16 లక్షల మాస్కులు కుట్టిచ్చారు!
close
Updated : 17/06/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

16 లక్షల మాస్కులు కుట్టిచ్చారు!

చుట్టూ చీకట్లు అలముకున్నప్పుడు నిరాశలోకి కూరుకుపోవడం కాదు.. వెలుగులు నింపే దారికోసం అన్వేషించాలి.  వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఈ మహిళలూ అదే చేశారు... కొవిడ్‌ కారణంగా ఉపాధిలేక అల్లాడిపోతున్న వేళ.. వేల మంది మహిళలు రాత్రింబవళ్లూ మాస్కులు, పీపీఈ కిట్లు కుట్టి ఇంటికి ఆసరా అయ్యారు.. మహమ్మారిపై పోరులో మేమూ ఉన్నామన్నారు!

హైదరాబాద్‌ శివారులోని మేకగూడ గ్రామ సమాఖ్యలో 50 మంది సభ్యులున్నారు. కరోనా కారణంగా ఇళ్లలో మగవారి ఉద్యోగ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందరినీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇంతలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్‌డీఏ) కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఈ సమాఖ్య మహిళలు. మొదట్లో అధికారులు కొన్ని సూచనలు ఇచ్చారు. వాటి ఆధారంగా మాస్కులు కుట్టడంపై దృష్టి పెట్టారు. అలా అందరూ కలిసి ఇప్పటివరకూ 4 లక్షలు కుట్టారు. దీనివల్ల అటు కుటుంబాలకు, ఇటు సమాజానికి చేయూత నివ్వగలుగుతున్నామని ఈ సమాఖ్య నాయకురాలు స్వప్న సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 746 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. వీటిలో రెండు లక్షల పైచిలుకు సభ్యులున్నారు. కరోనా వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉపాధికి గండిపడింది. దాంతో ఆ సంఘాల్లో కుట్టు పని తెలిసిన మహిళలు మాస్కుల తయారీలో పాలొంటున్నారు. మొత్తమ్మీద 22 వేలకు పైగా మహిళలు ఆ కార్యక్రమంలో రాత్రింబవళ్లూ నిమగ్నమవుతున్నారని డీఆర్‌డీఏ ఏపీడీ జంగారెడ్డి వెల్లడించారు. ఆ సంస్థే వివిధ సంస్థల నుంచి ఆర్డర్లు తీసుకుని ఈ సంఘాల సభ్యులకు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. కొన్ని సంఘాలు పీపీఈ కిట్లు కూడా తయారు చేస్తున్నాయి. గతేడాది ప్రభుత్వ ఆర్డర్‌ మేరకు శంకర్‌పల్లి మహిళా సమాఖ్య నుంచి 200 పీపీఈ కిట్లు చేసిచ్చామని చెప్పారు అధ్యక్షురాలు అనిత. ఇలా జిల్లాలోని మహిళా సమాఖ్యలు ఇప్పటివరకు 12 లక్షలపైచిలుకు మాస్కులు చేసి అందించాయి. వీటిని వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు వినియోగించేందుకు ఇస్తున్నారు. మరో 3 లక్షల పైచిలుకు మాస్కులు ఇతర సంస్థలకు విక్రయించారు. హైదరాబాదు నగరంలోని ఒక ప్రముఖ ఆసుపత్రి ఒక్కటే లక్ష మాస్కుల ఆర్డరిచ్చింది. ‘మాస్కుల తయారీలో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నాం. దాని వల్ల వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు ఆర్డర్లు ఇస్తున్నాయ’ని మహేశ్వరం మండలం తుమ్మలూరు సమాఖ్య అధ్యక్షురాలు కవిత చెప్పారు. జిల్లాలో దాదాపుగా అన్ని మహిళా సంఘాలూ ఏడాదిగా ఇదే పనిలో ఉన్నాయి. గిరిజన సమాఖ్య కూడా ఈ సంఘాలు కుట్టిన మాస్కులనే తన పరిధిలోని గిరిజనులకు పంపిణీ చేస్తోంది.

కొరతనూ అధిగమిస్తూ...
ఒక్కో మాస్కు తయారీకి రూ.20 ఖర్చు అవుతోంది. బట్ట, ఎలాస్టిక్‌ వంటి ముడిసరకు డీఆర్డీఏ తరఫున సరఫరా చేస్తున్నారు. కుట్టినందుకు ఒక్కొక్క మాస్కు ద్వారా రూ.3 లేదా 4 సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరం రోజుకు 250 నుంచి 300 వరకు కుడుతున్నామని మొయినాబాద్‌ మండలం చినమంగళారం సమాఖ్య అధ్యక్షురాలు నస్రీన్‌ చెబుతున్నారు. దీనివల్ల కష్టకాలంలో  కుటుంబాలకు ఆసరాగా నిలబడగలుగుతున్నామని ఆమనగల్లు మండలం చింతలపల్లి కొప్పు స్వాతి వివరించారు. అయితే ఇటీవల మాస్కులకు ముడిసరుకు కొరత ఏర్పడింది. దీన్ని సిరిసిల్ల వంటి ప్రాంతాల నుంచి తెప్పించి ఈ సంఘాలకు అందించారు. ప్రస్తుతం అక్కడ ఉత్పత్తి తగ్గడం, రవాణా నిలిపివేల వంటి వాటితో ముడి వస్త్రం సకాలంలో అందడం లేదు. దీనివల్ల ఉపాధిపై ప్రభావం పడుతోందని మహిళలు వాపోతున్నారు. అధికారుల సహకారంతో ఈ ఆటంకాలను క్రమంగా అధిగమిస్తామని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- అమరేంద్ర యార్లగడ్డ, హైదరాబాద్‌

మనసుకు నచ్చిన పనినే ఎంచుకోవాలి. అప్పుడు సహజంగానే మీరా పని చేయడానికి తెగువ, చొరవ చూపుతారు.
- పల్లవి సింగ్‌, మెంబర్‌, లీడర్స్‌ ఎక్సలెన్స్‌, హార్వర్డ్‌ స్క్వేర్‌


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని