ఈ సివంగిని చూస్తే హడల్‌
close
Published : 05/04/2021 00:36 IST

ఈ సివంగిని చూస్తే హడల్‌

అడవి పక్కనే పదిహేను గడపలుండే ఓ చిన్న గ్రామం  జమునా టుడూ వాళ్లది. ఓ అర్థరాత్రి... పదిహేను మంది దుండగులు వాళ్ల ఇంటిపై దాడి చేశారు. నిద్రపోతున్న జమున భర్తని కట్టేసి ఆమెకి తుపాకీ గురిపెట్టారు... ‘అడవి గురించి ఆలోచిస్తే... ప్రాణాలు తీసేస్తాం’ అంటూ జమునని తీవ్రంగా హెచ్చరించారు.
ఇది 14 ఏళ్లకిందటి మాట.
భర్తతో కలిసి వెళ్తోన్న జమునపై నలుగురు దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. కొన ఊపిరితో ఉన్న వారిద్దరినీ ‘ఈసారికి  ప్రాణాలతో వదిలేస్తున్నాం, ఇకనైనా అడవి పక్కకు వెళ్లకు’ అని భయపెట్టే ప్రయత్నం చేశారు.
ఇది జరిగి ఏడేళ్లవుతోంది.
రెండు దశాబ్దాలుగా చకూలియా అడవిని కంటికి రెప్పలా కాపాడుతోన్న జమునా టుడూకి ఈ బెదిరింపులు మామూలే. ఎన్నోసార్లు చావు అంచుల వరకూ వెళ్లొచ్చినా ఆమె తన పంథా మార్చుకోలేదు. ఈ జమున కథేంటంటే...
ఝార్ఖండ్‌లోని చకూలియా అటవీ ప్రాంతంలోని అరుదైన వృక్ష, వన్య సంపదను చేజిక్కించుకోవాలని ఏళ్లుగా స్మగ్లర్లు ఎన్నో ఎత్తులు వేశారు. వాటికి పై ఎత్తులు వేస్తూ వారి ఆట కట్టించింది ఈ ఝార్ఖండ్‌ కోడలు. అందుకే అక్కడ అడుగు పెట్టాలంటే అక్రమరవాణాదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కారణమేమంటే.. గొడ్డలి శబ్దం వినబడితే సివంగిలా దండెత్తే ఆమెను చూస్తే వారికి వెన్నులో వణుకు. ఈ సామాన్యురాలు...సాయుధురాలిగా మారడం వెనక పెద్దకథే ఉంది.
జమునది ఒడిశా. పేద కుటుంబం. ఏడుగురు తోబుట్టువులు.  అటవీ ప్రాంతంలో వారి నివాసం. తండ్రికి మొక్కలంటే ప్రాణం. రోజూ ఒక కొత్త మొక్కను నాటి సంతృప్తి పడేవాడాయన. ఆ అలవాటే జమునకూ వచ్చింది. నాన్న స్ఫూర్తితో అడవిపై చిన్నప్పటి నుంచే ప్రేమను పెంచుకుంది. ఆమెకు పద్నాలుగేళ్లున్నప్పుడు తల్లి చనిపోయింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ వయసులోనే భవన నిర్మాణ కూలీగా మారిన జమున జంషెడ్‌పుర్‌కి వలసెళ్లింది. అక్కడే ఝార్ఖండ్‌లోని ముట్టూర్‌గావ్‌కి చెందిన మాన్‌సింగ్‌ టుడూతో పెళ్లయ్యింది. పక్కింటివారితో కలిసి వంటచెరకు కోసం అడవికి వెళ్లిందోసారి. 25 హెక్టార్ల విస్తీర్ణం ఉంటుందా ప్రాంతం. కానీ అక్కడ చెట్లకంటే మోడులే ఎక్కువ కనిపించాయామెకు. వంట చెరకు కోసం చెట్లను నరికేస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ పద్ధతి మాన్పించాలనుకుంది. నరుక్కుంటూ పోతే.... అడవులు కనుమరుగవుతాయని గ్రామస్థులకు నచ్చజెప్పడం మొదలుపెట్టింది.

హత్యాయత్నాలు... దాడులు
జమున ప్రయత్నాలు ఆక్రమార్కులకు కంటగింపుగా మారాయి. దాంతో ఆమెకు చెక్‌పెట్టాలని చూశారు. దాడులు, హత్యాప్రయత్నాలెన్నో చేశారు. అవేవీ ఆమె సంకల్పాన్ని దెబ్బతీయలేదు. ‘అడవిలోకి ఎవరైనా స్మగ్లర్లు వచ్చారని తెలిస్తే...ఎత్తైన ప్రాంతానికి చేరుకుని గట్టిగా అరిచేదాన్ని. మహిళలంతా అప్రమత్తమయ్యేవారు. వంతుల వారీగా అడవికి రక్షణగా నిలబడ్డ మా బృందాన్ని దాటి లోపలికి అడుగుపెట్టడం వారికి కష్టమయ్యేది. ఎన్నోసార్లు మాపై దాడులు చేశారు’ అంటోంది జమున. ఓసారి అక్రమంగా తరలిస్తోన్న కలప రవాణాని ఆపడానికి స్థానిక రైల్వేస్టేషన్‌లో పెద్ద పోరాటమే చేసిందావిడ. అక్రమ రవాణాదారులకు అడ్డం నిలబడిన జమునపై రాళ్ల వర్షం కురిపించారు. తీవ్రగాయాలైనా ఆమె నిలబడిన చోటు నుంచి అంగుళం కూడా కదలకుండానే...వాళ్లను నిలువరించింది. ఇలాంటి సంఘటనలు ఆమె ప్రస్థానంలో ఎన్నో. ఈ ఉద్యమ స్ఫూర్తితో అక్కడి అడవులన్నీ హరితమయంగా మారాయి. ఆ చుట్టుపక్కలే కాదు...ఒడిశా, పశ్చిమబంగ సరిహద్దులో ఉండే అటవీప్రాంతాల రక్షణలో జమునది ప్రధానపాత్ర. ఇప్పటికీ గ్రామాలన్నీ పర్యటిస్తూ మహిళలకు అటవీసంరక్షణపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. కొవిడ్‌ సమయంలోనూ తన లక్ష్యాన్ని వీడలేదామె. ఆవిడ స్ఫూర్తితో ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు పద్దెనిమిది మొక్కలు, అమ్మాయికి వివాహమైతే పది మొక్కలను నాటడం ఓ సంప్రదాయంగా మారిపోయింది. ఎవరైనా చెట్టు నరికితే... రూ.5,001 జరిమానా చెల్లించాల్సిందే. రేపటి తరానికి పర్యావరణాన్ని కానుకగా ఇవ్వాలనే ఈ లేడీ టార్జాన్‌ ఆశయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘పద్మశ్రీ’ అవార్డునిచ్చి సత్కరించింది.

పదివేల సైన్యం..

అడవిని కాపాడుకోవాలనే జమున ఆలోచనకు మొదట్లో మరో ఆరుగురు మహిళలు తోడయ్యారు. ఈ బృందానికి ‘వన్‌ సురక్షా సమితి’ అనే పేరూ పెట్టిందామె. అంతా కలిసి అటవీసంరక్షణను ఉద్యమంలా మొదలుపెట్టారు. చెట్ల దొంగల దాడులను ఎదుర్కొనేందుకు ఆత్మరక్షణకోసం అందరికీ శిక్షణకూడా ఇప్పించింది. వీరంతా రాత్రీ పగలు తేడాలేకుండా కాపలా కాయడం మొదలుపెట్టారు. జమున ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలో వన్‌ సురక్షా సమితి బృందాలు మూడువందలకు పైగానే ఏర్పడ్డాయి. వాటిలో పదివేలమందికి పైగా సభ్యులున్నారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి