తుది మజిలీలో... తోడుగా!
close
Published : 07/05/2021 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుది మజిలీలో... తోడుగా!

‘ ఎంత మురిపెంగా చూసుకున్నాను నిన్ను... చిన్న పని చెప్పడానికే ఆలోచించేదాన్ని. అలాంటిది... నువ్వీ వృత్తిని ఎలా ఎంచుకోగలిగావ్‌?’ అంటూ కన్నీరు పెట్టుకుందా తల్లి... ‘జీవితంలో అందరికీ ఈ మజిలీ ఉంటుంది. నువ్వూ, నేనూ కూడా ఇక్కడికే రావాలి. తప్పేంటమ్మా’ అందా కూతురు.. ఇంతకీ ఆ తల్లిని అంతగా బాధపెట్టి... ఆ కూతురు ఎంచుకున్న వృత్తి ఏంటో తెలుసా? శ్మశానవాటిక నిర్వహణ. అది ఆమెకు ఉద్యోగం కాదు... సేవ!! ఆ మానవతామూర్తి ఎస్తేర్‌శాంతి. తన అనుభవాలని వసుంధరతో పంచుకున్నారు...  

మా అమ్మ మనోరంజితం టీచర్‌. నాన్న గురుస్వామి కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌. మేం నలుగురు పిల్లలం. నాకు ఇద్దరక్కలు, ఓ సోదరుడు. మాది చెన్నై. నా చిన్నప్పుడే నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఎన్నో కష్టాలకోర్చి మమ్మల్ని చదివించింది అమ్మ. ఇంటర్‌ అవగానే నాకు శరవణన్‌తో పెళ్లైంది. ఆయన ప్రోత్సాహంతో బీకాం పాసయ్యా. చదువుతూనే ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి.. వేశ్యల పిల్లలకు, వీధిబాలలకు చదువు చెప్పేదాన్ని. నాలుగేళ్ల తర్వాత ఒక రోజు ఎన్జీవో నిర్వాహకులు పిలిచారు. ఓటేరిలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక శ్మశానవాటిక ఉంది. దాని బాధ్యతలు తీసుకుంటారా? అని అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నా. అప్పటికే నాకు ముగ్గురు చిన్నపిల్లలు. మావారు ఏమంటారో అనుకున్నా. కానీ ఆయనా ప్రోత్సహించారు. చిక్కంతా అమ్మతోనే. ఆమెకు చెప్పడానికి భయపడి ఈ విషయాన్ని తన దగ్గర దాచాను.  
నేను ఎంచుకున్న పని అంత సులువేమీ కాదని తర్వాత అర్థమైంది. తాగుబోతులు, జులాయిలు ఆ శ్మశానవాటికను అడ్డాగా మార్చుకున్నారు. వాళ్లను అక్కడి నుంచి పంపించడానికి ఎక్కడలేని ధైర్యాన్నీ పోగేసుకోవాల్సి వచ్చింది. మరోపక్క... ఆ రోజే అంత్యక్రియల కోసం ఓ శవాన్ని తీసుకొచ్చారు. వాళ్ల బంధువులు ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చింది. ఇంటికెళ్లి కూడా ఏడ్చాను. ఆయన ‘ఇష్టం లేకపోతే ఈ పని మానేయ్‌’ అన్నారు. కానీ అది అయిష్టత కాదు, అవతలివారి బాధ నన్ను కదిలించింది. క్రమేపీ మనసును గట్టి చేసుకోవడం నేర్చుకుని అక్కడ వ్యవహారాలు కట్టుదిట్టం చేయడంతో తాగుబోతులు ఆ ప్రాంతానికి రావడం మానేశారు.
ఎనిమిదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. కానీ కొవిడ్‌ మాత్రం ఎన్నడూ చూడని అనుభవాల్ని మిగిల్చివెళ్తోంది. క్షణం తీరిక లేని పరిస్థితి. ఉదయం ఏడుకు మొదలవుతున్న పని... రాత్రి ఎనిమిదన్నరకు పూర్తవుతోంది. రోజంతా పీపీఈ కిట్‌ ధరించి పని చేయడం కష్టంగానే ఉంటుంది. బంధువులున్నా, కరోనా కారణంగా లోపలకి ప్రవేశం ఉండదు. మృతదేహాలను తరలించడం మొదలు, మెషీన్‌లో ఉంచేవరకూ పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటున్నా. ఇది ప్రమాదం కదా అని చాలామంది అడుగుతుంటారు. అలా అనుకుంటే మానవత్వానికి విలువేముంది అంటాను. ఓ రోజు అమ్మకు విషయం తెలిసి... ఫోన్‌ చేసి...‘చిన్నపని కూడా చెప్పకుండా పెంచాను. నువ్వా పని ఎలా చేస్తున్నావంటూ’ భోరుమంది. ఆవిడ చనిపోయేంత వరకూ నా పనిని వ్యతిరేకించింది. కొందరైతే ‘మీకు నిద్ర ఎలా పడుతుందండీ?’ అంటారు. ‘మనమూ ఏదో ఒకరోజున ఇక్కడకు రావాల్సిన వాళ్లమే కదా’ అంటాను!!
ఆ మధ్య ఎదురైన ఓ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. అమెరికాలో ఉంటున్న ఓ అబ్బాయి అమ్మానాన్నలు కొవిడ్‌తో ఒకేరోజు చనిపోయారు. అతనేమో రాలేడు. వాళ్ల అంత్యక్రియలు జరిపి... వీడియోకాల్‌లో ఆ అబ్బాయికి చూపించాను. ఏళ్లుగా ఇవన్నీ చేస్తున్నా ఆ రోజు ఎంతో దుఃఖం వచ్చింది. మరో సంఘటన... ఓ కుర్రాడు నాతో కలిసి పనిచేసేవాడు. పొద్దునే ఇంటింటికీ పేపర్లు వేసి, పాలు పోసి డబ్బు పోగేశాడు. వాళ్లమ్మని బాగా చూసుకోవాలని తన కోరిక. ఆమె కోసం బట్టలు, నగలు కొన్నాడు. ఆవిడను ఇక్కడకు రమ్మన్నాడు. బస్టాండుకి వెళ్లి అమ్మని తీసుకురావడమే తరువాయి. వెళ్తూ.. దారిలోనే యాక్సిడెంట్‌ అయి చనిపోయాడు. ఆ కుర్రాడికి నేనే అంత్యక్రియలు చేశాను. వాళ్ల అమ్మ బాధ్యతలూ తీసుకున్నా. ఇలాంటివే ఎన్నో అనుభవాలు. నేనేదో సేవ చేస్తున్నానని ఎన్జీవోలు అవార్డులవీ ఇస్తూంటాయి. వాటి కోసం నేనీ పని చేయడం లేదు. నా మనసుకి తృప్తి నిచ్చే పని ఇది. అందుకే చేస్తున్నా.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని