8వేల మందికి శిక్షణ!
close
Updated : 18/06/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

8వేల మందికి శిక్షణ!

తన చదువుతో మంచి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడపొచ్చు.. కానీ కాంటేకర్‌ మంజుల అలా అనుకోలేదు. ఒంటరి, అభాగ్య మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంది.. ఆ దిశగా తన కృషి వేల జీవితాల్లో వెలుగులు నింపుతోంది...
‘ఆకలితో ఉన్నవాడికి ఓ పూట చేపల కూరతో మంచి భోజనం పెట్టొచ్చు. కానీ రోజూ పెట్టలేం కదా! అందుకుని అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే సరి’... పెళ్లైన కొత్తలో భర్త శ్రీనివాస్‌ అన్న మాటలు మంజులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అవసరంలో ఉన్నవారికి సాయంతో పాటు నైపుణ్యాలని కూడా అందిస్తే అదే వాళ్ల జీవితాల్లో వెలుగు నింపుతుందని నమ్మింది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన మంజుల... తోటివారికి సాయం చేయాలన్న తపనతో మాస్టర్స్‌ ఇన్‌ సోషల్‌ వర్క్‌ (ఎంఎస్‌డబ్ల్యూ) చదివింది. 1999లో పది మందితో శ్రీసాయి ఎడ్యుకేషనల్‌ సొసైటీని ప్రారంభించి.. మహిళలకు కుట్టు, ఎంబ్రాయిడరీ వంటి వాటిలో శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది. భర్త మద్దతు కూడా తోడవ్వడంతో ఆ కార్యక్రమాలను క్రమంగా విస్తృతం చేసింది. మొదట్లో సొసైటీ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. కాలక్రమంలో ఘట్‌కేసర్‌ మండలంతోపాటు నల్గొండ, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లో సొసైటీ కార్యక్రమాలు విస్తరించాయి. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు అందుకుని స్వయం ఉపాధి పొందుతూ నెలకు రూ.12నుంచి రూ.18వేల వరకు సంపాదిస్తున్నారు. దాంతో సొసైటీని నాబార్డు గుర్తించి ఆర్థిక సాయం అందించింది. అప్పటి నుంచి మంజుల వెనుదిరిగి చూడలేదు. టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, జర్దోసి, బంజారవర్క్‌, బ్లాక్‌ ప్రింటింగ్‌లతో పాటు బ్యాగులు, గృహాలంకరణ వస్తువుల తయారీని నేర్పించే వారు. ఇప్పటి వరకు ఈ సంస్థలో సుమారుగా 8 వేల మంది శిక్షణ పొందారు. ఇక్కడి మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు.. దిల్లీ, ఆగ్రా, అలహాబాద్‌, గాంధీనగర్‌లలో మంచి గిరాకీ ఉంది. భర్త శ్రీనివాస్‌ మరణించడంతో ఆయన సోదరులు సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు. శిక్షణ మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా ఉంటోంది మంజుల. ఈ సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రంతో గౌరవించింది.
‘మధ్యతరగతి, పేద మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయించాలన్నదే నా ప్రయత్నం. అందుకే సొసైటీ ఆధ్వర్యంలో మూడు నెలలకోసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తా. అక్కడే శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్నవారికి కుట్టు, ఎంబ్రాయిడరీ, జర్దోసి, బ్యాగుల తయారీలో శిక్షణనిస్తాం. వారి ఉత్పత్తులు అమ్ముకోవడానికి కావాల్సిన భరోసా ఇస్తాం. గతేడాది నుంచి ఇప్పటి వరకు సొసైటీ ద్వారా సుమారు 3 లక్షల వరకు మాస్కులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశాం. పేదలకు ఉచితంగా భోజనం, నిత్యావసర సరకులు పంపిణీ చేశాం. శిక్షణకు వచ్చే మహిళలు చాలా మంది నిరక్షరాస్యులు. అందువల్ల వారికి ఇక్కడ చదువుతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిషు కూడా నేర్పిస్తున్నాం. బ్యాంకులో అకౌంట్‌లు తెరవడం, పొదుపు చేయడం, విత్‌డ్రా వంటి వ్యవహారాలను స్వయంగా చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. దీని వల్ల వారు ఇతరుల మీద ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది’ అంటున్నారు మంజుల.మహిళలు ఏం చేస్తే ఏమవుతుందోనని తెగువ చూపడానికి భయపడితే తర్వాత అంతకంటే పెద్ద విపత్తులే వచ్చిపడతాయి.

- ఎరికా జాంగ్‌, వ్యంగ్య రచయిత్రి


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని