సూపర్‌ ఫుడ్స్‌ అంటే ఏమిటి?
close
Published : 09/05/2021 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూపర్‌ ఫుడ్స్‌ అంటే ఏమిటి?

ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో సూపర్‌ ఫుడ్స్‌ గురించి ఎక్కువగా చూస్తున్నా. ఫుడ్‌ ప్యాకెట్స్‌ మీద కూడా రాసి ఉంటుంది. అసలు సూపర్‌ ఫుడ్స్‌ అంటే ఏమిటి? వాటిలో ఏ పోషకాలుంటాయి?

- రమ్య, విజయనగరం

సూపర్‌ ఫుడ్స్‌కు శాస్త్రీయంగా ప్రత్యేక నిర్వచనం అంటూ ఏమీలేదు. మన శరీరానికి కావాల్సిన పోషకాలను అధిక మొత్తంలో అందించే పదార్థాలను సూపర్‌ ఫుడ్స్‌ అంటారు. వివరంగా చెప్పాలంటే... ఒక ఆహార పదార్థంలో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటే ఆ పదార్థాన్ని సూపర్‌ ఫుడ్‌ అంటారు.  సామాజిక మాధ్యమాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. నట్స్‌, అవిసె గింజలు, మునగాకు, బెర్రీస్‌, దానిమ్మ, నేరేడు, ఉసిరి, పసుపు, చిరుధాన్యాలు, వెల్లుల్లి, అవకాడో, క్వినోవా.... ఇవన్నీ సూపర్‌ఫుడ్సే. వీటిలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని, పోషణను ఇవ్వడంతోపాటు రోగనిరోధకత పెరగడానికి దోహదం చేస్తాయి.
అవకాడో, బెర్రీస్‌, క్వినోవా... లాంటివి దొరక్కపోతే ప్రత్యామ్నాయంగా మన దగ్గర బోలెడు పదార్థాలున్నాయి. బెర్రీస్‌ బదులుగా నేరేడు పండు, రేగుపండ్లను తీసుకుంటే బోలెడు పోషకాలొస్తాయి. క్వినోవా అందుబాటులో లేకపోతే చిరుధాన్యాలనే చక్కగా ఎంచుకోండి. వాల్‌నట్స్‌ కొనలేమనుకుంటే అవిసెగింజలు మనకు అందుబాటులోనే ఉంటాయి కదా. మన చుట్టూ బోలెడు సూపర్‌ ఫుడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకుంటే సరి.
సూపర్‌ ఫుడ్స్‌ సహజంగా లభిస్తాయని మనందరికీ తెలుసు. వీటిని ఉపయోగించి కొన్ని రకాల ఆహార ఉత్పత్తులనూ తయారు చేస్తున్నారు. ఉదాహరణకు మునగాకు. కొంతమందికి దీన్ని తినడం ఇష్టం ఉండకపోవచ్చు. కానీ దీంట్లో పోషకాలు బోలెడు. కాబట్టి నేరుగా కాకుండా దాంతో తయారైన టీలు, బిస్కట్లు తీసుకోవచ్చు. చిరుధాన్యాలతో బిస్కట్లు, లడ్డూలు చేస్తున్నారు. అలాగే వీటిని బిస్కట్లు, పాస్తా, నూడుల్స్‌ లాంటి వాటిలో వేసి పోషకయుతంగా మారుస్తారు. కాకపోతే ఇలా ప్యాక్డ్‌ పదార్థాలు కొనుక్కునే ముందు వాటి ప్యాకెట్‌పై సూపర్‌ఫుడ్స్‌ ఎంత మొత్తంలో ఉన్నాయో పరిశీలించుకోవాలి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని