనే తెలియవు. అలాంటపుడు తెలుసుకుని చెబుతాను. పరిశోధకులకి ప్రతిసారీ ఫలితాలు అనుకూలంగా రావు. కానీ అన్ని సమయాల్లోనూ సహనం, సానుకూల దృక్పథం ఉండాలి. ఇవన్నీ విద్యార్థులకి తెలియజేస్తూ వారిలో పరిశోధనలపైన ఆసక్తి పెంచుతాను.  
ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాస్పేజ్‌-6 అనే ఎంజైమ్‌ పనిచేసే విధానాన్ని కనిపెట్టి చెప్పాం. దశాబ్దాలుగా వైద్యశాస్త్రంలో దీని పనితీరు అంతుచిక్కకుండా ఉండేది. మేం దాన్ని మొదటిసారిగా శాస్త్ర ప్రపంచానికి వివరించాం. ఈ పరిశోధన వైరల్‌ ఇన్‌ఫెక్షన్లూ, ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్‌, క్యాన్సర్‌ చికిత్సలకు ఉపయోగపడుతుంది. అంతకుముందు మా ల్యాబ్‌లోనే మొదటిసారి జెడ్‌ఎన్‌ఏ-బైండింగ్‌ ప్రొటీన్‌ని కనిపెట్టాం. ఇది ఇన్‌ఫ్లమేటరీ కణం మరణానికి కారణమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నవారిలో ఇన్‌ఫ్లమేషన్‌(వాపు ప్రక్రియ)కు దారితీస్తున్న అంశాల్ని విశ్లేషించడం చాలా ముఖ్యమనుకున్నాం. అప్పుడే సమర్థమైన చికిత్స విధానాన్ని ఎంచుకోగలం. కొవిడ్‌ బాధితుల్లో ‘ఇన్‌ప్లమేటరీ కణ మరణం’ అనే ప్రక్రియ సంభవిస్తున్న తీరుని గుర్తించాô. దాన్ని విచ్ఛిన్నం చేసే చికిత్సలను కనుగొన్నాం. ఇలా పరిశోధన ఫలితాలు సానుకూలంగా వచ్చిన ప్రతిసారీ ఆ దిశగా మరిన్ని అడుగులు ఉత్సాహంగా, ధైర్యంగా వేయాలనిపిస్తుంది.

ఏటా మేం చేసిన పరిశోధనల ఫలితాల్నీ, తర్వాత ఏడాది చేయబోయే పరిశోధనాంశాలనీ మా సైంటిఫిక్‌ అడ్వైజరీ బోర్డు, పాలక బృందాలకు చెబుతాం. వాళ్లు వాటిని సమీక్షించి ఆమోదించి, నిధులను విడుదల చేస్తారు. ఇప్పటివరకూ నేను ప్రతిపాదించిన ఏ పరిశోధననీ మా బోర్డు తిరస్కరించలేదంటే నమ్మండి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని