ధీశాలిని దగ్గర్నుంచి చూశాను!
close
Published : 14/03/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధీశాలిని దగ్గర్నుంచి చూశాను!

‘మిళింద కథలు’ పుస్తకంతో ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు మానస ఎండ్లూరి. దళిత స్త్రీలు ఎదుర్కొనే వివక్షను తానూ ఎదుర్కొన్నానని, అందులోంచి పుట్టిందే ‘మిళింద’ కథా సంపుటి అని అంటారామె. దళిత క్రైస్తవ జీవిత పార్శ్వాలు, స్వలింగ సంపర్క బంధాల్లోని క్లిష్టమైన అంశాలు, స్త్రీ పురుషుల మధ్య ఉండే మానవ సంబంధాల్లో తలెత్తే సమస్యల మీద విరివిగా రచనలు చేస్తున్న ఆమె.. తెలుగు యువరచయిత్రుల్లో ఓ బలమైన గొంతుక.  

మాజంలో మార్పు తీసుకురావడానికి ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా కథలు రాస్తున్నా. లింగపరంగా మైనారిటీలైన మహిళలు, అలాగే కుల, మతపరమైన మైనారిటీల జీవితాలే నా కథలకు ఇతివృత్తాలు. మా అమ్మానాన్నలు పుట్ల హేమలత, ఎండ్లూరి సుధాకర్‌. వారిద్దరూ రచయితలే కావడంతో సహజంగానే సాహిత్యం మీద ఆసక్తి పెంచుకున్నా. ఆరేళ్ల కిందటి నుంచి రచనలు చేయడం ప్రారంభించా. రాజమహేంద్రవరం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంగ్లిష్‌ అధ్యాపకురాలిగా కొన్నాళ్లు పనిచేసి, ప్రస్తుతం పూర్తిగా రచనల మీదే దృష్టి పెట్టాను. ప్రస్తుతం మా అమ్మ ప్రారంభించిన తొలి మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ‘విహంగ’కు సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నా. నాకు అమ్మే స్ఫూర్తి. ఆవిడ బయటి వాళ్లకి ఓ రచయిత్రిగా మాత్రమే తెలుసు. కానీ సాధికారత ఉన్న స్త్రీగా, ధీశాలిగా తనను దగ్గర్నుంచి చూశాను. మహిళలందరూ ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలని చెబుతారామె.  
అనుభవాల నుంచే...
నగరాల్లోనూ వివిధ రూపాల్లో వివక్ష ఉంది. దాన్ని ఎదుర్కొంటూనే ముందడుగు వేస్తున్నాను. చుట్టూ సమాజంలో చూసిన సంఘటనలు, ఎదుర్కొన్న అనుభవాల నుంచే నా కథలు ప్రాణం పోసుకుంటున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో నా బాధ్యత మరింత పెరిగింది. తెలుగునాట రచయిత్రుల సంఖ్యను పెంచడమే నా లక్ష్యంగా పెట్టుకున్నా. సాధారణంగా స్త్రీల గురించి పురుషులే రాస్తారు. అలా కాకుండా స్త్రీల గురించి స్త్రీలే రాసుకోవాలి. అప్పుడే మనకేం కావాలో, ఎలా జీవించాలో తెలుస్తుంది. ఈ మధ్యే ‘ఊరికి దక్షిణాన’ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి అనువదించా. తొలి భారతీయ దళిత ఆత్మకథ ‘బలూతా’ను త్వరలో తెలుగులోకి తీసుకురాబోతున్నాను.

- శాంతి జలసూత్రం


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని