ఆ రుచులను నిజాం మెచ్చారు!
close
Published : 24/12/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రుచులను నిజాం మెచ్చారు!

ఖుజీ..  దమ్‌కీరాన్‌... కైరీకా దోప్యాజా.. మటన్‌ షికమ్‌పూర్‌... ఇవన్నీ వంద సంవత్సరాల క్రితం నిజాం ప్రభువుల భోజనాల బల్లపై సందడి చేసిన వంటకాలు.. ఇప్పటితరానికి పరిచయం లేని ఆ అద్భుతమైన ఆ వంటకాల తయారీ రహస్యాల్ని అందిపుచ్చుకున్నారామె. ఆ రుచులను నేటికీ యథాతథంగా అందిస్తూ విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు నిజాం కుటుంబానికి చెందిన షహనూర్‌..  
‘వంట చేసేటప్పుడు వంటింట్లో అమ్మ ఒక రాణిలా కనిపించేది. నా వంటకాలు గురించి చెప్పాలంటే ముందు అమ్మ నుంచి నేనేం నేర్చుకున్నానో చెప్పాలంటారు’ షహనూర్‌. నవాబు కుటుంబంలో పుట్టిన షహనూర్‌ తండ్రి షౌకత్‌ అలీఖాన్‌ ఐఏఎస్‌ అధికారి. తల్లి ఫయ్యక్‌ జెహాన్‌ హైదరాబాద్‌కు చెందిన షానవాబ్‌ గారాలపట్టి. ఆమె షా మంజిల్‌(ప్రస్తుత రాజ్‌భవన్‌)లో పెరిగింది. ‘నాకు ఏడాది వయసున్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పటివరకూ అమ్మకు చిన్న పనిచేయడం కూడా తెలియదు. కానీ ఆయన దూరమయ్యాక ప్రతి పనీ నేర్చుకుంది. ముఖ్యంగా ఎంతమంది నౌకర్లున్నా మాకు తానే వండిపెట్టేది. అమ్మమ్మ ముజాఫర్‌ ఉన్నీసాబేగం యెమన్‌ సుల్తాన్‌ కుటుంబీకురాలు. ఆమెనడిగి అక్కడి సంప్రదాయ వంటకాలను నేర్చుకుని మరీ మాకు  చేసి పెట్టేది అమ్మ. నానమ్మ ఇక్కడి పాతతరం వంటలని నేర్పేది. అమ్మ ఏం చేసినా చాలారుచిగా ఉండేది. ఇంత రుచి ఎలా సాధ్యం అని ఎవరైనా అడిగితే ‘వంటను ప్రేమిస్తే రుచి పెరుగుతుంది’ అని నవ్వుతూ చెప్పేదంటారు షహనూర్‌ జహాన్‌.

పన్నెండో ఏట నుంచే.... సహజంగా అమ్మ చేతివంటపై ఇష్టం..వాటిని నేర్చుకోవాలనే తాపత్రయం రెండూ పెరిగాయి నాలో. ఆ మెలకువలు నేర్చుకుని పన్నెండేళ్ల వయసులోనే వంట చేయడం మొదలుపెట్టా. ఆ వంటకాలు బంధువులు, స్నేహితుల్లో నాకో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీన్ని కెరీర్‌గా ఎందుకు మార్చుకోకూడదంటూ మా అమ్మాయి సోషల్‌మీడియాలో ఓ పేజీని తెరిచి నేను చేసిన వంటకాల ఫొటోలను పోస్ట్‌ చేసేది. అలా ఆరేళ్లుగా ఆన్‌లైన్‌ ఆర్డర్లు రావడంతో ఉర్దూలో వంటకం అని అర్థం వచ్చేలా ‘ఖాసా’ పేరుతో సంస్థను ప్రారంభించా. మా పూర్వీకులు మెచ్చిన ఖుజీ, శిఖంపుర్‌, రన్‌ ఘోష్ట్‌, కైరీ కా దోప్యాజ్‌, హలీం, మటన్‌దాల్చా, దమ్‌ కా రన్‌, చికెన్‌వార్మీ, మటన్‌, చికెన్‌ రోస్ట్‌, మటన్‌ దాల్చా, దమ్‌ కా ముర్గ్‌ వంటివి 50 రకాలకు పైగా ప్రత్యేక వంటలను వినియోగదారులకు అందిస్తున్నారీమె. ఇవేకాకుండా యెమెన్‌ దేశానికి చెందిన ముకల్లా, అరేబియన్‌ దేశానికి చెందిన మటన్‌ వంటకం షహనూర్‌ ప్రత్యేకం. అన్నింటిలో బాదాంకా ఖండ్‌ చేయాలంటే ఎనిమిది గంటలపాటు సమయం పడుతుంది. ‘హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా పలు కార్పొరేట్‌సంస్థలు మాకిప్పుడు వినియోగదారులు. అమెరికా, నార్వే, యూరోప్‌దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.  నా వంటను రుచి చూసిన వారంతా నీ చేతిలో ఏదో మాయ ఉందంటారు. అదేంకాదు, అమ్మ చెప్పినట్లు వంటను ప్రేమిస్తా. అదే అసలైన రహస్యం’ అంటారామె.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని