వారితో అమ్మా అని పిలిపిస్తా!
close
Updated : 23/06/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారితో అమ్మా అని పిలిపిస్తా!

వినికిడి లోపం ఉన్న చిన్నారులు..  ఆ సమస్యని అధిగమించి మిగిలిన పిల్లలతో అన్నింటా పోటీపడేలా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్‌ వడ్డాది ఆనంద జ్యోతి. ఈ రంగంలో 29 ఏళ్ల కృషి ఆవిడది. అంతర్జాతీయంగా విద్యారంగంలో చేంజ్‌మేకర్స్‌కి ఏటా అందించే ‘వన్‌మిలియన్‌ వన్‌బిలియన్‌ లీడ్‌ జెడ్‌ టీచర్‌’ అవార్డుకు ఆవిడ నామినేట్‌ అయ్యారు.. ఈ సందర్భంగా వసుంధరతో తన ప్రస్థానాన్ని పంచుకున్నారు...

రాజమండ్రి నుంచి నా దగ్గరకు సింధుని తీసుకొచ్చినప్పుడు తనకు మూడేళ్లు. నేను మూడేళ్లు శిక్షణనిచ్చా. ప్రతి పదాన్నీ పలకడం, రాయడం, చిన్నచిన్న లెక్కలు నేర్పించా. హైదరాబాద్‌లోని ఒక ఎయిడెడ్‌ స్కూల్లో తనను చేర్చుకోవడానికి నిరాకరిస్తే వాళ్లతో మాట్లాడి చేర్పించాను. సింధు బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయింది. పెళ్లి చేసుకుంది. అలాగే గౌరిశ్రీప్రియ. విజయవాడ నుంచి వాళ్లమ్మగారు నాదగ్గరకు తీసుకొచ్చేసరికి అమ్మా, నాన్న అనడం కూడా రాదు. అటువంటి చిన్నారికి నేనిచ్చిన శిక్షణ ఉపయోగపడింది. ఇప్పుడు తను డిగ్రీ పాసైయ్యింది. ఇలా దాదాపు 700 మందికిపైగా శిక్షణనిచ్చాను. చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయి.

మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న అనారోగ్యంతో కన్నుమూసిన వారానికి పుట్టా. అమ్మ నన్ను తీసుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌లోని అమ్మమ్మ దగ్గరకు వచ్చేసింది. డాక్టరు కావాలని కలలు కనేదాన్ని. ఆర్థిక ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు. ఇంటర్‌ అవ్వగానే నా పెళ్లైంది. రెండేళ్లలో ఇద్దరు మగపిల్లలు. ఖాళీగా ఎందుకని ఓ స్కూల్లో రూ.150 జీతానికి టీచర్‌గా చేరా. ప్రైవేట్లు కూడా చెప్పే దాన్ని. ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీలో చేరా. తర్వాత టీచర్‌ శిక్షణ ప్రవేశపరీక్ష రాస్తే మొదటి ర్యాంకు వచ్చింది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం వినికిడి లోపం ఉన్న పిల్లల బోధన కోసం ఓ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఆసక్తి కలిగింది. ఇదీ వైద్యమే కదా అనుకున్నా. సికింద్రాబాద్‌లోని అలీ యావర్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది హియరింగ్‌ హ్యాండీకాప్డ్‌ (ఏవైజేఎన్‌ఐహెచ్‌హెచ్‌)లో ఏడాది కోర్సు చేశాను. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ కోర్సు అయ్యాక ఓ డాక్టరు వద్ద మూడేళ్లు పనిచేశా. ఆ క్లినిక్‌కు వచ్చే పిల్లలకు స్పీచ్‌ థెరపీ చేసేదాన్ని. పంజాగుట్టలోని పాక్షిక వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల ఉండేది. అందులో ఓ ఏడాది పని చేశా. అంతలో అలీ యావర్‌ జంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచే టీచర్‌గా చేరమంటూ పిలుపొచ్చింది. 1992 నుంచి 29 ఏళ్లుగా అక్కడే సేవలందిస్తున్నా.

రెండేళ్ల శిక్షణతో...

వినికిడి శక్తిలేని చిన్నారులను మా ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకొస్తే క్లినికల్‌ టెస్ట్‌లు నిర్వహిస్తాం. ఈ సమస్య ఉన్న మూడేళ్ల వయసు లోపు పిల్లలకు శిక్షణనివ్వడం నా బాధ్యత. ఈ శిక్షణలో తల్లి పాత్ర కూడా కీలకం. పిల్లల నిత్యావసరాలు తీర్చడం నుంచి ఆహారం అందించే వరకు ప్రతి పదం వారితో తల్లి చెబుతూనే ఉండాలి. ఈ దిశగా పిల్లలకూ, తల్లులకూ శిక్షణ ఇస్తా. ఈ శిక్షణ తీసుకున్న పిల్లలు ఏడాదికే 300 పదాలు గుర్తించి, తిరిగి చెప్పడమే కాదు, ఆయా వస్తువులను బొమ్మలతో మ్యాచ్‌ కూడా చేయగలుగుతారు. రెండో ఏడాది శిక్షణలో వారాలు, నెలలపేర్లు... చెప్పడం, రాయడం, వాక్య నిర్మాణం, అంకెలను నేర్చుకుని ఎక్కాలతో చిన్నచిన్న లెక్కలు చేయడం, రంగులు గుర్తించడం, బొమ్మలు వేయడం, కథలు చదవడం, చెప్పడం వంటి అంశాల్లో తర్ఫీదు పొందుతారు. పాఠశాలలో సాధారణ పిల్లలతోపాటు కలిసిపోయేలా శిక్షణ అందుతుంది. ఇతరులు ఏం మాట్లాడుతున్నారో మెషిన్‌తో వింటూ స్పందించేలా తీర్చిదిద్దుతాం. ఈ తరహా ప్రాథమిక శిక్షణ ఆ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేస్తుంది.

ప్రత్యేక సిలబస్‌తో...

ఉద్యోగం చేస్తూనే బీఎస్సీ, బీఈడీ చదివి ఎడ్యుకేషనల్‌ కౌన్సెలింగ్‌లో పీహెచ్‌డీ చేశా. దేశం మొత్తం తిరిగి... సాధారణ పిల్లలు, వినికిడి శక్తిలేని పిల్లల సామర్థ్యాల మధ్య తేడాలను గుర్తించాను. ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా సిలబస్‌ను తయారుచేశా. ఇప్పుడీ సిలబస్‌నే దేశవ్యాప్తంగా మా ఇన్‌స్టిట్యూట్‌ శాఖలన్నింటిలోనూ అనుసరిస్తున్నారు.

ముందే గుర్తిస్తే మేలు...

నిర్లక్ష్యం వల్ల కొంత, అవగాహన లేకపోవడం వల్ల కొంత చాలామంది అమ్మానాన్నలు పిల్లల్లోని లోపాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తుంటారు. రెండేళ్లలోపు గుర్తిస్తే ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. ఒక వేళ ఆలస్యంగా వచ్చినా క్లినికల్‌ టెస్ట్‌లు నిర్వహించి వయసు బట్టి ప్రభుత్వపథకాల ద్వారా శిక్షణకు పంపిస్తున్నాం. సమగ్రశిక్షా అభియాన్‌ పేరుతో ప్రతి మండలంలోనూ ఈ తరహా సమస్య ఉన్న చిన్నారులకు విద్యనందిస్తున్నారు. 18 ఏళ్లు దాటినవారిని మాత్రం ఐటీఐ ట్రైనింగ్‌కు ప్రోత్సహిస్తున్నాం. నా దగ్గర శిక్షణ పొందిన పిల్లలు, వాళ్ల అమ్మానాన్నలు ఫోన్లు చేసి విశేషాలు చెబుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ జీవితానికి ఇంకేం కావాలనిపిస్తుంది.


మంచిమాట

మహిళలు భయం లేకుండా ఉండాలనేది సరికాదు. ఉన్న భయాలను అధిగమించాలి.

- ఎమ్మా వాట్సన్‌, ఆంగ్ల నటి


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని