ఈ అమ్మలు... అమృత మూర్తులు!
close
Published : 17/05/2021 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ అమ్మలు... అమృత మూర్తులు!

కోటీశ్వరుడైనా... కూలీ అయినా... కాలే కడుపులో గుప్పెడు మెతుకులు పడకపోతే ప్రాణం విలవిల్లాడిపోతుంది. అందులోనూ కరోనా కాలంలో... అయిన వారంతా దూరంగా ఉండటం... ఇంటిల్లిపాదీ వ్యాధి బారిన పడటం, పేదరికం...  సమస్యలు రకరకాలు... అలాంటి వారి కోసమే కొందరు మహిళలు అన్నపూర్ణలై నిలుస్తున్నారు. వారెవరో తెలియకపోయినా... ‘మీరు కోలుకుంటే చాలంటూ’ ఉచితంగా పోషకార భోజనాన్ని రోగుల ఇళ్లకే పంపుతున్నారు.

విదేశాల నుంచీ ఫోన్‌ చేస్తున్నారు...
- అడ్డగళ్ల లక్ష్మీ అన్నపూర్ణ,
మార్గం ఫౌండేషన్‌, 9094773333

మేం కష్టంలో ఉన్నప్పుడు మా వారి స్నేహితుడి సాయం వల్లే నిలదొక్కుకోగలిగాం. ఆ స్ఫూర్తితోనే నావంతు సేవ చేయాలనుకున్నా. మొదటి వేవ్‌లో రోజూ వేల మంది వలస కార్మికుల కడుపు నింపగలిగాం. ఇప్పుడు కరోనాతో హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి ఉచితంగా పోషకాహారం అందించాలని నిర్ణయించుకున్నాం. ఆర్థికంగా కష్టమే అయినా చేయగలిగినంతే చేద్దామని మొదలుపెట్టా. కొవిడ్‌ బాధితులకు ఇంటికే ఉచితంగా ఆహారం అందిస్తామనే విషయం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగానే మా వాళ్లకు భోజనం పంపండి ప్లీజ్‌... మేం డబ్బులు చెల్లిస్తాం అంటూ దేశవిదేశాల నుంచి వందల ఫోన్‌లు వస్తున్నాయి. అవసరం ఎంతుందో అప్పుడే అర్థమయ్యింది. మేం డబ్బులు తీసుకోం.... కోలుకున్నాక వారూ మరి కొందరికి సాయం చేయగలిగితే అదే మాకు సంతృప్తి. రోజూ 100-150 మందికి పంపిస్తున్నాం. కాకపోతే పంపిణీకి వాలంటీర్ల కొరత ఉంది. అవసరాన్ని బట్టి ఐదు నుంచి తొమ్మిది మంది పనిచేస్తున్నాం. విజయవాడ నగరం వరకూ ఏ ప్రాంతం నుంచి కాల్‌ చేసినా స్పందిస్తున్నాం.

ఆరునెలల పాపతో...
- డి.అలేఖ్య, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు వండుకోలేరు. చుట్టుపక్కల వారు భయంతో వండివ్వలేరు. అందుకే రోజూ ఓ పదిమందికైనా భోజనం ఇవ్వాలనుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టా. యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నా. నాకు ఆరునెలల పాప. తన బాగోగులూ చూసుకోవాలి. మరో పక్క పదకొండుకి విధులకు లాగిన్‌ అవ్వాలి. ఈ రెండూ సమన్వయం చేసుకుంటూ వంట పూర్తి చేస్తా. ముందు రోజు మాకు వచ్చిన ఫోనులు, స్నేహితులు, బంధువుల అభ్యర్థనలు అన్నీ కలిపి ఇరవై నుంచి ముప్పైమందికి  రోజూ వండి పంపిస్తున్నా. నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చేవరకూ ఆయా కుటుంబాలకు అండగా నిలబడతాం. ఈ విషయంలో మా వారు, ఇతర కుటుంబసభ్యుల సాయమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖర్చు మా సొంతం. ఎవరైనా ఈ రోజు మేం సాయమందిస్తాం అంటే...మాత్రం రోగులకు అదనంగా మాంసాహారాన్నీ పంపిస్తున్నా. వాలంటీర్లు లేకపోవడంతో డెలివరీకి కొంత ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పరిధిలోనే వీటిని అందిస్తున్నా. నేనేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోవడం లేదు. కొంచెమే చేయగలుగుతున్నానని బాధపడుతున్నా.

పిల్లలకు ప్రత్యేకంగా...
- పూర్ణిరెడ్డి, ఆశ్రి సొసైటీ, 9293414444

లాంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం బాధ్యతగా భావిస్తున్నా. నిరుపేదల పరిస్థితి మరింత దారుణం. పని చేయకుంటే పూట గడవదు. పని చెయ్యాలంటే కరోనా చేయనివ్వదు. అందుకే కష్టమైనా మా పరిధిలో మేం బాధిత కుటుంబాలకు రోజూ ఉచిత భోజనం అందించాలని నిర్ణయించుకున్నాం. తలా ఓ చేయి వేస్తే ఈ కష్టకాలం నుంచి అందరం బయటపడొచ్చు. హైదరాబాద్‌లోని మియాపూర్‌, కూకట్‌పల్లి, ప్రగతినగర్‌... వంటి ప్రాంతాల వారు ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ఇంటికే భోజనం తెచ్చిస్తాం. ఇంట్లో పిల్లలు ఉంటే ప్రత్యేక దృష్టితో వారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. నేను చేసేది కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు. కానీ కొంత మందికైనా సాయపడగలుగుతాను కదా!  ఆశ్రి సొసైటీ పేరుతో కొన్నాళ్లుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నా. మా వారు కిషోర్‌రెడ్డి, మా అమ్మానాన్నలు కూడా ఈ పనుల్లో భాగం అయ్యారు.

ఇతర రాష్ట్రాల్లోనూ...
- భార్గవీ రెడ్డి బిజ్జం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

మా ఇంట్లో ఇద్దరికి కొవిడ్‌ వచ్చింది. ఆ సమయంలో ఇంటి పనులు, వంట చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు స్నేహితులే అన్నీ చేసిపెట్టారు. రెండోవేవ్‌లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. అది గమనించాక మేం వండుకున్న దానిలోనే మా చుట్టుపక్కల ఉండే ఓ నలుగురు కొవిడ్‌ రోగులకైనా భోజనం పంపించాలనుకున్నా. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేస్తే... కొందరు స్నేహితులు స్పందించారు. అలా అంతా కలిసి ప్రారంభించిందే ‘కుక్‌’(కలెక్టివ్‌ ఆపర్చ్యునిటీ ఆఫ్‌ కైండ్‌నెస్‌). హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, వైజాగ్‌, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ రోజూ వంద నుంచి రెండు వందల మంది ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు భోజనం పంపడం మొదలుపెట్టాం. నేను వాల్యూ మొమెంటెమ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నా. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్నా.

అమ్మలా చేస్తున్నా...
- నిహారికా రెడ్డి, డిజైనర్‌ 9701821089

ఒంట్లో బాగోనప్పుడు ఎవరైనా వండి పెడితే బాగుండు అని చాలా సార్లు అనుకుంటాం. అమ్మలేని లోటు నాకు తెలుసు. ఈ కొవిడ్‌ సమయంలో అలాంటి అవసరం చాలా మందికి ఉంటుందని ఓ తల్లిగా అర్థం చేసుకోగలను. అందుకే హోం ఐసొలేషన్‌లో... వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి పోషకాహారం పంపించాలనుకున్నా. పండ్లు, పెరుగు, కూరగాయలు అన్నీ ఉండేలా మెనూ సిద్ధం చేస్తున్నా. పుట్టగొడుగులు, సోయా, క్యారెట్‌, సెనగలు, పండ్లు, పాలతో రోజూ ఓ పది మందికైనా ఆహారం అందించాలనుకుని మొదలు పెట్టా. తర్వాతే తెలిసింది అవసరం అంతకు మించి అని! లెక్కకు మించి కాల్స్‌ వస్తున్నాయి. తెల్లవారు జామునే వంట మొదలుపెట్టి పదకొండుకల్లా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ, యూసఫ్‌గూడ, సనత్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వారికి భోజనం అందిస్తున్నాం. గతేడాది లాక్‌డౌన్‌లో సుమారు మూడువేల కుటుంబాలకు నిత్యావసర సరకుల్ని అందించా. అందుకోసం బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేశా. ఈ విషయంలో నా భర్త, పిల్లల సహకారం చెప్పలేనంత! స్నేహితులూ స్పందిస్తున్నారు. అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం చూస్తుంటే బాధ్యత రెట్టింపయ్యింది.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని