2000 మంది జీవితాల్లో  వెలుగుల పోగులు నేస్తోంది!
close
Published : 08/06/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2000 మంది జీవితాల్లో  వెలుగుల పోగులు నేస్తోంది!

సౌకర్యంగా ఉందని ఎడాపెడా వాడే ప్లాస్టిక్‌... పర్యావరణానికి గుదిబండగా మారుతోంది. దీన్ని పునర్వినియోగించినప్పుడే ప్రకృతిని కాపాడగలుగుతాం! అలాంటి ఆలోచనతో ఓ సాధారణ అస్సామీ మహిళ 40 గ్రామాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు పునాదులు వేసింది. ఆమె కథే ఇది.

‘ఆలోచించే శక్తి, చేయాలన్న పట్టుదల ఉంటే చాలు... ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు’ అంటోంది అసోంకి చెందిన రూప్‌జ్యోతి గొగోయ్‌. ఆ రాష్ట్రంలో చిన్నప్పటి నుంచే మహిళలకు నేతపని అలవాటవుతుంది. ప్రతి ఇంట్లోనూ ఓ మగ్గం ఉంటుంది. అలాంటి చోట్ల సంప్రదాయ వీవింగ్‌కి భిన్నంగా.... ప్లాస్టిక్‌ వ్యర్థాలతో దారపు పోగులు తీసి, వాటిని వస్త్రంలో కలిపి నేయిస్తూ అందరినీ ఆకట్టుకుంటోందామె.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతి పెద్ద పర్యావరణ సమస్య ప్లాస్టిక్‌. అది హిమాలయాల నుంచి పల్లెటూరి చెరువుల వరకూ విస్తరించింది. అదే కజిరంగా ప్రాంతానికి చెందిన రూప్‌జ్యోతిని ఆవేదనకు గురిచేసింది. ఖడ్గమృగాలకు పేరుగాంచిన ఆ పార్కు చుట్టుపక్కల పర్యాటకులు వదిలేసే ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు, ఫుడ్‌ రేపర్ల వంటి వ్యర్థాలతో చెత్త నిర్వహణ పెద్ద ఇబ్బందిగా మారిపోతోంది. అందుకో వినూత్న పరిష్కారాన్ని కనుగొనాలని భావించింది. అప్పటికే ఆమె విలేజ్‌ వీవ్‌ పేరుతో పది మంది మహిళలకు ఉపాధి కల్పించేది. ఏళ్లుగా పేరుకుపోయిన ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు కొందరు స్థానిక మహిళలతో కలిసి పారేసిన ప్లాస్టిక్‌ సంచులను సేకరించింది. వాటిని శుభ్రపరిచి, కత్తిరించి దారాలుగా వడకడం మొదలుపెట్టింది. వెదురు, అరటి వంటి వాటితో దారపు పోగులు చేయగలిగినప్పుడు దీన్నుంచి ఎందుకు సాధ్యం కాదన్న ఆలోచనతోనే ఈ పనికి పూనుకుంది. వాటిని పత్తిదారాలతో కలిపి దుస్తులు నేసింది. హ్యాండ్‌ బ్యాగులు, డోర్‌ మ్యాట్‌లు, కర్టెన్లు, టేబుల్‌ మ్యాట్‌లు... ఇలా ఒకటేమిటి రకరకాల ఇంటి అలంకరణ వస్తువులు తయారీ చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేసింది. మొదట ఇవన్నీ సొంతంగానే చేసింది. తర్వాత ముంబయికి చెందిన కార్బెట్‌ ఫౌండేషన్‌ సాయంతో స్థానిక మహిళలకు నేర్పేందుకు చేయూతనిచ్చింది.ఈ వస్తువులను పర్యాటకులకు విక్రయిస్తారు. వీటికి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. దాంతో 2012లో రూప్‌జ్యోతి కజిరంగ హ్యాట్‌ పేరుతో ప్రత్యేకంగా ఓ దుకాణాన్నీ ఏర్పాటు చేసింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళలంతా వీటిని తమ ఇళ్ల దగ్గరే తయారుచేస్తారు. కొందరు సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని అమ్మితే... ఇంకొందరు జ్యోతి ఏర్పాటు చేసిన షాప్‌కు అందిస్తారు. ప్రస్తుతం కజిరంగ చుట్టుపక్కల నలభై గ్రామాల్లోని రెండువేల మంది మహిళలు ఈ పని చేస్తున్నారు. వీరంతా నెలకు పదిహేను నుంచి పాతిక వేల వరకూ సంపాదించుకుంటున్నారు. పర్యాటకులతో మాట్లాడటం, వారికి విక్రయించడం వంటి విషయాల్లో రూప్‌జ్యోతి విలేజ్‌ వీవ్స్‌ బృందం వీరికి సాయపడుతుంది. ఈ ఉత్పత్తులను ఫేస్‌బుక్‌ ద్వారా దేశవ్యాప్తంగానూ విక్రయిస్తున్నారు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని