చేనేతకు అద్దిన ఆధునికత
close
Updated : 28/06/2021 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేనేతకు అద్దిన ఆధునికత

నేత చీరలపై మక్కువ చూపే మహిళలెందరో. కొన్నిసార్లు తీసుకుని మోసపోయే వారు కొందరైతే, ధర ఎక్కువని వెనక్కి తగ్గేవారు మరికొందరు. ఈ అనుభవం రీతూ ఒబెరాయ్‌కూ అయ్యింది. అందుకు ఆమెకు తోచిన ఉపాయం పది రాష్ట్రాల్లో వందల నేత పని వారికి ఆదాయం తెచ్చిపెడుతోంది. అందుకు తను ఏం చేస్తోందో చదవండి.

రీతూ ఒబెరాయ్‌ 15 ఏళ్లపాటు మీడియా- అడ్వర్టైజింగ్‌ రంగంలో మార్కెటింగ్‌ విభాగంలో పనిచేసింది. కొంత విరామం తీసుకుని, ముంబయి వదిలి దేశమంతా చుట్టి రావాలనుకుంది. అలా ప్రయాణిస్తున్న క్రమంలో నేత పనివారి నైపుణ్యాలను చూసింది. హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్లలో దొరికే వాటికీ వీటికీ ఎంత వ్యత్యాసముందో అర్థమైంది. ‘మామూలుగానే చీరలంటే నాకు ప్రాణం. నాణ్యమైన నేత చీరలు దొరకడం ఎంత కష్టమో నాకూ అనుభవమే. ఖర్చు పెట్టినా ఒక్కోసారి నిరాశ తప్పదు. వీళ్ల పనితీరు చూశాక వాస్తవం తెలిసొచ్చింది’ అంటుంది రీతూ. తన మార్కెటింగ్‌ నైపుణ్యాలతో వీటికి ఒక వేదిక కల్పించాలనుకుంది. ఉద్యోగానికి స్వస్తి పలికి 2018లో ముంబయిలో ‘ఫర్‌ శారీస్‌’ను ప్రారంభించింది.

దీన్ని గ్రామీణ నేతకారులతో నేరుగా పనిచేసే సామాజిక వ్యాపార సంస్థగా నిలపాలన్నది ఆమె ఉద్దేశం. తద్వారా వారి నైపుణ్యాన్ని పట్టణాలు, నగరాల వారికి దగ్గర చేయాలనుకుంది. దీనిలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ‘దీని ద్వారా ఈ రంగం ఎదుర్కొంటున్న రెండు సమస్యలను పరిష్కరించవచ్చు. ఒకటి గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి, రెండోది మహిళా సాధికారత’ అంటోంది రీతూ.

సులువేమీ కాలేదు...  నిర్ణయం, ఆశయం రెండూ బానే ఉన్నాయి. రీతూదేమో మార్కెటింగ్‌ నేపథ్యం. అన్నేళ్ల అనుభవం స్టార్టప్‌ను ఏర్పాటు చేయడానికి పనికొస్తుంది. కానీ చీరలంటే ఫ్యాషన్‌పై అవగాహన ఉండాలి. రెండూ భిన్న ధ్రువాలు. పైగా ఆమెకు 41 ఏళ్లు. కొత్తగా నేర్చుకోవడం సాధ్యమేనా అనుకుంది. కానీ తపనే తనను నడిపించిందని చెబుతోంది. చేనేత ఫ్యాషన్‌ ధోరణులపై ఎంతో పరిశోధించింది. ఆపై ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరి లక్ష్యం.. నేతకారులకు స్థిర ఆదాయాన్ని కల్పించడం.

అప్‌స్కిల్లింగ్‌.. అదనపు నైపుణ్యాలను జోడించడం కార్పొరేట్‌ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఈ విధానం. దాన్నే ఇక్కడా ఆచరించింది. మార్కెట్‌, ఫ్యాషన్‌ ధోరణులకు అనుగుణంగా నేత వారికి శిక్షణనిప్పించేది. దాంతో వారు చీరలపై కొత్త డిజైన్లను రూపొందించే వారు. పశ్చిమ్‌ బంగ చుట్టుపక్కల గ్రామాల మహిళలు ‘కాంత చీరల’ను నేస్తారు. శాంతినికేతన్‌ ప్రాజెక్టు పేరిట వీరికి శిక్షణనిచ్చి మెట్రో వర్కింగ్‌ విమెన్‌కు నప్పే కాటన్‌ చీరలను డిజైన్‌ చేయించేది. సహజ రంగులనే ప్రోత్సహించేది. ఫలితం.. నాణ్యత, నేరుగా నేతవారి నుంచే పొందుతుండటంతో ఎంతోమంది వీటిపై ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. సినీ తారలూ వీటిని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు తను 10 రాష్ట్రాల నుంచి నేరుగా 250 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. కచ్‌, చందేరీ, శాంతినికేతన్‌, పోచంపల్లి, అజ్రక్‌పుర్‌, సంబల్‌పుర్‌, రాజస్థాన్‌లోని చౌబందీ, బర్‌ద్వాన్‌ ఇంకా ఎన్నో గ్రామాల వాళ్లు రీతూతో కలిసి పని చేస్తున్నారు.

ఆ సమయంలో.. లాక్‌డౌన్‌లో అమ్మకాలు పడిపోయాయి. దీంతో నేతవారిని హస్త కళలపై దృష్టిపెట్టేలా ప్రోత్సహించింది. వారు అలంకరణ సామగ్రిని చేయడం మొదలుపెట్టారు. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతోంది. ఈ క్లిష్ట సమయంలో వారికి ఆదాయం తగ్గకూడదనేదే ఆమె ఉద్దేశం. ‘ఒక చీర నేయడానికి కనీసం వారం పడుతుంది. బుటీలు, డై వంటి వాటిని బట్టి ఇంకాస్త సమయం పడుతుంది. శ్రమబట్టి ధర ఉంటుంది. అన్ని స్థాయుల వారినీ దృష్టిలో ఉంచుకుని ధరలను నిర్ణయిస్తాం. కళ, నైపుణ్యం ఉన్న వారికి వారి శ్రమకు తగ్గ ఆదాయం కల్పించడంతోపాటు దేశ సంప్రదాయ కళలకు ప్రాచుర్యం కల్పించాలన్న నా కోరిక ఇలా నెరవేరుతుండటం చాలా ఆనందంగా ఉంది’ అంటోంది రీతూ.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని