పది నిమిషాలు నడవడానికి పదేళ్లు పట్టింది!
close
Updated : 30/06/2021 05:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పది నిమిషాలు నడవడానికి పదేళ్లు పట్టింది!

కోటి కలలతో చదివిన చదువుకు ఫలితంగా మంచి కార్పొరేట్‌ ఉద్యోగం వచ్చింది. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో మెడ కింద నుంచి స్పర్శను కోల్పోయి చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. తినడం, రాయడం నుంచి అన్నీ పసిపిల్లలా మళ్లీ నేర్చుకుంది. అడుగులు వేయడానికి పదేళ్లు పట్టింది. అయినా తను నిరుత్సాహపడలేదు. సంకల్ప బలానికి అసాధ్యమేదీ లేదని నిరూపించిన హైదరాబాద్‌కు చెందిన సింధూరిని వసుంధర పలకరించింది...

జులై 18, 2011, రాత్రి పదిన్నర. ఆఫీసు నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళుతున్నా. ఇంతలో పెద్ద శబ్దం. మా క్యాబ్‌ డివైడర్‌ను ఢీ కొంది. నేను సీట్లోకి కూరుకుపోయా. మెడ దగ్గర తీవ్రమైన నొప్పి... ఆ తర్వాత స్పృహ కోల్పోయా. నా సహోద్యోగి పిలుస్తుంటే మెలకువ వచ్చింది. అప్పటికే మెడ కింద నుంచి శరీరమంతా స్పర్శ కోల్పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో స్పైనల్‌ కార్డ్‌ విరిగిపోయిందని తెలిసింది. శస్త్రచికిత్స జరిగి, పదిరోజులకు డిశ్చార్జి అయ్యా. అంతా తలకిందులు అయిపోయింది... నా పరిస్థితి ఏంటా అనే ఆలోచనలు మొదలయ్యాయి.

కదలిక లేదు.. నాన్న వెంకటాచలం వ్యాపారి. అమ్మ అన్నపూర్ణ గృహిణి. తమ్ముడున్నాడు. ఉమ్మడి కుటుంబం మాది. ఏడెనిమిది నెలలు మంచంలోనే ఉన్నా. అన్నయ్యలు, తమ్ముళ్లు, కజిన్స్‌ ఉండేవారు. ఒంటరితనం తెలిసేది కాదు. శస్త్రచికిత్స తర్వాత శరీరానికి స్పర్శ తిరిగొచ్చింది. అయితే మెడ కింద నుంచి కదలిక మాత్రం లేదు. ఆ స్థితిలో నేను క్షణం కూడా కుంగుబాటుకు గురికాకుండా మా వాళ్లంతా తోడుగా నిలిచారు. ఆ తర్వాత ఓ పునరావాస కేంద్రంలో ఆరు నెలలున్నా. అక్కడి నుంచి వచ్చాక ఫిజియోథరపీ మొదలుపెట్టా. కొందరు వైద్యులు నేను మామూలు స్థితికి రావొచ్చంటే, మరికొందరు కష్టమనేవారు. 

పెన్ను పట్టుకోలేకపోయా..  చేతివేళ్లు పని చేసేవి కావు. రాయడానికి ప్రయత్నిస్తే పిచ్చిగీతలు వచ్చేవి. స్పూన్‌తో తినలేక పోయేదాన్ని. అప్పుడు నా ఛాలెంజ్‌... చేతివేళ్లను ఉపయోగించడం. దాని కోసం రోజూ ఫిజియోథెరపీ చేసేదాన్ని. కండరాల్లో బలం లేక భరించలేని నొప్పి అనిపించేది. అయినా ప్రయత్నించే దాన్ని. పెన్ను జారి పోయే కొద్దీ నాలో పట్టుదల పెరిగేది. ఒకటి, పది, ఇరవై సార్లు రాకపోయినా వదల్లేదు. అలా ఏడాదికి నా పేరును రాసుకోగలిగా. తినడం నేర్చుకున్నా.

సమయం వృథా.... తెలిసిన వాళ్లు ఏవో వైద్యాలు చెప్పేవారు. వాటన్నింటినీ అమ్మ పాటించేది. కానీ ఫలితముండేది కాదు. గతేడాది ఓ ఫిజియోథెరపీ క్లినిక్‌ గురించి తెలిసి, అక్కడ చేరా. రోజుకు రెండు సార్లు వ్యాయామాలు చేయిస్తారు. ఇంటికి దూరంగా ఉండటంతో, అక్కడికి దగ్గర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నా. అమ్మ నిత్యం నా నీడలా ఉంది. గతేడాది నుంచి ఓ హెల్పర్‌ సహాయంతో ఒక్కదాన్నే ఉండగలుగుతున్నా. వీల్‌చెయిర్‌లో ఉంటూనే నా పనులన్నీ నేను చేసుకోవడం నేర్చుకున్నా.

పియానో వాయించి... ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తుంటా. యూట్యూబ్‌లో చూసి పియానో నేర్చుకున్నా. ఏడాదిలోపే నేను వాయించిన పాటలను సోషల్‌ మీడియాలో పొందుపరచడం ప్రారంభించా. వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో సామర్థ్యాన్ని ప్రదర్శించే వారికిచ్చే ‘ఐకాన్‌-2020’ అవార్డుకు ఓ సంస్థ నన్ను ఎంపిక చేసింది. గతేడాది ‘కళారత్న’ అవార్డునూ అందుకున్నా. సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ చేసిన ఓ పాటను నేను పియానోపై వాయిస్తే, దానికి ఆయన అభినందించడం ఉత్సాహాన్నిచ్చింది. ఆ మధ్య సెల్ఫీ ఫొటో కాంటెస్ట్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్నా. అందాల పోటీల్లోనూ రన్నరప్‌గా నిలిచా. ఈ కళలన్నీ నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి ఉపయోగపడ్డాయి.

పదేళ్లకు నడక... ఇప్పుడు వాకర్‌ సహాయంతో పది నిమిషాలు అడుగులేయగలుగుతున్నా. అది లేకుండా కొన్ని నిమిషాలు నిలబడగలుగుతున్నా. నాకు నేనుగా నడవాలనే సంకల్పం నెరవేరుతోంది. ఇది జరగడానికి పదేళ్లు పట్టింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిన్నరలోనే నాకిలా అయింది. త్వరలో తిరిగి నా పాత ఉద్యోగంలో చేరనున్నా. వెన్నెముక విరిగిపోతే జీవితమంతా వీల్‌చెయిర్‌లోనే అనేవారు చాలామంది. నేను దాన్ని ఛేదించా. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే చాలు. అనుకున్నది సాధించగలం. దీనికి నేనే నిదర్శనం.

- టి. నరేందర్‌, హైదరాబాద్‌

మంచిమాట

మహిళలకు నేను చెప్పేది ఒకటే.. సమర్థంగా పనిచేయండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ జీవితం మీద వేరెవరికో ఆధిపత్యం ఇవ్వకండి.

- ఎస్టీ లాడర్‌, వ్యాపారవేత్త


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని