వరి కంకులే కళారూపాలు
close
Published : 07/05/2021 03:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరి కంకులే కళారూపాలు

గడ్డి పరకలో ఆమెకు ఎన్నో కళాకృతులు కనిపించాయి.
వరికంకుల్లో అన్నపూర్ణనూ, రైతు కష్టాన్నీ చూసింది.
రెండింటినీ మేళవిస్తే.. స్వాగత తోరణాలు, హారాలు, చీరలు.. ఇలా ఎన్నో రూపుదిద్దుకున్నాయి.
దేవతా ప్రతిమలకు చీరలు, హారాలు.. మరెన్నో ప్రతిరూపాలయ్యాయి. వేడుకల్లో బహుమతులూ అయ్యాయి!
ఇవే ఎందుకంటే.. ఏళ్లపాటు పాడవకుండా ఉండటమే కాదు.. నేటి తరానికి వ్యవసాయ ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి కూడా అంటున్నారు. ఆమే.. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన సింగంశెట్టి శివనాగేశ్వరమ్మ. వసుంధరతో ఆవిడ పంచుకున్న అనుభవాలివీ...

శివనాగేశ్వరమ్మ.. సామాన్య గృహిణి. దూరవిద్యలో బీఏ చదివారు. తన పరిజ్ఞానంతో ఆయుర్వేద మందులను తయారు చేసి, అందరికీ ఉచితంగా ఇవ్వడం అలవాటు. భర్త సుబ్బారావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉద్యోగి. నలుగురు పిల్లలు, స్థిరపడ్డారు. పదేళ్ల క్రితం ఓరోజు భర్తతో కలిసి పొలానికి వెళ్లారు. వచ్చేటప్పుడు వరి కంకుల్ని తెచ్చుకున్నారు. తర్వాత ఆలోచన వచ్చి వాటితో తోరణాలు చేశారు. అవి చూసిన బంధువులు తమకూ కావాలని అడిగారు. అలా ఆవిడ కళా ప్రయాణం మొదలైంది. తర్వాత ఎండుగడ్డితో పల్లకీలు, గృహాలు, హారాలు, ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాల నమూనాల రూపకల్పన మీద దృష్టి పెట్టారు. ఇదంతా సొంతంగా నేర్చుకున్నదే.
శుభకార్యాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్తే వరి కంకుల తోరణాలు, గుచ్ఛాలు, దండలను బహుమతులు ఇవ్వడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ‘వరి కంకులు అన్నపూర్ణాదేవికి ప్రతిరూపం. ఈ తోరణాలు, వడ్ల గుచ్ఛాలు ఇంట్లో ఉండటం గృహిణులు శుభసూచకంగా భావిస్తారు. అందుకే అందరికీ ఉచితంగా అందజేస్తున్నా. మామూలు పూలతో చేసే తోరణాలు, పుష్పగుచ్ఛాలు రెండ్రోజులకే వాడిపోతాయి. అదే వరి కంకులు, గడ్డి పరకలతో చేసినవి తడవకుండా ఉంటే పది నుంచి ఇరవై ఏళ్ల వరకూ చక్కగా ఉంటాయి. ఇంట్లో వరి కంకుల తోరణాలు, గుచ్ఛాలు, హారాలు చూసినప్పుడల్లా రైతు కష్టం అందరికీ తెలియాలి. వీటి ద్వారా నేటి తరానికి వ్యవసాయ ప్రాముఖ్యాన్ని తెలియజేయడమూ నా ఉద్దేశం’ అంటారు.

దేవతా ప్రతిమలకూ..
వరి కంకుల హారాలు, చీరలు, దండలను ప్రముఖ ఆలయాల్లో దేవాతామూర్తుల అలంకరణకు అందజేస్తున్నారు నాగేశ్వరమ్మ. గడ్డిపరకలతో బాపట్లలోని భావనారాయణ స్వామి గాలిగోపురం నమూనా తయారీకి నెల రోజులు, అమరావతి బౌద్ధ స్తూపం తయారీకి నెల రోజులు, భీమవరం సోమేశ్వరాలయంలో అన్నపూర్ణాదేవికి వరి కంకుల చీర తయారీకి, పెనుగంచిప్రోలులోని గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి చీరల తయారీకి 20 రోజులు పట్టింది. పొన్నూరు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి మూలవిరాట్కు 18 అడుగుల వరి కంకుల దండ రూపొందించారు. ఇష్టమైన పని కావడంతో రోజూ ఆరేడు గంటలు కూర్చుని చేసినా కష్టమనిపించదంటారు 60 ఏళ్ల నాగేశ్వరమ్మ. ‘దేవతామూర్తులను వరికంకులు, పరకలతో రూపొందించిన చీరలు, హారాలతో అలంకరించటం నా అదృష్టం. మా వారి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వెళ్లి అక్కడి దేవతామూర్తుల అలంకరణకు చీరలు, హారాలు అందజేయాల’నుందన్నారు.
ఈవిడ రూపొందించిన కళాకృతులను బాపట్లలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో ప్రదర్శించారు. వాటి ద్వారా ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆమె కళానైపుణ్యానికి మాజీ సీఎం చంద్రబాబు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల ప్రశంసలు దక్కాయి.

- ఘట్టమనేని సురేశ్‌కుమార్‌, న్యూస్‌టుడే, బాపట్ల


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని