రెండు వేలమంది రైతుల్ని కలిశా!
close
Published : 04/04/2021 03:06 IST

రెండు వేలమంది రైతుల్ని కలిశా!

రసాయన ఎరువులు, పురుగు మందులు సాగుని శాసిస్తున్నాయి. పెట్టుబడులు పెరిగినా...దిగుబడులు అంచనాలు తప్పుతున్నాయి. ఈ పరిస్థితులు ఆమెను ఆలోచింప జేశాయి. సేంద్రియ ఎరువులే దీనికి పరిష్కారం అని ప్రగాఢంగా విశ్వసించారావిడ. వాటితో అన్నదాతల తలరాతలను మార్చాలనుకున్నారు. ఆ యజ్ఞంలో భాగంగా వేల మందికి అవగాహన కల్పిస్తున్నారు. కొందరికి ఉపాధినీ అందిస్తున్నారు. ఆమే చిత్తూరు జిల్లాకు చెందిన దండాల విశాలాక్ష్మి

‘పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు విన్నప్పుడల్లా మనసు స్థిమితంగా ఉండేది కాదు. పరిష్కారం గురించి ఆలోచించే దాన్ని. పూర్వం పంటలెలా పండించారు అన్న అనుమానం వచ్చింది. అప్పటి నుంచీ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టా’ అంటారు విశాలాక్ష్మి. ఆ క్రమంలోనే వ్యవసాయంలో వచ్చిన మార్పులు ఎలాంటి ప్రతికూల పరిణామాలకు కారణమయ్యాయో అర్థం చేసుకోగలిగారామె. రసాయనిక ఎరువులతో పెట్టుబడులు పెరగడం, వాటి వినియోగం, అనారోగ్యాలు, దిగుబడి ఇలా అన్నింట్లోనూ జరుగుతోన్న నష్టాన్ని చూసి... ఈ సమస్యలకు పరిష్కారంగా సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. ‘నా ఆలోచనను మా ఆయన ప్రోత్సహించడంతో హైదరాబాద్‌లో సేంద్రియ ఎరువుల తయారీలో శిక్షణ తీసుకున్నా. తిరిగొచ్చాక నంగమంగళంలో మా ఇంటి దగ్గరే తయారీ మొదలుపెట్టా. ఇప్పుడు నెలకు ఇరవై టన్నుల ఎరువుని తయారు చేస్తున్నా’ అంటారు విశాల.

రెండువేల మంది రైతులకు...
ఎందులోనైనా పట్టు సాధించాలంటే ముందు ప్రయోగాలు చేయాలి. అప్పుడే ఫలితాలను సరిగా అర్థం చేసుకోగలమంటారు విశాల. ‘తయారు చేసిన ఎరువును నా పొలంలోనే ప్రయోగించా. అప్పుడు చాలా మంది సేంద్రియ ఎరువుల వల్ల దిగుబడులు పెద్దగా రావని నిరుత్సాహపరిచేవారు. అయినా వెనుకడుగు వేయలేదు. సేంద్రియ ఎరువులు వేసి వరితోపాటు కూరగాయలు, ఆకుకూరల్ని పండించడం మొదలుపెట్టా. అనుకున్న ఫలితాలు రావడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత ఇతర రైతులకూ అవగాహన కల్పించాలనుకున్నా. చిత్తూరు జిల్లాలో సుమారు ఇరవై మండలాల్లోని గ్రామాలన్నీ చుట్టేశా. రెండువేల మందికి పైగా  రైతుల్ని కలిశా’ అని చెబుతారామె.
ఇబ్బందులెన్నో...
మొదట్లో విశాల మాటల్ని ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయినా ఆమె ప్రయత్నం మానలేదు. ‘రైతులుగా మాకు బోలెడంత అనుభవం ఉందని... మహిళగా నీకేం తెలుసనే వారు. నేను మాత్రం అనుభవంతోనే చెబుతున్నా... అని నా పంట దిగుబడుల్ని చూపించే దాన్ని. భూమిలో పెరిగిన సారాన్ని గమనించేలా చేసే దాన్ని. ఇలా నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాకే... ఫలితం కనిపించింది’ అని గతాన్ని గుర్తు చేసుకుంటారామె. క్రమంగా సేంద్రియ ఎరువులకు డిమాండ్‌ పెరగడంతో కొందరు మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టా. ఇప్పుడు నా దగ్గర ముప్పై మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. స్వయంగా తయారు చేసుకుంటామనే రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. ఇప్పటివరకూ ఇలా సుమారు వందమంది సొంతంగా సేంద్రియ ఎరువుల తయారీ చేసుకుంటున్నారు’ అని చెబుతున్నారు విశాలాక్ష్మి. మరో పక్క మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖ బ్రాండ్‌కి అగరుబత్తీల తయారీతో జాబ్‌ వర్క్‌ కల్పిస్తున్నారామె. చిన్నప్పటినుంచీ కష్టపడటం, కొత్తదనం కోసం ఆలోచించడం విశాలాక్ష్మికి అలవాటు. అందుకే డిగ్రీ చదివే రోజుల్లోనే తన కాళ్లపై తాను నిలబడాలన్న ఆలోచనతో గార్మెంట్‌ పరిశ్రమలో పనిచేస్తూ చదువుకున్నారామె. పెళ్లయ్యాక పదెకరాల స్థలంలో వ్యవసాయం చేస్తున్నారు. భర్త ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. వారికి ఇద్దరాడపిల్లలు కిరణ్మయి, మోనిక.

- కృష్ణ కుమారి, తిరుపతి

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి