అందమైన కాపురానికి పంచ సూత్ర ప్రణాళిక!
close
Published : 08/05/2021 00:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందమైన కాపురానికి పంచ సూత్ర ప్రణాళిక!

అనుబంధం హాయిగా కొనసాగాలంటే దంపతులిద్దరికీ ఒకరంటే మరొకరికి అంతులేని ప్రేమ ఉండాలి. సర్దుకుపోయే గుణమూ కావాలి. అప్పుడే ఆ కాపురం కలతలు లేకుండా ఉంటుంది. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించి చూడండి.

వాదనలొద్దు..

కొందరు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుంటారు. నువ్వా, నేనా అన్నట్లు వాదించుకుంటారు. ఇది సరి కాదు. నిజంగా ఏదైనా సమస్య వచ్చి చిన్నపాటి గొడవ జరిగినా ప్రధాన విషయాన్ని గురించి మాట్లాడాలి తప్ప ఇతరత్రా వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలొద్దు. ఎప్పటి విషయాలనో గుర్తు చేసి గొడవను పెంచుకోవద్దు. ఇలా చేస్తే మీ బంధం బలహీనమవడమో, దూరం పెరగడమో జరుగుతాయి.


మెచ్చుకోలూ ముఖ్యమే!

భాగస్వామి మెచ్చుకుంటే సంతోషపడని వారుంటారా. కాబట్టి అప్పుడప్పుడూ ఎదుటి వారి పనులను మెచ్చుకుంటూ ఉండాలి. చిరు ప్రశంసతో వారూ పొంగిపోతారు. మీ శ్రీవారు/ శ్రీమతి మానసిక ఆందోళనతో ఉంటే మాటల్లో పెట్టి విషయం కనుక్కోవాలి. మెల్లగా ఉత్సాహపరచాలి. తన బలాలు పెరిగేందుకు మీ సాయం అందించాలి.
 

ఎక్కువ అంచనాలొద్దు!

భాగస్వామిపై మీ అంచనాలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. తనను ఎప్పుడూ ఇతరులతో పోల్చొద్దు. ఇలా చేస్తే వారు నొచ్చుకోవడం ఖాయం. అతిగా అంచనా వేసుకోవడం మానేసి పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి.
 

గౌరవం... ఇచ్చి పుచ్చుకోవాలి

జీవిత భాగస్వామికి కేవలం ప్రేమాభిమానాలే కాదు. గౌరవ మర్యాదలు ఇవ్వడమూ తప్పనిసరి. మంచి, చెడు రెండింటిలోనూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. మీకెంత మంది ఆప్తమిత్రులున్నా, జీవిత భాగస్వామే మీ నిజమైన నేస్తమని గుర్తుంచుకోవాలి.
 

 

క్షమించడం నేర్చుకోవాలి...

ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవద్దు. కుటుంబం అన్నాక చిన్నా, పెద్దా సమస్యలంటూ వస్తుంటాయి. అంత మాత్రన భాగస్వామితో గొడవలకు దిగొద్దు. ఎదుటివారి మాటల వల్ల మీ మనసు గాయపడినా.. మీరూ అదేవిధంగా మాట్లాడొద్దు. మీ మౌనం వారిని ఆలోచించేలా చేస్తుంది. కొన్ని విషయాల్లో సర్దుకు పోవాలి. అప్పుడే సంసార నౌక సాఫీగా సాగుతుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని