కష్టైశ్వర్యాల విజేత
close
Updated : 29/05/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కష్టైశ్వర్యాల విజేత

స్ఫూర్తి కెరటం

కవ్వించే అందం కాదు.. గాడ్‌ఫాదర్‌ అండ లేదు... ఆర్థికంగా స్థితిమంతురాలు కాదు... ఉన్నదల్లా నటి కావాలనే కోరిక ఒక్కటే... కాళ్లరిగేలా తిరిగింది. చిన్న పాత్రైనా ఇమ్మని వేడుకుంది... చిన్నచూపునకు గురైంది.. అవమానాలు భరించింది... ప్రతిభనే నమ్ముకుంది. సీన్‌ కట్‌ చేస్తే! ఐశ్వర్యరాజేష్‌ నాలుగైదేళ్లలో గుర్తించుకునే సినిమాలు చేసిన మంచి నటి. టెడెక్స్‌ వేదికపై తన కష్టాలు, అనుభవాలు, విజయాలు పంచుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.. ఆమెతో వసుంధర మాట్లాడింది.

తమిళనాడులో పుట్టిపెరిగిన తెలుగమ్మాయి ఐశ్వర్య. నాన్న రాజేశ్‌ తెలుగు సినిమాల్లో ఒకప్పుడు మంచి పేరున్న నటుడు. దురదృష్టవశాత్తు ఆమె చిన్నవయసులోనే తండ్రి చనిపోయారు. దాంతో కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి జారిపోయింది. ఐశ్వర్య తల్లి అన్నీ తానై నలుగురు పిల్లల్ని పోషించేది. ఏదోలా గడిచిపోతోంది అనుకుంటే రెండేళ్ల తేడాలో ఐశ్వర్య సోదరులిద్దరూ కన్నుమూశారు. ఆ తల్లిపై కష్టాల పిడుగు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు. కుటుంబాన్ని గట్టెక్కించడానికి ఆమె నరకయాతన పడేది. తల్లికి సాయ పడేందుకు ఆమె చదువుకుంటూనే పార్ట్‌టైం ఉద్యోగాలు చేసేది.

అన్నీ భరిస్తూ..

నటన ఐశ్వర్య రక్తంలోనే ఉంది. చదువైపోగానే కష్టపడి బుల్లితెర షోలో అవకాశం సంపాదించి, మెల్లిగా సీరియల్స్‌లోకి అడుగుపెట్టింది. కానీ తన లక్ష్యం సినిమాలు. ఆ ప్రయత్నం ప్రారంభించగానే మొదలయ్యాయి అసలైన కష్టాలు. ఎక్కడకెళ్లినా తిరస్కారాలే. రంగు తక్కువని చిన్నచూపు చూసేవారు. చిన్న పాత్ర అడిగినా ఎగాదిగా చూసేవాళ్లు. రకరకాల కామెంట్లు చేసేవాళ్లు. ‘మనసు చిన్నబుచ్చుకుంటే, అవమానాలతో ఆగిపోతే నా కల నెరవేరదని తెలుసు. పట్టుదలగా ప్రయత్నించేదాన్ని. మెల్లిగా చిన్నచిన్న పాత్రలు రావడం మొదలయ్యాయి. మనసు పెట్టి చేసేదాన్ని. నాలోని నటనను గుర్తించి ఓ తమిళ దర్శకుడు ప్రధాన పాత్ర ఇస్తానన్నారు. ఇద్దరు పిల్లల తల్లి పాత్ర అది. నటనకు అవకాశం ఉండటంతో సంతోషంగా ఒప్పుకున్నా. ‘కాకాముట్టై’లోని ఆ పాత్ర ఎన్నో ప్రశంసలు, అవార్డులు తెచ్చిపెట్టింది’ అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. అలా తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో కలిపి 30 వరకు సినిమాలు చేసిందీ అమ్మాయి. తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. తిరస్కారాలు ఎదురైన చోటే జేజేలు అందుకుంటోంది.

‘టెడెక్స్‌ వేదికపై నా జీవితంలో ఏం జరిగిందో నాలాంటి అమ్మాయిలకు చెప్పాలనిపించింది. నా అనుభవాలు వారిలో స్ఫూర్తిని కలిగిస్తాయని ఆశించా. ఎదురైన అవమానాల నుంచి నేర్చుకున్న పాఠాలనే చెప్ఫా సినీ ప్రపంచంలో శరీరవర్ణం, అందంకన్నా ప్రతిభకే స్థానం ఉంటుందని నిరూపించాలనుకున్నా’ అంటోంది ఐశ్వర్య.

* టెడెక్స్‌ పలుకులు

టెడెక్స్‌ వేదికపై ఐశ్వర్య చెప్పిన మాటలు అందరి మనసుల్ని తాకాయి. ఈ వీడియోని 16 లక్షల మంది చూశారు. సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది షేర్‌ చేసుకున్నారు. ఆ మాటల్లో కొన్ని.

* అమ్మ చదువుకోలేదు. నన్ను, తమ్ముడినీ బాగా చదివించాలనుకునేది. డబ్బులుండకపోయేవి. క్షణం తీరిక లేకుండా పని చేసేది. హోల్‌సేల్‌గా చీరలు తెచ్చి ఇంటి వద్ద విక్రయించేది. నేనూ సాయపడేదాన్ని.

* ఇంటర్‌ ఫస్టియర్‌లో డబ్బుల కోసం ఓ సూపర్‌మార్కెట్లో చేరా. చాకొలెట్‌ సాస్‌ను రుచి చూపించడం నా పని. షాపింగ్‌కి వచ్చే ప్రతివారిని ఆపి, సాస్‌ చేతిలో వేసి తినమనేదాన్ని. పార్ట్‌టైం చేస్తే నెలకు రూ.225 జీతం ఇచ్చేవారు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని