Covid Relief: మనసున్న తారలు...సాయానికి కదిలారు!  
close
Updated : 08/05/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Relief: మనసున్న తారలు...సాయానికి కదిలారు!  

అనుష్క

కష్టంలో ఉన్నవారికి తోచిన సాయమేదో చేసి...అంతటితో పని అయిపోయిందనుకోవడం లేదీ తారలు! అభిమానుల సాయంతో కొవిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నారు.  ఆక్సిజన్‌... ఆహారం... ఔషధాలు.. అవసరం ఏదైనా మేమున్నాం అంటున్నారు..ఇందుకోసం తమ సోషల్‌మీడియా అకౌంట్లనే వేదికలుగా మార్చుకున్నారు...
అనుష్క, విరాట్‌లని... అభిమానులు ఇష్టంగా ‘పవర్‌కపుల్‌’ అని పిలుచుకుంటారు. మరి అలాంటి అభిమానులకు కష్టం వస్తే వాళ్లు ఊరుకుంటారా? ‘ఎందుకు ఊరుకుంటాం?’ అంటూ కొవిడ్‌పై పోరాటానికి రెండు కోట్ల రూపాయల్ని విరాళంగా అందించింది అనుష్క. మరో ఏడుకోట్ల రూపాయలు అందించడానికి భర్తతో కలిసి ‘ఇన్‌దిస్‌ టుగెదర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టింది. ‘కెట్టో’ అనే క్రౌడ్‌ఫండింగ్‌ సంస్థతో కలిసి వారం రోజుల్లో ఆ మొత్తం సేకరించే పనిలో పడింది. విరాళాలుగా అందిన సొమ్ముని ‘యాక్ట్‌ గ్రాంట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అవసరం అయిన వారికి ఆక్సిజన్‌ అందివ్వడం, రోగులకు టెలిమెడిసిన్‌ సౌకర్యాన్ని కల్పించడం, మందుల కోసం వెచ్చిస్తానంటోంది.


ప్రియాంకచోప్రా... ‘గివ్‌ ఇండియా’ అనే సంస్థతో కలిసి... కొవిడ్‌ విరాళాల సేకరణ మొదలుపెట్టింది. ‘నేను పుట్టిన గడ్డ ఆపదలో ఉంది. ఎంతోమంది ప్రాణాలు గాల్లోదీపాల్లా మారాయి’.. అంటూ భావోద్వేగపూరితంగా పిలుపునిచ్చింది. ఈ పిలుపు విదేశాల్లో ఉన్న యూట్యూబ్‌ స్టార్‌ లిల్లీసింగ్‌, ‘వోల్వరైన్‌’ హీరో హగ్‌జాక్‌మన్‌ వంటివారిని కదిలించింది. దాంతో వారు కూడా తమ టైమ్‌లైన్లపై ప్రియాంక పిలుపుని షేర్‌చేస్తూ భారతదేశానికి అండగా నిలబడమని ప్రపంచ దేశాలని కోరుతున్నారు. ‘నేనూ, నా భర్త నిక్‌జొనాస్‌ ఇప్పటికే విరాళాలని అందించాం. అది మాత్రమే సరిపోదు. నాకు సోషల్‌ మీడియాలో కోట్లమంది అభిమానులున్నారు. వాళ్లలో లక్షమంది ముందుకొచ్చి తలాకొంచెం సాయం చేసినా నా లక్ష్యం పూర్తవుతుంది’ అంటుంది ప్రియాంక. ఇప్పటి వరకూ సేకరించిన రెండున్నర కోట్ల రూపాయల సొమ్ముని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకీ, వ్యాక్సిన్లు సమకూర్చడానికీ ఉపయోగిస్తోంది.


గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో స్వయంగా వంటలు వండి ఎంతోమంది కడుపునింపింది నటి ప్రణీత. ఆ సేవాభావాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది. ప్రణీత ఫౌండేషన్‌ను స్థాపించి నిధులు సేకరించింది. ఆ డబ్బుతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లని కొని అవసరం అయిన వారికి అందుబాటులో ఉంచుతోంది. ‘గతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక నేనే స్వయంగా వంటలు చేసిపెట్టాను. కానీ ఈసారి అంత ధైర్యం చేయలేకపోతున్నాను. కారణం... ఇంట్లో పెద్దవాళ్లు ఉంటారు. వాళ్లని ఇబ్బంది పెట్టలేను కదా! అలాగని మేమంతా ఇంట్లో ఉంటాం అనుకుంటే పొరపాటు. మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్లే. ఇలాంటి సమయంలోనే కదా ప్రజలకు సేవ చేయాలి... అంటూ వాళ్లు ఆసుపత్రులకు వెళ్తున్నారు. నేను బయటకు వెళ్లకపోయినా సోషల్‌ మీడియాలో ఎస్‌ఓఎస్‌ మెసేజ్‌ల సాయంతో అవసరం అయిన వారికి సాయం అందిస్తున్నా. ఎంతోమంది నేను సాయం చేస్తానన్న నమ్మకంతో కాల్స్‌, మెసేజెస్‌ పెడుతుంటారు. వీలైనంత వరకూ వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే చూస్తున్నాను’ అంటోంది ప్రణీత.  


పిల్లలతో కలిసి అల్లరి.. అత్తగారితో కలిసి ముచ్చట్లు... వీలైతే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు గురించి అర్థమయ్యేలా చెప్పడం.. సమీరారెడ్డి సోషల్‌మీడియా అక్కౌంట్ల నిండా ఈ ముచ్చట్లే ఉంటాయి. అయితే కొవిడ్‌ నేపథ్యంలో గతకొంతకాలంగా పిల్లల పెంపకం మరీ కత్తిమీద సాము అయిపోయింది అంటుంది సమీర. ‘వాళ్లతో పడలేం అని మనం అనుకుంటాం. పాపం పిల్లలు... ఇళ్లకే పరిమితమైపోయి ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో మనకేం తెలుసు’ అనే సమీర ‘పిల్లలకు ఒక వేళ పాజిటివ్‌ వస్తే తల్లులు ఏం చేయాలి?’ అనే అంశంపై ముంబయికి చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ ఫరేఖ్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక సందేహ నివృత్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది ఎంతోమంది తల్లుల ప్రశంసలు దక్కించుకుంది.


* ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న నటి అలియాభట్‌ సర్కిల్‌ ఆఫ్‌ హోప్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారాన్ని చేస్తోంది. విలేకరి ఫాయే డిసౌజాతో కలిసి తన సోషల్‌మీడియా వేదికపై అవసరం అయిన రోగులకు ఆసుపత్రుల్లోని బెడ్‌ వివరాలు, అంబులెన్సులు, మందుల లభ్యత వంటి వాటి గురించి సమాచారాన్ని చేరవేస్తోంది.


*నటి ట్వింకిల్‌ ఖన్నా 100 ట్యాంకుల ఆక్సిజన్‌ని అందిస్తే... తాప్సీ తన వంతుగా ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లని అందించడంతోపాటు తన టైమ్‌లైన్‌పై రోగులకు ఉపయోగపడే సమాచారాన్ని షేర్‌ చేస్తోంది. కత్రినాకైఫ్‌, సోనమ్‌ కపూర్‌, భూమీ   ఫడ్నేకర్‌ వంటివారూ ఇదే బాటలో ఉన్నారు.
* నటి ఊర్వశి రౌతేలా ఒక ఫౌండేషన్‌ ప్రారంభించి రోగులకు సాయపడుతోంది. తాను పుట్టి పెరిగిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి 27 ఆక్సిజన్‌  కాన్సన్‌ట్రేటర్లని అందించి శెభాష్‌ అనిపించుకుంది.


* ‘నెలసరి సమయంలో వ్యాక్సినేషన్‌ వేయించుకోకూడదట...’ వాట్సాప్పుల్లో, ఫేస్‌బుక్కుల్లో... సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఇదే దుమారం. ‘ఇది నిజం కాదు’ అంటూ వైద్యుల సాయంతో సోషల్‌మీడియా వేదికగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది గాయని చిన్మయి. దానికి క్రీడాకారిణి జ్వాలగుత్తా గొంతు కూడా తోడయ్యింది. నెలసరి సమయంలో వ్యాక్సిన్‌ తీసుకున్నంత మాత్రాన దాని ప్రభావం తగ్గిపోదు అంటూ తనీ పోస్ట్‌ పెట్టింది తన పెళ్లిరోజున. ఆ రోజు కూడా తీరిక చేసుకుని ఈ పోస్ట్‌ పెట్టడం నెటిజన్ల మనసు దోచుకుంది.
* నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కొవిడ్‌ రోగులకు సేవ చేయడం కోసం యోలో (యు ఓన్లీ లివ్‌ వన్స్‌)అనే ఫౌండేషన్‌ ప్రారంభించి.. మరికొన్ని స్వచ్ఛంధ సంస్థలతో కలిసి నెలకి లక్షమందికి భోజనాలు అందిస్తోంది. సన్నీలియోన్‌ కూడా ఇదే బాటలో ఉదయ్‌ ఫౌండేషన్‌తో కలిసి పదివేలమందికి భోజనాలు అందించింది.
* గాయని లతా మంగేష్కర్‌ కొవిడ్‌పై పోరాటానికి తనవంతుగా ఏడులక్షల రూపాయలు అందించారు.

 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని