హద్దు మీరకుండా ఆపేస్తుంది!
close
Published : 10/06/2021 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హద్దు మీరకుండా ఆపేస్తుంది!

ఇష్టమైన ఫొటో, అభిప్రాయం.. దేన్నైనా సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటాం. వాటి మీద ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయం వెలిబుచ్చుతారు. ఇదంతా మామూలే! కానీ అది హద్దు మీరుతోంది. ఆ మీరడం ఒక్కోసారి డిప్రెషన్‌కే కాదు, చావు వరకూ తీసుకెళ్తోంది. సైబర్‌ బుల్లీయింగ్‌.. కాలేజ్‌ పిల్లల నుంచి సినీతారలు, రాజకీయ నాయకులు.. అందరూ దీని బారిన  పడుతున్నవారే. దీన్నెలా ఆపాలి అన్న ప్రశ్న వేసుకుంది త్రిషా ప్రభు. దానికి కనిపెట్టిన సమాధానం ఆమెను ఫోర్బ్స్‌ జాబితాలో నిలబెట్టింది!
త్రిషా ప్రభుది యూఎస్‌లో స్థిరపడిన భారతీయ కుటుంబం. తను నివసించే చోట భారతీయులు వీరొక్కరే. ఆహారం, దుస్తులు, జుట్టు, పాటించే విధానాలు మిగతా వారికన్నా భిన్నంగా ఉండేవి. దీంతో తోటి ¨పిల్లలు తనను ఏడిపించేవారు. ఒకరోజు ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల రెబెకా గురించి చదివింది. ‘సైబర్‌ బుల్లీయింగ్‌ను తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇది చూశాక ఏదో భయంకరమైన తప్పు జరుగుతోంది అనిపించింది’ అంటుంది త్రిష. ఇంటర్నెట్‌ వేదికగా కూడా ఇలా జరుగుతుండటం ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. దాని మీద చాలా మదన పడింది. ఈ ఆలోచనలే ఆవిష్కరణ దిశగా తనను నడిపించాయంటుంది త్రిష.
పరిష్కారమిలా!
8వ తరగతిలో సైన్స్‌ఫేర్‌ కోసం త్రిష ఒక సైంటిఫిక్‌ స్టడీని నిర్వహించింది. దాని ప్రకారం.. సైబర్‌ వేదికగా మాట తూలే వాళ్లలో చాలా మందికి తాము ఇతరులను బాధపెడుతున్నట్లుగా తెలియట్లేదని అని తెలుసుకుంది. ఒకసారి వారికి గుర్తుచేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందనుకుంది. అలా తట్టిన ఆలోచనే.. ‘రీ థింక్‌’. తెలిసిన వారు, టీచర్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, యంగ్‌ ఆంత్రప్రెన్యూర్లను కలిసి వాళ్ల అనుభవాలను తెలుసుకుంది. వాటికి తన కోడింగ్‌ పరిజ్ఞానాన్ని జోడించి ‘రీ థింక్‌’కు రూపమిచ్చింది. దీని పేరిట సంస్థనూ ప్రారంభించింది. దానికి ఈ అమ్మాయే సీఈఓ. రీ థింక్‌ ఓ యాప్‌. ఫోన్లో ఉన్న కీబోర్డ్‌లో స్థానంలోకి యాప్‌ ద్వారా కీబోర్డ్‌ వచ్చి చేరుతుంది. ఇది యాప్‌లు, ఈమెయిల్‌, మెసేజ్‌లు, సోషల్‌ మీడియా అకౌంట్లు అన్నింటికీ పనిచేస్తుంది. ప్రతికూల, అసభ్య పదజాలాన్ని టైప్‌ చేస్తే, పంపే ముందు యాప్‌ ఆ వ్యక్తికి నిజంగానే పంపాలని అనుకుంటున్నారా? అని గుర్తు చేస్తుంది.
అవరోధాలొచ్చినా..
కానీ ఇదంతా చెప్పినంత సులువేమీ కాలేదామెకు. చిన్నపిల్ల అని ఎవరూ తన మాటల్ని సీరియస్‌గా తీసుకునేవారు కాదు. పైగా నిరుత్సాహపరిచే వారు. ‘మార్పు తీసుకురావడానికి కష్టపడాల్సి రావడం మామూలే అనిపించేది. నేను చేయగలననే నమ్మకం ఉంది. కాబట్టి, ఇవేమీ నిరాశపరచకపోగా... కొత్త ఉత్తేజాన్ని కల్పించేవి’ అంటుందీమె. ఈ తీరే యాప్‌ డెవలప్‌మెంట్‌కి సంస్థలు ముందుకొచ్చేలా చేసింది.
సానుకూల స్పందన
యాప్‌స్టోర్‌లో ఉంచిన కొన్నివారాల్లోనే 5లక్షల డౌన్‌లోడ్లు వచ్చాయి. 93%మంది పోస్టు చేసే ముందు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు చెప్పారు. సంతోషించదగ్గ విషయమేంటంటే టైప్‌ చేసేముందే ఆలోచించడం మొదలు పెట్టారు. ‘ఈ డిజిటల్‌, కృత్రిమ ప్రపంచంలో స్క్రీన్‌కి అవతల కూడా మీలా, నాలా ఉంటారు. వాళ్లంతా చెడ్డవాళ్లేమీ కాదు. వాళ్లకీ భావోద్వేగాలుంటాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఆలోచించి మాట్లాడటం అలవాటవుతుంది’ అంటుంది.
ప్రస్తుతం ఈ యాప్‌ ఆరు భాషల్లో ఉంది. అన్నట్టూ ఈ అమ్మాయి ఇంకా విద్యార్థే. ఈమె హార్వర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. తాజాగా ఈ ఏడాదికిగానూ సమాజంపై ప్రభావం చూపుతున్న 30 ఏళ్లలోపు వారి జాబితాలో ఫోర్బ్స్‌ ఈమెనీ చేర్చింది. ఈ అమ్మాయి వయసు ఇప్పుడు 21. చదువు, సంస్థ విషయాలతోపాటు 9-12 ఏళ్ల వారికోసం ఒక పుస్తకాన్నీ రాస్తోంది. ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఒక మంచి వ్యక్తిగా ఉండటమెలాగో అది చెబుతుందట. ఇది వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని