కౌమారా.. జాగ్రత్త!
close
Published : 18/05/2020 05:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కౌమారా.. జాగ్రత్త!

బాయిస్‌ లాకర్‌ రూం... ఇదో దిగ్భ్రాంతికర ఘటన. వసివాడని మనసుల్లో ఇంత కల్మషం ఎలా చొరబడుతోంది?చదువుల్లో మునగాల్సిన పిల్లలు ఇలాంటి చేష్టలకు దిగుతున్నారెందుకు? కన్నవాళ్లలో ఇలాంటి సందేహాలెన్నో!
దిల్లీలోనే కాదు.. ఇలాంటి వారు మన పక్కన, మన ఇంట్లోనే ఉండొచ్చు... వాళ్లను కట్టడి చేయడంలో.. దారిలో పెట్టడంలో అమ్మ పాత్రే ముఖ్యం.

పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న పిల్లలంటే లోకం పోకడ తెలియని వాళ్లనే అభిప్రాయం ఉండేది నిన్నామొన్నటిదాకా. ఇప్పుడది మరుగున పడిపోతోంది. దేశాన్ని కుదిపేసిన బాయిస్‌ లాకర్‌ రూం ఘటనతో విస్తుగొలిపే విషయాలెన్నో బయటికొచ్చాయి. ‘ఫలానా అమ్మాయిని ఎలా ట్రాప్‌ చేద్దాం?’ ‘తన శరీర కొలతలివీ’...ఈ మాటలన్నీ పందొమ్మిదేళ్ల లోపు పిల్లలు వాడారంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ ఇన్‌స్టాగ్రాం చర్చల్లో కుర్రాళ్లని అలా మాట్లాడేలా రెచ్చగొట్టడంలో ఒక అమ్మాయి పాత్ర కూడా ఉందని బయటికి రావడం మరో దురదృష్టకర విషయం. ఈ ఎపిసోడ్‌లో ఒత్తిడి తట్టుకోలేక పదిహేడేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం.
చిన్న వయసులోనే పిల్లలిలా పక్కదారి పట్టడానికి కారణమేంటని ఆరా తీస్తే అందరి వేళ్లూ ఎక్కువగా ఎత్తి చూపేది టెక్నాలజీ వైపే. ‘ఆధునిక టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌, కన్నవాళ్ల ఉరుకుల పరుగుల జీవితాలు పిల్లలు పక్కదారి పట్టడానికి ఓ కారణం. దిల్లీనే కాదు.. చిన్న పట్టణాలు, గ్రామాల్లోనూ ఇలాంటి వికృత సంస్కృతి పెరుగుతోంది’ అంటారు ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్‌నాథ్‌. 2004లో దిల్లీ విద్యార్థుల ఎంఎంఎస్‌ స్కాండల్‌ బయటికి వచ్చినప్పుడు దేశమంతా షాక్‌కి గురైంది. ఇప్పుడిలాంటి సంఘటనలు సాధారణమయ్యాయి. పిల్లల చేతుల్లోకి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు రావడం, టెక్నాలజీ విస్తృతి, విచ్చలవిడిగా పోర్న్‌ వెబ్‌సైట్లు అందుబాటులో ఉండటం.. వాళ్లు చెడిపోవడానికి కారణమంటారు మానసిక నిపుణులు. ఇలాంటి సంఘటనల్లో అబ్బాయిలు తమ పురుషాధిక్యత చూపించుకోవాలని భావిస్తుంటే, అబ్బాయిల్ని తమ వెనక తిప్పుకోవడం గొప్పగా భావించే అమ్మాయిలు పరోక్షంగా చెడ్డదారి పట్టేందుకు కారణమవుతున్నారు. ఇలాంటివారే భవిష్యత్తులో సంఘ విద్రోహులుగా మారే ప్రమాదం ఉందంటారు. ఆ పరిస్థితి రాకముందే మేల్కోవాలి. పిల్లల్ని దారిలో పెట్టాలి.  

కన్నవాళ్లే దారి చూపాలి
టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు? అని గమనించాలి. హింసాత్మక వీడియో గేమ్స్‌ ఆడితే వాళ్లలోనూ అదే వైఖరి ఏర్పడుతుంది. కాస్త పెద్దయ్యాక నీలి చిత్రాలు చూస్తారు. అసాంఘిక శక్తుల వైపు మొగ్గు చూపుతారు. అపరిపక్వమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు స్కూళ్లు, కాలేజీల్లోని అమ్మాయిలు, టీచర్లని వంకరబుద్ధితోనే చూస్తారు. ఇలాంటి కొందరి కారణంగా మంచి స్వభావం ఉన్నవాళ్లు సైతం చెడ్డదారి పడుతున్నారు. టీనేజీలోనే లవ్‌, రేప్‌, ట్రాప్‌, గ్రూప్‌సెక్స్‌.. లాంటి ఆమోదయోగ్యం కాని పదాలు విచ్చలవిడిగా వాడుతున్నారు. విద్యా సంస్థలు ఇది మా సమస్య కాదన్నట్టు భావిస్తుంటే.. తల్లిదండ్రులు కొందరు అమాయకత్వంతో, ఇంకొందరు అర్థమైనా ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. సమస్యను గుర్తించడంతోనే సగం పరిష్కారం దొరుకుతుంది. ఈ దుస్థితి తప్పాలంటే నైతిక విలువలు నేర్పడం సిలబస్‌లో భాగం చేయాలి. కొద్దిసార్లు పెద్దరికంతో మందలించినా కన్నవాళ్లు పిల్లలతో స్నేహితుల్లా మెలగాలి వాళ్లతో నాణ్యమైన సమయం గడపాలి. 

 

 

 

- వాసిరెడ్డి అమర్‌నాథ్‌, విద్యావేత్త


పసిగట్టాలిలా..

*ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
*పడకగదిలో, బాత్రూంలో దూరి తలుపులు బిగించుకుంటారు.
* హింస, రొమాన్స్‌ సినిమాలు ఎక్కువగా చూస్తారు.
* ఇంటికి ఆలస్యంగా వస్తారు. స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు.
* ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్‌కే అతుక్కుపోతారు.
* పుస్తకాల మధ్యలో పెట్టుకొని ఫోన్‌ చూడటం, దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్టు నటిస్తారు.
* అమ్మాయిలు, సమాజం గురించి చులకనగా మాట్లాడతారు.


అమ్మ పాత్రేంటి?

* మా అమ్మాయి, అబ్బాయి మంచివాళ్లు అనే అతి నమ్మకం వద్దు. చిన్నచిన్న తప్పులే కదాని వాళ్లను వెనకేసుకొని రావొద్దు. ఆ భరోసానే వాళ్లను పెద్ద తప్పులకు పురికొల్పుతుంది.
* పిల్లలముందు అసభ్యకరమైన మాటలు మాట్లాడొద్దు. ఎవరైనా ఆ పని చేసినా ఉపేక్షించవద్దు. పిల్లల ముందే వాళ్లను నిలదీయాలి.
* పిల్లల పెంపకంలో అమ్మాయి, అబ్బాయి తేడాలు చూపొద్దు. అమ్మాయిని కాపాడటం అబ్బాయి బాధ్యతని చెప్పాలి.
* విద్యార్థుల్లో సమూహ స్నేహాల (పీర్‌ ప్రెజర్‌ గ్రూప్స్‌) ప్రభావం ఎక్కువ. చెడు స్నేహాల వల్ల కలిగే నష్టాలేంటో స్పష్టంగా వివరించాలి.
* లైంగిక వేధింపులు, అత్యాచారం లాంటి వాటికి పాల్పడితే కుటుంబ పరువు పోతుంది. జైలు పాలవుతారు. చదువు ఆగిపోతుంది. ఇవన్నీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.
* కంప్యూటర్‌, ల్యాపీలాంటివి ఎవరి గదుల్లో వారు కాకుండా, అందరూ వాడుకునేలా హాలు లేదా ప్రత్యేక ప్రదేశంలో ఉంచాలి.
* ఫోన్‌, కంప్యూటర్‌లు వాడటానికి రోజులో ఒక ప్రత్యేక సమయం కేటాయించాలి. ఆ వేళల్లోనే వాడటానికి అనుమతించాలి.
* ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు పిల్లలకు ఇచ్చేముందు అందులో పోర్న్‌ సంబంధిత కంటెంట్‌ తెరుచుకోకుండా ‘లాక్‌’ వేయాలి.
* పిల్లల ముందు గొడవలు పడొద్దు. చెడు భాష ఉపయోగించవద్దు. వాళ్లను పట్టించుకోకుండా కంప్యూటర్లు, ఫోన్లలో మునిగిపోవద్దు.

 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని