కరోనాపై ఎక్కడి వార్‌ అక్కడే
close
Updated : 30/05/2020 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై ఎక్కడి వార్‌ అక్కడే

కొవిడ్‌ హీరోస్‌

అదనులో వేసిన పంట... సరైన సమయంలో అందుకున్న అవకాశం ఫలిస్తాయి, ప్రయోజనాల పంట పండిస్తాయి. ఆ మహిళలూ అదే చేశారు. ఓ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఆ మహిళా బృందం కరోనా సమయంలో అద్భుతమే చేసింది. ఒకరికొకరు దూరంగా ఉన్నా కలిసికట్టుగా పనిచేశారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సద్వినియోగం చేసుకున్నారు. లక్షల్లో ఫేస్ షీల్డ్స్ ను, వివిధ రకాల కరోనా రక్షణ సామగ్రిని తయారుచేశారు..

మహిళలంతా ఉన్నత విద్యావంతులో, ఆ రంగంలో తలపండిన నిపుణులో కాదు...హైదరాబాద్‌కి చెందిన బటర్‌ఫ్లైఫీల్డ్స్‌ అనే ఆన్‌లైన్‌ విద్యాసంస్థలో పనిచేస్తోన్న సాధారణ ఉద్యోగుల బృందం వీరిది. ఈ సంస్థ పన్నెండేళ్లుగా విద్యార్థులు గణితం, సైన్సుని తేలిగ్గా అర్థం చేసుకునేలా ప్రయోగాలు చేస్తోంది. అంటే... ఉదాహరణకు గాలిమోటారు ఎలా తిరుగుతుంది? అయస్కాంతక్షేత్రం ఎలా పనిచేస్తుంది?...అన్న విషయాలని పాఠాల రూపంలో కాకుండా తేలిగ్గా అర్థమయ్యేలా కిట్‌ల రూపంలో అందిస్తుంది. దేశవ్యాప్తంగా సుమారు మూడువందల పాఠశాలలకు ఈ సంస్థ తన సేవలు అందిస్తోంది. కొవిడ్‌ రోగులకు చికిత్స చేసే వైద్యులు, ఇతర సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి పరికరాలు అవసరం? అలాంటివి మన దగ్గర ఎందుకు అందుబాటులో ఉండవు...వంటివన్నీ బటర్‌ఫ్లైఫీల్డ్స్‌ సహోద్యోగులు పిచ్చాపాటిగా మాట్లాడుకునే మాటల్లో బయటకు వచ్చాయి. అదే విషయాన్ని ఆ బృందానికి నాయకత్వం వహిస్తోన్న సంధ్య ఓ రోజు ఆ సంస్థ సీఈవో శరత్‌చంద్రతో ప్రస్తావించారు. ఆ క్షణం ఆయన ‘మరి మనవంతుగా ఏం చేయగలమో ఆలోచించండి’ అన్నారు.

ఫేస్ షీల్డ్స్ మొదలుపెట్టి...

అది ఆమెకు ఓ సవాల్‌లా అనిపించింది. ఆ విషయాన్ని తన బృందంతో పంచుకున్నారు సంధ్య. ‘చిన్నారుల కోసం వివిధ రకాల కిట్లను తయారు చేసేందుకు అవసరమైన ముడిసరకు మా దగ్గర అందుబాటులో ఉంది. వాటితోనే కరోనా రక్షణకు అవసరం అయిన ఫేస్ షీల్డ్స్ తోపాటూ ఇతర రక్షణ పరికరాలనూ తయారుచేయాలని ఓ నిర్ణయానికి వచ్చాం. రెండు రోజుల్లో డిజైనింగ్‌ పూర్తయ్యింది. కానీ ఉత్పత్తి ఎలా? ఎందుకంటే లాక్‌డౌన్‌లో ఉద్యోగులంతా ఎక్కడివారక్కడే ఇంటికే పరిమితమయ్యారు. వీడియోకాల్‌తో పని ముందుకు సాగడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలు మాట్లాడుకున్నాం. ఎవరైనా వేర్‌హౌస్‌ దగ్గరే క్వారంటైన్‌లో ఉండి పనిచేయగలరా? అని అడిగితే ఇద్దరబ్బాయిలు సరే అన్నారు. కానీ వారిద్దరితోనే పని పూర్తవ్వదు. ఎందుకంటే పాతికరోజుల్లో లక్ష ఫేస్ షీల్డ్స్ తయారు చేయాలనేది మా లక్ష్యం. వారు కటింగ్‌, పంచింగ్‌ వంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు మాత్రమే చేయగలరు. అసలు పని డిజైనింగ్‌తోనే. దానికి పనిచేయాల్సిన వారంతా ఇళ్లలోనే ఉన్నారు. ఆ సమయంలో ఉమ అనే అమ్మాయి ముడిసరకు మాకు పంపిస్తే ఇంటి నుంచే చేస్తాం అంది. ఆమె మాటతో మా అందరిలోనూ ఉత్సాహం వచ్చింది. కానీ ఎక్కడనుంచైనా పనిచేయడానికి ఇది కంప్యూటర్‌ వర్క్‌ కాదుగా. ఇబ్బందులు ఎదురవుతాయేమో అని భయపడ్డాం. ఎందుకంటే వీళ్లంతా నిపుణులేం కాదు. కొందరికి కనీస విద్యార్హతలు మాత్రమే ఉన్నాయి. అయినా ధైర్యంగా ముడిసరకుని వాహనాల్లో ఇళ్లకు అందించాం. తయారీ విధానాన్ని వీడియో రూపంలో చెప్పాం. అనుకున్నట్లుగానే వాళ్లు మొదటి లాక్‌డౌన్‌ కాలంలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు’ అంటూ వివరించారు సంధ్య.

మరో అడుగు...

అక్కడితో వారి ప్రయాణం పూర్తవ్వలేదు. అసలు వైద్యుల అవసరాలు ఎలాంటివో వారినే అడిగి తెలుసుకుంటే అని ఆలోచించిందీ సంస్థ. కొంతమంది వైద్యులను కలిసి మాట్లాడారు. ఆ సమయంలో నిమ్స్‌ వైద్యురాలు పద్మజ విదేశాల్లో కొవిడ్‌-19 రోగి కోసం చేసిన ఓ ఇంక్యుబేషన్‌ బాక్సుని వారికి చూపించి ఇలాంటివి మీరు చేయగలరా? అని అడిగారు. ఇది ఆ బృందానికి మరో ఛాలెంజ్‌. రెండు రోజుల్లోనే దాని ప్రోటోటైప్‌ తయారుచేసి మరోసారి శెభాష్‌ అనిపించుకున్నారు. తరువాత దానికి ఆ వైద్యురాలు కొన్ని మార్పులు సూచించడంతో వాటిని సరిచేసుకుని తయారీ ప్రారంభించిందీ బృందం. పీపీఈ కిట్స్‌, ఫేసష్‌ీల్డ్స్‌, ఇంక్యుబేషన్‌ బాక్స్‌, ఐసొలేషన్‌ బూత్స్‌ వంటివి సుమారు 11 రకాల రక్షణ పరికరాల్ని వీరు తయారు చేస్తున్నారు మొదట్లో ముప్పైమంది మహిళలు ఈ పనిచేసేవారు...లాక్‌డౌన్‌ సడలింపులతో స్థానికంగా మరో పదిహేను మంది యువతులకు ఉపాధి కల్పించిందీ సంస్థ. వీరు చేసే అన్ని ఉత్పత్తుల్లోనూ డిస్పోజబుల్‌, రీయూజబుల్‌ రకాలు ఉన్నాయి. ఆరువందల నుంచి పదివేల రూపాయల్లో ఇవి లభిస్తున్నాయి. సుమారు నాలుగు వందల ఇంక్యుబేషన్‌ బాక్సులను 80 ఆసుపత్రులకు సరఫరా చేశారు.

బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆసుపత్రులతోపాటు హైదరాబాద్‌లోని గాంధీ, నిమ్స్‌, ఏఐజీ, సన్‌షైన్‌ వంటి ఆసుపత్రులు ప్రస్తుతం ఈ పరికరాలని ఉపయోగిస్తున్నాయి. ‘ఇక్కడితో మా పని పూర్తయ్యిందనుకోవడం లేదు...ఈ స్ఫూర్తితో మరింతగా మా సేవలు కొనసాగించాలనుకుంటున్నాం’ అంటారు సంధ్య బృందం.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని