అమ్మను అలా చూశాక... చదువు వద్దనుకున్నా!   
close
Published : 19/02/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మను అలా చూశాక... చదువు వద్దనుకున్నా!   

అర్ధరాత్రి తాగొచ్చి తండ్రి పెట్టే హింసను భరించలేక తల్లిపెట్టే గావుకేకలు సొనాలికి కొత్తకాదు!  కానీ ఒక రోజు సగం కాలిన తల్లి శరీరాన్ని చూసిన తర్వాతే.. బాగా చదువుకోవాలనే తన కోరికను  సంకల్పంగా మార్చుకుంది సోనాలీ రాథోడ్‌.. కూలీ కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు స్వర్ణపతకాలు అందుకున్న ఓ విజేత కథ ఇది...
సోనాలి పుట్టకముందే ఆమె కుటుంబం బతుకుదెెరువు కోసం మహారాష్ట్రకు తరలి వెళ్లింది. ఇంటి పట్ల ఏ మాత్రం ధ్యాస లేని తండ్రి. కూలీ పనిచేసి తల్లి తెచ్చే డబ్బుతోనే నడిచే ఇల్లు. ఇదీ సోనాలీ కుటుంబ నేపథ్యం. అలాంటి ఆర్థిక సమస్యల మధ్యనే చదువుల్లో రాణించింది. తాజాగా  బెంగళూరులోని రాజీవ్‌ గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు బంగారు పతకాలను అందుకుంది.
‘మాది కర్ణాటకలో విజయపుర జిల్లా. నేను పుట్టక ముందే అమ్మా, నాన్నలు పొట్టకూటికోసం మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న వెలె గ్రామానికి వలసవెళ్లారు. నాలుగువైపులా సర్దిన రేకుల షెడ్డే మా ఇల్లు. భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ అమ్మా, నాన్నలు రోజుకు రూ.600ల వరకూ సంపాదించేవారు. ఇందులో నాన్న డబ్బు ఇంటి వరకూ రావడం చాలా అరుదు. ఆ డబ్బుతో తాగేవాడు. ఆ తర్వాత అమ్మను చిత్రహింసలు పెట్టేవాడు. అర్ధరాత్రి వరకూ ఇదే పని. ఇన్ని బాధలున్నా అమ్మ మాత్రం నన్నూ, అన్నను బాగా చదివించాలనుకుంది. అందుకే ఏడాదికి ఇద్దరికీ కలిపి రూ.500లు ఇవ్వగలనని ఒప్పించి ఓ బడిలో చేర్చింది. అక్కడి మాస్టార్ల నమ్మకాన్ని నేను నిలబెట్టాను. పదిలో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించా. చదువు పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన రోటరీ క్లబ్‌ వాళ్లు నాకు ఏడాదికి రూ.1500ల స్కాలర్‌షిప్‌ ఇస్తూ 12వ తరగతిలో చేరేందుకు సహకరించారు. ఎప్పటికైనా డాక్టర్‌ కావాలని సైన్స్‌ సబ్జెక్టు తీసుకుని 12వ తరగతిలో చేరా. కానీ పుస్తకాలు కూడా కొనలేని దుస్థితి మాది. అందుకే ముంబయిలో అమ్మే పాత పుస్తకాలనే కొనుక్కుని చదివేదాన్ని’ అంటూ బాల్యం నుంచీ తనకెదురయిన పరిస్థితులని వివరించింది సోనాలి.

మేము పైచదువులకు వచ్చినా నాన్న తాగుడు మానలేదు. వాళ్లు రాత్రి 1 గంట వరకు గొడవ పడుతుంటే చదువు ఎక్కేది కాదు. అందుకే రాత్రి ఇంట్లో గొడవలన్నీ సద్దుమణిగాక 3గంటలకు లేచి చదువుకునే దాన్ని. ఓ సారి కాలేజీ నుంచి ఇంటికి వచ్చే సరికి అమ్మ సగం కాలిన శరీరంతో నేల మీద పడి బాధపడుతోంది. ఎలాగో కష్టపడి అమ్మను ఆస్పత్రిలో చేర్చా. ఆ రోజు చదువు మానేసి ఇంటిపట్టునే ఉండి అమ్మను చూసుకోవాలని అనుకున్నా. కానీ మా టీచరు చెప్పిన మాటలు విన్నాక... చదువు మాత్రమే ఈ కష్టాల నుంచి బయటపడేస్తుందని అర్థమైంది.

అప్పుతో చదువు...
‘ఎన్నోసార్లు నా బాక్సులో అన్నం మాత్రమే ఉండేది. అదీ లేని రోజు ఎండిపోయిన రోటీలు ఉండేవి. అమ్మ  కోలుకోవటంతో మళ్లీ చదువుపై దృష్టి సారించా. ఈ సారి ఇంటర్‌లో 95శాతం మార్కులతో కిసాన్‌వీర్‌ మహావిద్యాలయలో ఫస్ట్‌ వచ్చా. ఇంటర్‌ అయ్యాక ఏం చదవాలో అంతుపట్టలేదు. డాక్టర్‌ చదివే స్థోమత లేదు. అందుకే చదివిన సైన్స్‌ వృథా పోకూడదని మా టీచర్‌ సలహాతో మా సొంత ఊరు విజయపురలోని బీఎం పాటిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌ సైన్స్‌లో బీఎస్సీ నర్సింగ్‌లో చేరా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖర్చులకోసం రూ. 1.75లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. వడ్డీతో రెట్టింపయ్యింది’ అంటున్న సోనాలికి గత సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా చదువుకోవడానికి ఇబ్బంది ఎదురైనా ఆమె దాన్ని అధిగమించింది.  
ఫెయిల్‌ అవుతాననుకున్నా
గత సంవత్సరం అమ్మానాన్నలని చూడ్డానికని ఊరికి వెళ్లిన సోనాలికి లాక్‌డౌన్‌ వల్ల అనుకోని కష్టం ఎదురయ్యింది. ‘పుస్తకాలన్నీ హాస్టల్‌లోనే ఉండిపోయాయి. జులైలో పరీక్షలని ప్రకటించగానే భయం మొదలైంది. పుస్తకాలు లేకుండా చదువుకోవడం ఎలా? అప్పుడు యూట్యూబ్‌లో పాఠాలు చదువుకొని పరీక్షలకు హాజరయ్యా. భయంతో ఫలితాలు కూడా చూడలేదు. మా ప్రిన్సిపల్‌ ఫోను చేసి 80.77 అగ్రిగేట్‌ మార్కులతో యూనివర్శిటీ ఫస్ట్‌ వచ్చినట్లు చెప్పటంతో నమ్మలేకపోయా. యూనివర్శిటీ ర్యాంకులతో రెండు స్వర్ణ పతకాలు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నా. యూనివర్శిటీ ర్యాంకు రావటంతో నేను కట్టిన ఫీజులన్నీ కళాశాల యాజమాన్యం తిరిగి ఇచ్చింది. ఆ డబ్బుతోనే నేను చేసిన అప్పులన్నీ తీర్చా. డాక్టరు ఎలాగూ కాలేకపోయా. నర్సింగ్‌లో పీహెచ్‌డీ చేసి ఆ కోరిక నెరవేర్చుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం నేను నర్సింగ్‌ చేసిన కళాశాలలోనే టీచింగ్‌ చేస్తున్నా. ఆ వచ్చిన డబ్బులో కొంత అమ్మానాన్నలకు ఇచ్చి మిగిలింది పెద్ద చదువుల కోసం దాచిపెట్టుకుంటున్నా’ అంటోంది సోనాలి.

- కె.ముకుంద, బెంగళూరు


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని