ఓ అమ్మ... ఏడుగురు అమ్మాయిలు!
close
Updated : 26/06/2021 04:37 IST

ఓ అమ్మ... ఏడుగురు అమ్మాయిలు!

మగపిల్లాడే కావాలన్న అత్తింటి ఒత్తిడితో ఏడుగురు ఆడపిల్లలకు తల్లయ్యిందామె. చిన్న వయసులో భర్త కన్నుమూస్తే... ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. చదువుకోకపోయినా భర్త వ్యాపారాన్ని అందిపుచ్చుకుంది. అడుగడుగునా ఆటంకాలను అధిగమిస్తూ తన పిల్లలందరినీ తీర్చిదిద్దింది. ఈ పోరాటంలో ఆ అమ్మకు సైన్యం ఆ సప్త లక్ష్ములే. ఒకరికొకరు ఆసరాగా సవాళ్లని విజయాలుగా మలుచుకున్న భగవతి వసుంధర తో తన జీవన పోరాటాన్ని పంచుకున్నారు...

ఆడపిల్లలకు చదువు అవసరం లేదు. అత్తింట్లో ఒదిగిపోయి.. మంచి కోడలిగా మెలగడమెలానో తెలిసుంటే చాలు అనుకొనే కుటుంబంలో పుట్టా. ఎనిమిదో తరగతి చదువుకున్నా. మాది అజ్‌మేర్‌. జోధ్‌పుర్‌కు చెందిన మోహన్‌లాల్‌తో 22 ఏళ్లప్పుడు  పెళ్లైంది. తొమ్మిదిమంది అన్నదమ్ములు... 30మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టాను. నాకు ఆడపిల్ల పుట్టిన ప్రతిసారీ అత్తమామలు దెప్పిపొడిచేవారు. మగపిల్లాడు కావాల్సిందే అన్నారు. అలా అబ్బాయి కోసం ఎదురు చూస్తుండగానే ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. ఉష, పూనమ్‌, నీలమ్‌, నిక్కి, కవిత, రీతూ, ప్రియ. వరసగా ఏడు కాన్పులంటే ఊహించండి ఎంత నరకమో. ఓపిక నశించి ఇక పిల్లలు చాలని ఆయనతో చెప్పా. ఇంతమంది ఆడపిల్లలని ఉమ్మడి కుటుంబంలో పెంచడం కష్టమన్నారు అత్తింటివాళ్లు. దాంతో బయటకు వచ్చేశాం. ఆయన మసాలా దినుసుల వ్యాపారం చేసేవారు. నాకు చదువులేదు కాబట్టి కనీసం పిల్లలనైనా చదివిద్దామన్నా. ఆయన సందేహించారు. ‘అవసరమైతే ఒక్క పూటే తిందాం.. పిల్లల్ని మాత్రం చదివించాల్సిందే’ అని పట్టుబట్టా. మొత్తమ్మీద వాళ్లని మంచి స్కూళ్లలో చేర్పించాం. అంతా సజావుగా సాగిపోతోంది అనుకుంటుండగా ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటికి నా వయసు 44.

ఒంటరిగా పయనం...

పిల్లలు... నేను. ఎవరి సాయమూ లేదు. అప్పటికి మా పెద్దమ్మాయికి 20 ఏళ్లు. చిన్నదానికి ఎనిమిది. పిల్లల్ని చదివించాలన్న ఆలోచన తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. ఆయన వదిలివెళ్లిన మసాలా దినుసుల వ్యాపారమే ఆధారమైంది. ఆయన చనిపోయిన మూడోరోజున నా నిర్ణయాన్ని చెప్పా. అత్తగారి కుటుంబం యుద్ధానికి వచ్చింది. ఆడవాళ్లు వ్యాపారమంటూ బయటికెళితే పరువు పోతుందని విరుచుకుపడ్డారు. ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు.వాళ్లతో ‘నా పిల్లల్ని పోషించుకోవాలి... వ్యాపారాన్ని చూసుకోవాల’ని గట్టిగా చెప్పాను. ‘ఇక నీతో మాకే సంబంధమూ లేదు...’ అని తెగదెంపులు చేసుకుని మరీ షాపు తాళాలిచ్చారు.

ఎగతాళి చేసేవారు...

మా దుకాణం జోధ్‌పుర్‌ కూరగాయల మార్కెట్లో ఉండేది. నేను వెళ్లిన మొదటిరోజునే గుసగుసలు... వెకిలి నవ్వులు. తర్వాత అవి ఇంకా పెరిగాయి. నా దగ్గర పని చేయడానికి ఒక్కరూ రాలేదు. అన్ని పనులూ నేనే చేసుకునేదాన్ని. పర్యాటకప్రాంతం కావడంతో విదేశీయులెక్కువగా వస్తారు. నాకేమో ఇంగ్లిష్‌ రాదు. పెద్ద అమ్మాయిలిద్దరూ నాకు అండగా నిలిచారు. వాళ్లు నాతో ఉండేవారు. మిగతా పిల్లలకి బాక్సులు సర్ది స్కూల్‌కు పంపించి షాప్‌కి వచ్చేదాన్ని. మా దుకాణాన్ని వెతుక్కుంటూ వచ్చే వినియోగదారుల్ని చుట్టుపక్కల వ్యాపారులు లేనిపోనివి చెప్పి వెనక్కి పంపేవారు. రకరకాల అడ్డంకులు సృష్టించే వారు. ఇదంతా ఆడవాళ్లం వ్యాపారం చేస్తున్నామనే. ఒక్కోసారి ఏడుపొచ్చేది. నాకు నేనే ధైర్యం చెప్పుకొనేదాన్ని. మా అమ్మాయిలు కూడా ధైర్యం చెప్పేవారు. ఇన్ని కష్టాలమధ్య రెండో దుకాణాన్ని తెరిచాం. అక్కడా ఎదురుదెబ్బే. ఆడదాన్ని కాబట్టి నాకేమీ తెలియదనుకుని దుకాణాన్ని వేరే వాళ్ల పేర్న రిజిస్టర్‌ చేశాడు అమ్మకందారు. ఆ కేసుని కోర్టులో గెలవడానికి అయిదేళ్లు పట్టింది. ఈలోపు పిల్లల బాగోగుల్ని చూసుకుంటూ వ్యాపారాన్ని పెంచుకుని మరో నాలుగు కొత్త దుకాణాలని ప్రారంభించాం. మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నాణ్యమైన మసాలా దినుసులను తెప్పిస్తుంటాం. 50 రకాల దినుసులు, పొడులు, 10 రకాల టీపొడులు, మేం సొంతంగా చేసే 25 రకాల మసాలా పొడులు మొత్తం కలిపి 100 రకాలు విక్రయిస్తున్నాం. నా దగ్గర ఇప్పుడు 50 మంది పని చేస్తున్నారు. ఒకరు ఎంబీఏ, ఇంకొకరు ఇంజినీరింగ్‌ఇలా పిల్లలందరూ పెద్ద చదువులే చదివారు. ఒకరితర్వాత ఒకరు అందరూ వ్యాపారంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. నలుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. నేను, నా పిల్లలు కలిసి సాధించిన విజయాలపై బీబీసీ డాక్యుమెంటరీ తీసింది. మీ జీవితం స్ఫూర్తిదాయకం అంటూ చాలా దేశాల  నుంచి మెసేజ్‌లు వస్తూంటాయి. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటే మీరూ నాలా జీవితాన్ని గెలవచ్చు అంటాన్నేను.
 


మహిళలుగా అభివృద్ధి సాధించాలంటే మనకు మనమే చొరవ తీసుకుని ముందుకు వెళ్లాలి. ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా మెరుగుపరచుకోవాలి.   - బియాన్సె, గాయని, కవయిత్రి


 

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని