ఇంద్ర ధనుస్సులు కిటికీలో విరిశాయి!
close
Published : 28/03/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంద్ర ధనుస్సులు కిటికీలో విరిశాయి!

మనకోసం పోరాడుతున్న వైద్యులకు ఏమిస్తే ఆ రుణం తీరుతుంది. ఇంగ్లండ్‌ చిన్నారులు మాత్రం తమవంతుగా ఏడురంగుల ఇంద్రధనుస్సులను, దాంతోపాటే తమ చిరునవ్వులను కానుకలుగా ఇచ్చారు... అదెలానో చదివితే మీకే తెలుస్తుంది!

చిన్నారులు ఏ పనీ చేయకుండా కాసేపు కూడా కుదురుగా కూర్చోలేరు. కొందరైతే రెండు, మూడు పనులను ఒకేసారి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. టీవీ చూస్తూ, హోమ్‌వర్కు పూర్తిచేస్తుంటారు. ఓపక్క స్కూలుకెళ్లే టైమ్‌ అవుతుంటే.. ఈలోగా పక్కింటి నానీతో క్రికెట్‌ ఆడటానికి సిద్దమైపోతారు. అమ్మ టిఫిన్‌ తినిపిస్తుంటే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడటంలో బిజీ అయిపోతారు. ఎప్పుడూ తూనీగల్లా ఎగురుతుండే వీళ్లను పట్టుకుని ఇంటి పట్టున ఉంచడమంటే ఎంత కష్టమో కదా. ప్రస్తుతం కరోనా కష్టాల మూలంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పిల్లలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఆరుబయట హాయిగా ఆడుకునే పరిస్థితులూ లేవు. టీవీ చూసినా, ఫోన్‌లో గేమ్‌లు ఆడినా... రోజంతా అదే పనిచేస్తూ ఉండలేరు కదా. అందుకే సెలవుల్లో విసుగులేకుండా ఉండటానికి ఇంగ్లండ్‌కు దగ్గరలోని స్విన్‌డన్‌ పట్టణానికి చెందిన కొంతమంది చిన్నారులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఏడురంగులతో ఇంద్రధనుస్సుల బొమ్మలను వేసి వాటిని బయటకు కనిపించేలా కిటికీలకు తగిలిస్తున్నారు. ఇలా ప్రదర్శిస్తూ... కరోనా బాధితులకు సేవలందిస్తూ ఇరవై నాలుగ్గంటలూ కష్టపడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు. చిన్నారుల ఈ చిరు ప్రయత్నాలను చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులూ వాళ్లకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఒక ఇంట్లోని వాళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలంతా ఇలా పనుల్లో నిమగ్నమై ఉండటం వల్ల రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగానూ గడుపుతున్నారు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని