సేంద్రియ సాగులో నారీభేరి
close
Updated : 07/04/2021 23:55 IST

సేంద్రియ సాగులో నారీభేరి

ప్రకృతి వ్యవసాయంతో నేలతల్లి నుదుటున పచ్చటి బొట్టు పెడుతున్నారు ఆ మహిళా రైతులు.  ‘మీకెందుకు ఈ వ్యవసాయం... ఏ కారప్పొడులో... పచ్చళ్లో పెట్టుకోక’ అన్న మాటల్ని సవాలుగా తీసుకుని... సేంద్రియ సాగుతో ఉమ్మడిగా లాభాలు గడిస్తున్నారు. జీవితాల్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటున్నారు. వారి విజయగాథను వసుంధరతో పంచుకున్నారా బృంద సభ్యులు.

‘మార్పు కావాలని కోరుకుంటే సరిపోదు...అందుకు తొలి అడుగు మాదే అవ్వాలనుకున్నాం’ అంటారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం... వెంకటాపురం గ్రామంలోని మహిళా బృందం. ‘ఏటికేడు ఏ కూర వండుకున్నా, పండు తిన్నా రుచి తగ్గిపోతుంది ఎందుకో అనుకునేవాళ్లం. క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్న వారి గురించి తెలుసుకున్నప్పుడల్లా...ఆహార ఉత్పత్తుల సాగులో పురుగు మందుల వినియోగం తగ్గితే బాగుండునని మాట్లాడుకునే వాళ్లం. కానీ ఎవరు చేస్తారు? ఎక్కువ దిగుబడులు కావాలంటే...అదే దారి అని రైతులంతా భావిస్తున్నారు. అలాంటి ఆలోచనల్లో ఉన్నప్పుడే... అంటే 2016లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కమ్యూనిటీ మేనేజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ని ప్రారంభించింది. అందుకోసం మా వెంకటాపురం గ్రామాన్ని ఎంపిక చేశారు. కానీ అవగాహనా లేమితో ఎవరూ ముందడుగు వేయలేదు. అయితే అధికారులు చెప్పిన వివరాలు మాకు ఆసక్తిని కలిగించాయి. మేమంతా ఉపాధికోసం వ్యవసాయ పనులూ చేస్తుంటాం. మనమే ఆ పనిచేస్తే అని చర్చించుకున్నాక...సరే అన్నాం’ అంటారు బాపనమ్మ మహిళా స్వయం సహాయక డ్వాక్రా గ్రూపులో ఒకరైన అంకంరెడ్డి సూర్యుడమ్మ. ఈవిడ ఉత్తమ మహిళా రైతుగానూ అవార్డును అందుకున్నారు.

వీళ్లు ఖాళీ స్థలాల్లో, ఇంటి ఆవరణలో పెరటి పంటలు పండించడం ప్రారంభించారు. మెరుగైన ఫలితాలు ఇవ్వడంతో... కొంత పంటను తమకోసం ఉంచుకుని మిగిలినవాటిని బంధువులు, స్నేహితులకు పంచేవారు. తొలుత ఐదెకరాల్లో సేద్యం చేశారు. ఈ విషయం చుట్టుపక్కల ఊర్లకు చేరింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి... ఫలానాది దొరుకుతుందా అని అడిగేవారు. ఇదంతా ఆ మహిళల్లో మరింత ఉత్సాహం కలిగించడంతో... కొందరు సొంత పొలాల్లో, మరికొందరు కౌలుకి తీసుకుని ప్రకృతివ్యవసాయం మొదలుపెట్టారు. ఇలా లాభాలు అందుకోవడమే కాదు...తమ జీవితాల్లోనూ గణనీయమైన మార్పు తెచ్చుకున్నామంటున్నారు. ‘ఒకప్పుడు కూలి పనులు చేసేదాన్ని. ప్రకృతిసాగు నేర్చుకుని ఇంటి పక్కనే కూరగాయలు పండించే దాన్ని. తర్వాత ఎకరంన్నర  కౌలుకి తీసుకుని సేంద్రియ సేద్యం మొదలుపెట్టా. పిల్లల పెళ్లిళ్లు చేశా. ఇల్లూ కట్టుకున్నా’ అని సంతోషపడ్డారు ఈ గ్రూపులోని కారం లక్ష్మి.

ఆరు డ్వాక్రా బృందాలు...
ఒక గ్రూపుతో ప్రారంభమైన సాగు యజ్ఞంలో ప్రస్తుతం ఆరు డ్వాక్రా బృందాలు పనిచేస్తున్నాయి.  మొత్తం 60 మంది మహిళా రైతులు, 72 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అత్యధికంగా వరిని పండిస్తూ, ఎకరాకు 35 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. వరి, కూరగాయలు, బంజరుగా ఉన్న కొండపోడుల్లో మామిడి, జీడి తోటలు వేశారు. పత్తి, చిరుధాన్యాలు, కందులు, పసుపు, అల్లం, చేమదుంపలు వంటి అంతరపంటలూ పండిస్తున్నారు. దిగుబడులు, ఈ పంటలకు ఉన్న డిమాండ్‌ చూసిన ఇతర రైతులూ ముందుకు వచ్చారు. ‘నేను జీడిమామిడి అంతరపంటలుగా చిరుధాన్యాలు, పసుపు వంటివి పండిస్తున్నా. అంతా ‘వ్యవసాయం కలిసి రాదు...ఎందుకీ ప్రయోగాలు’ అన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే మా భవిష్యత్తుని మార్చింది. మా ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అమ్మాయిని వెటర్నరీ మెడిసిన్‌ చదివించగలుగుతున్నా’ అంటోంది తుర్రం సత్యవతి.

మాటలూ పడ్డారు...
వ్యవసాయమంటే ఆదాయం గడించడానికే కాదు.. పదిమందికీ ఆరోగ్యం పంచడానికంటారు ఈ మహిళా రైతులు. అందుకే సామూహిక వ్యవసాయం మొదలెట్టారు. ఆవు పేడ, మూత్రం, పాలు, మజ్జిగ, సెనగపిండి, పాతబెల్లం, పుట్టమన్ను తదితర సహజ ఉత్పత్తులు కలిపి కషాయాలు, ఎరువులు తయారు చేస్తారు. మందు పిచికారీ నుంచి కోతలు పూర్తయ్యేవరకూ కలిసికట్టుగా శ్రమిస్తారు. ఈ ఐదేళ్లలో వెంకటాపురం మహిళలు ప్రకృతి వ్యవసాయంలో నిష్ణాతులుగా మారారు. పక్క గ్రామాలు, మండలాల్లోనూ ఈ సాగు పద్ధతుల మీద అవగాహన కల్పిస్తున్నారు. ‘మొదట్లో పంట తక్కువగా వచ్చేది.. తెగుళ్లకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలి.. ఎలా తయారు చేయాలో తెలిసేది కాదు. మావన్నీ చిన్న కమతాలు. విడివిడిగాకంటే...కలిసి కట్టుగా చేయడం మంచిదని నిర్ణయించుకున్నాం. పంట వేసిన దగ్గర నుంచి కోత కోసేవరకూ...ఒకరికొకరు సాయం చేసుకుంటాం. ప్రకృతి విపత్తులు, తెగుళ్ల వంటివీ తట్టుకుని ఆర్థికంగా బలోపేతమయ్యాం’ అంటున్నారు మంగారత్నం. ఒకప్పుడు పూరి   గుడిసెలో నివాసముండే ఆమె...ఐదేళ్లలోనే సొంతంగా ఇల్లు కట్టుకోగలిగింది. ఈ మహిళల  విజయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం 

ప్రతి స్త్రీ విజయం మరొకరికి ప్రేరణగా ఉండాలి. పైకెదిగిన వారు కింద ఉన్నవారికి చేయిచ్చి పైకి తేవాలి.
   - సెరెనా విలియమ్స్‌

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి