అంతరిక్షంలో తెలుగమ్మాయి తొలి అడుగు!
close
Updated : 06/07/2021 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతరిక్షంలో తెలుగమ్మాయి తొలి అడుగు!

చిన్నప్పుడు నక్షత్రాల్నీ, చంద్రుణ్నీ చూసి వాటిని అందుకోవాలనుకుంది. అందుకోసం వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌) అవ్వాలనుకుంది. ‘దృష్టి’ సమస్యతో తన లక్ష్యానికి దూరమవుతానేమో అనుకుంది. అయినా పట్టువీడలేదు.మరో మార్గంలో ప్రయత్నించింది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ తాజాగా అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. ఆమే శిరీష బండ్ల. ఆకాశపు అంచులు దాటబోతోన్న తన ప్రయాణం సాగిందిలా!

శిరీష బండ్ల స్వస్థలం.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు. తండ్రి బండ్ల మురళీధర్‌, తల్లి అనురాధ ఇద్దరూ యూఎస్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. అక్క ప్రత్యూష వర్జీనియా యూనివర్సిటీలో సైంటిస్ట్‌. శిరీషకు ఆరేళ్లున్నప్పుడు వీళ్ల కుటుంబం టెక్సాస్‌లోని హోస్టన్‌కి మారిపోయింది. వాళ్లకి దగ్గర్లో ఓ స్పేస్‌ సెంటర్‌ ఉండేది. ఓసారి అక్కడికి వెళ్లినపుడు అది ఆమెను బాగా ఆకట్టుకుంది. అప్పట్నుంచి తరచూ వెళ్లేది. అల్లంత దూరానున్న నక్షత్రాల్నీ, చంద్రుడినీ అందుకునేందుకు ఆస్ట్రోనాట్‌ అవ్వాలనుకుంది. ఎయిర్‌ఫోర్స్‌ కోర్సులు చదివి, పైలట్‌ అయితే తర్వాత నాసాలో అవకాశం పొందొచ్చన్నది ఆమె ప్లాన్‌. కానీ తనకు హైస్కూలు స్థాయిలో కంటి సమస్య వచ్చింది. పైలట్‌ లేదా ఆస్ట్రోనాట్‌ అవ్వడానికి కావాల్సిన కనీస అర్హత మంచి కంటి చూపు. దీంతో తను నిరుత్సాహపడింది.

ఇంటర్‌ సమయంలో ఒక ప్రైవేటు స్పేస్‌ టూరిజం సంస్థ గురించి తెలుసుకుంది. నాసా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో అవకాశాలున్నాయని అప్పుడే అర్థమైందామెకు. మళ్లీ తన కలపై దృష్టిపెట్టింది. ఈసారి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌పై దృష్టిపెట్టింది. దాని ద్వారా కమర్షియల్‌ స్పేస్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నది ఆమె లక్ష్యం.
శిరీషకు నేర్చుకోవడంపై ఆసక్తి ఎక్కువ. తరగతిలో కంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ తెలుసుకోవచ్చని నమ్ముతుంది. అందుకే ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది మినహా మిగిలిన మూడేళ్లూ చదువుతూనే ఓ ఇంజినీరింగ్‌ సంస్థలో ఇంటర్న్‌గానూ పనిచేసింది. నైపుణ్యాలను నేరుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంది. ఇంజినీరింగ్‌ సమయంలోనే ‘జీరో గ్రావిటీ’లో ప్రయాణించే అవకాశమూ దక్కించుకుంది. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందగానే ఉద్యోగంలో చేరిపోయింది. అప్పుడే తనకు సాంకేతికాంశాలు తప్ప వ్యాపార అంశాల్లో పరిజ్ఞానం లేదని అర్థమైంది. దీంతో జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీ నుంచి స్పేస్‌ ఇండస్ట్రీలో ఎంబీఏ చేసింది. తన ఆసక్తి తెలిసిన ప్రొఫెసర్‌ కమర్షియల్‌ స్పేస్‌ ఫెడరేషన్‌ (సీఎస్‌ఎఫ్‌) అనే సంస్థ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అక్కడ ఇంటర్వ్యూకు హాజరై ఎంపికైంది. అలా 2012లో తన కలల రంగంలోకి కాలూనింది.

ఇక్కడే తనకు మాథ్యూ ఇసాకోయిజ్‌ ఫెలోషిప్‌ అవకాశమూ వచ్చింది. ఇక్కడ స్పేస్‌ పాలసీల గురించి నేర్చుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్స్‌ డిజైనింగ్‌తోపాటు కమర్షియల్‌ స్పేస్‌ ఇండస్ట్రీ పాలసీలపైనా పని చేసింది. 2015లో వర్జిన్‌ గాలక్టిక్‌కి మారిపోయింది. ఇదీ స్పేస్‌ టూరిజం సంస్థే. దీనిలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నమెంట్‌ అఫైర్స్‌ మేనేజర్‌గా చేరి, వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ లాంచర్‌వన్‌, స్పేస్‌షిప్‌2 ప్రోగ్రామ్‌లు విజయం సాధించడంలోనూ శిరీష ప్రధాన పాత్ర పోషించింది. తాజాగా ఈ సంస్థ ఈ నెల 11న ఒక టెస్ట్‌ స్పేస్‌ ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టనుంది. దీనిలో సంస్థ వ్యవస్థాపకుడు బ్రాన్‌సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించ నున్నారు. వాళ్లలో 30 ఏళ్ల శిరీష ఒకరు.

 

శిరీష..

ఈ రంగంపై యువతకు అవగాహన కల్పించడమే కాకుండా వారిని ప్రోత్సహిస్తోంది కూడా. మేథ్స్‌పై ఆసక్తి లేని వారికీ ఎన్ని మార్గాలున్నాయో తెలియచెప్పడం కోసం స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూంటుంది.
తన కలను నెరవేర్చుకోవడంలో అమ్మానాన్నలతోపాటు టీచర్లదీ ప్రధాన పాత్రేనంటోంది తను. ‘నువ్వేదైనా చేయగలవు’ అని వారిచ్చిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయిలో నిలిపిందంటుంది. చేయాలన్న బలమైన తపన ఉంటే దేన్నైనా సాధించడం సాధ్యమేననే శిరీష.. అమెరికన్‌ ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ, ఫ్యూచర్‌ స్పేస్‌ లీడర్స్‌ ఫౌండేషన్లకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ కూడా. పర్‌డ్యూ యూనివర్సిటీ యంగ్‌ ప్రొఫెషనల్‌ అడ్వయిజరీ కౌన్సెల్‌కు మెంబర్‌.
డాక్యుమెంటరీలు తీయడమంటే సరదా పడే శిరీషకి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. ఖాళీ సమయాల్లో మారథాన్‌ల్లోనూ పాల్గొంటుంది. మాంసాహారాన్ని ఇష్టపడే ఈమె ఎంత నచ్చిన వంటకమైనా పరిమితంగానే తీసుకుంటుంది. ఎవరితోనైనా త్వరగా కలిసిపోవడం ఈమె నైజం. పెరిగింది అమెరికాలోనేనైనా తెలుగు చక్కగా మాట్లాడుతుంది. వీలున్నప్పుడల్లా మన దేశానికి వస్తుంటుంది. గత ఏడాది తనకు కాబోయే భర్తనూ తీసుకొచ్చింది. త్వరలో పెళ్లిపీటలూ ఎక్కనుంది!మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని