ఆగండి.. చూడండి.. కొనండి!
close
Published : 07/05/2021 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగండి.. చూడండి.. కొనండి!

ఆన్‌లైన్‌లో అందమైన కుర్తా కనిపించింది.. వెంటనే బుక్‌ చేశారు. తీరా ఇంటికి వచ్చేసరికి అది నైటీలా ఉంది! వెబ్‌సైట్‌కు వెళ్లి చూస్తే అంతకు ముందు చూసిందే ఉంటుంది! ఇది చాలామందికి అనుభవమే. ఒక్కోసారి తిరిగిచ్చే వీలూ ఉండదు. వీలున్నా.. నిరాశ అలాగే ఉండిపోతుంది. కాబట్టి, ముందే కొన్ని విషయాలను పరిశీలించుకుంటే హ్యాపీ షాపింగ్‌ మీ సొంతం.

చాలావరకూ దుస్తులను మోడల్స్‌కు చక్కగా అద్దినట్లుగా కనిపించేలా చేస్తారు. ఫొటోల్లో, వెలుతురులో చక్కని రంగులోనే కనిపిస్తుంది. మీ దగ్గరికి చేరేసరికీ అదే రంగులో ఉండాలనేం లేదు. వివరాల్లో రంగు, ఏ వస్త్రం ఉపయోగించారో తప్పకుండా చూడాలి. కొన్ని సైట్‌లు జూమ్‌లో పరిశీలించుకునే వీలూ కల్పిస్తున్నాయి.
మీరు గమనించారో లేదో... కొన్ని సార్లు మోడల్‌ సన్నగా ఉన్నా... కాస్త వదులుగా ఉన్న దుస్తులను వేసుకుంటుంది. మీ సైజ్‌ ప్రకారం ఎంచుకున్నా మీకూ అలాగే ఉంటుందనుకోవద్దు. కొలతల వివరాలను రూఢీ చేసుకున్నాకే నిర్ణయించుకోవాలి.
ప్రతి వెబ్‌సైట్‌లోనూ వినియోగదారుల సమీక్షలను ఇస్తుంటారు. బాగుంది, బాగోలేదుకే పరిమితం కాక ఫొటోలేమైనా ఉన్నాయేమో చెక్‌ చేసుకోవాలి. అవీ సంతృప్తినిస్తే భేషుగ్గా తీసుకోవచ్చు.
బట్టలు చూడటానికి బాగుంటే సరిపోదు. వేసుకున్నాక శుభ్రం చేసుకోవడమూ తేలిగ్గా ఉండాలి. దుస్తుల వివరణలో ‘డ్రైక్లీనింగ్‌ మాత్రమే’, ‘చల్లటి నీటితోనే ఉతకాలి’.. వగైరా సూచనలుంటాయి. వాటినీ చూడాలి.
చాలా బాగుంది కదా అని ధర ఎక్కువైనా తీసుకుంటాం. తీరా వేసుకుని ఏ వేడుకకో వెళితే.. అవతలి వ్యక్తి ఇంకా తక్కువకు కొన్నారని తెలిస్తే? కొన్న ఆనందం దెబ్బకు ఆవిరైపోతుంది. కాబట్టి, ముందుగానే దుస్తుల పేరు ఆధారంగా గూగుల్‌లో కొట్టి చూసుకోండి. వేరే ఆఫర్లుంటే తెలుస్తాయి.
కొన్ని చూడగానే ఇట్టే ఆకట్టుకుంటాయి. కానీ ఆ స్టయిల్‌ మీరు వేసుకోగలిగిందేనా? చూసుకోవాలి. తీరా కొని, వేసుకోవడానికి సంకోచిస్తే... బీరువాకే పరిమితమైపోతుంది.
కార్ట్‌లోకి కొట్టాక షిప్పింగ్‌ ఛార్జీలనూ చూసుకోవాలి. అత్యవసరం కాకపోతే.. కొద్ది రోజులు వేచి ఉండటమే మంచిది. చాలా వరకూ తగ్గేవీలుంటుంది. అలాగే రిటన్‌ పాలసీలనూ గమనించాలి.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని