డిటర్జెంట్‌ను ఇలానూ వాడొచ్చు!
close
Published : 19/02/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిటర్జెంట్‌ను ఇలానూ వాడొచ్చు!

బట్టలను ఉతకడానికి డిటర్జెంట్‌ను వాడటం మన అందరికీ తెలిసిందే. అయితే దీన్ని కేవలం  దుస్తులను శుభ్రం చేయడానికే కాకుండా అవసరమైనప్పుడు రకరకాలుగానూ వాడొచ్చు. ఏమిటా సందర్భాలు.. ఎలా వాడాలో... తెలుసుకుందామా..
హ్యాండ్‌ వాష్‌లా... ఒక్కోసారి హ్యాండ్‌ వాష్‌ పూర్తిగా అయిపోయే వరకు మనం గమనించుకోం. మరి చివరి నిమిషంలో చూసుకుంటే ఎలా... ఈ చిట్కా పాటించి చూడండి. ఖాళీ స్ప్రే సీసాలో సమాన పరిమాణాల్లో గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌, నీళ్లు పోసి బాగా కలపండి. అంతే క్షణాల్లో హ్యాండ్‌ వాష్‌ రెడీ. దీన్ని తాత్కలింగా వాడుకోవచ్చు.
మురికి పోయేలా... సైకిల్‌, బైక్‌, కారు...వీటిని శుభ్రం చేసే సమయంలో చేతులకు గ్రీజు, నూనె మరకలు అంటుకోవడం సాధారణమే. మరి వీటిని తొలగించు కోవాలంటే... చెంచా చొప్పున డిటర్జెంట్‌, వంట నూనెలను తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి బాగా రుద్దాలి. ఇలా చేస్తే జిడ్డు వదిలిపోతుంది. అయితే చేతులను శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మరవొద్దు.
ఆల్‌ పర్పస్‌ క్లీనర్‌గా... లీటరు నీటిలో రెండు చెంచాల డిటర్జెంట్‌ వేసి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి జిడ్డుగా ఉండే ప్రదేశాలను శుభ్రం చేయడానికి చక్కగా వాడుకోవచ్చు. పరిమళాలను వెదజల్లే డిటర్జెంట్‌ను ఎంచుకుంటే మీరు వాడిన చోట్లలో చక్కటి సువాసనలు వ్యాపిస్తాయి.
ఫ్లోర్‌ను శుభ్రం చేయడానికి... అర బకెట్‌ గోరువెచ్చటి నీటిలో అర కప్పు డిటర్జెంట్‌ వేసి వంటగదిలో ఫ్లోర్‌ తుడిచి చూడండి అద్దంలా మెరిసిపోతుంది.
సింక్‌ మూసుకుపోతే... మురికి, వ్యర్థాలతో మూసుకుపోయిన సింక్‌లు, ఇతర డ్రెయిన్‌లను శుభ్రం చేయడానికి డిటర్జెంట్‌ చక్కగా ఉపయోగపడుతుంది. మూసుకుపోయిన సింకులో అర కప్పు డిటర్జెంట్‌ వేయాలి. కాసేపాగి వేడి నీళ్లు పోస్తే.. అడ్డుగా ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి. అయితే ఎక్కువ వేడి నీటిని ఉపయోగించకూడదు. ఇలా చేస్తే నీళ్లు వెళ్లే గొట్టాలు పాడయ్యే ప్రమాదం ఉంది.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని