అమ్మమ్మ తీర్చిదిద్దిన మేజర్‌..!
close
Published : 08/04/2021 00:32 IST

అమ్మమ్మ తీర్చిదిద్దిన మేజర్‌..!

పుట్టిన నెల రోజులకే తండ్రికి దూరం.. అమ్మ చెమట చుక్కలు నేర్పిన పాఠం..  నచ్చిన ఆటను, గెలుపు బాటను వెతుకుతూ వచ్చిన ఆ అమ్మాయిని ఓడించి వెనక్కి పంపిన పట్నం.. ఇవేవీ తనపై పెద్దగా ప్రభావం చూపలేదు..కానీ.. ‘‘ఒంటరిగా మీ అమ్మ, నేను నిన్ను పెంచి ఏం లాభం.. ఇదేనా నువ్‌ సాధించేది? అమ్మాయంటే ఆడపులిలా బతకాలి.. అలాగే నడవాలి.. ఇక్కడే ఆగిపోతావా..?’’ అని అమ్మమ్మ అన్న మాటలు ఆమె జీవితాన్నే మార్చేశాయి. ఆంక్షల సంకెళ్లను ఛేదించుకుంటూ మళ్లీ అదే పట్నంలో ఆమెను విజేతగా నిలబెట్టాయి. ఆ మాటలే ఇప్పుడు ఎందరి బతుకుల్లోనో కొత్త వెలుగుల్ని నింపుతున్నాయి. ఇదంతా ఓ మేజర్‌ కథ.. ఎన్‌సీసీ కంపెనీ కమాండర్‌ జయసుధ కథ.. అది ఆమె మాటల్లోనే...

మాది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌. నేను పుట్టిన నెలకే నాన్న దూరమయ్యారు. అమ్మమ్మ ఇంట్లో ఉంటూ అమ్మే మిషన్‌ కుడుతూ నన్ను పెంచారు. చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ, ఏడో తరగతి నుంచే ఫుట్‌బాల్‌ బంతి అంటే ఇష్టం. చిన్నదాన్ని కావడంతో ఎవరూ ఆడనిచ్చేవారు కాదు. ఎనిమిదో తరగతిలో తొలిసారి బంతిపై కాలుపెట్టే అవకాశమొచ్చింది. ఇష్టమున్నా బంతి కొనే డబ్బుల్లేవు. ఆడదామన్నా అమ్మాయిని కదా, నాతో ఆడే వారూ లేరు. తర్వాత కూలీ చేసి ఆ డబ్బుతో బంతి కొన్నా. బడిలో ఉపాధ్యాయుల ఆట చూసి సొంతంగా గోడ ప్రాక్టీస్‌తో నేర్చుకున్నా.
పొలం పనులకు వెళ్తూ... ఈ ఆటలో రాణించాలంటే హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సాప్‌ వసతి గృహానికి వెళ్లమని అయిన వాళ్లు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం పదో తరగతి తర్వాత పరీక్ష రాసి శాప్‌లో ఇంటర్‌లో చేరాను. ఇక్కడ చదువు, ఆట రెండూ ఉండాలి. కానీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యా. ఇంకేముంది... ఇంటికి పంపించేశారు. అమ్మమ్మతో పాటు పొలం పనులకు వెళ్తూ ఏడాది గడిపేశా. అప్పుడే ఊళ్లో వాళ్లు అమ్మమ్మని నా పెంపకం గురించి హేళన చేశారు. ఆవిడ ఓరోజు ఏడుస్తూ.. ఇక్కడితోనే ఆగిపోతావా.. నువ్వేంటో నిరూపించుకోవా అని చెప్పింది. ఆ మాటలు బలంగా నాటుకుపోయాయి. మా ప్రాంతంలోనే ఓ కళాశాలలో ఫుట్‌బాల్‌ శిక్షకురాలిగా చేరాను. అక్కడే డిగ్రీ, బీపీఈడీ చేశాను. అదయ్యాక ప్రకాశ్‌తో పెళ్లి. ఆ తర్వాత జీవితం మారిపోయింది. వ్యాపారం చేసే మా వారి ప్రోత్సాహంతో పీజీ చేశాను. ఖాకీ దుస్తులపై ప్రేమతో ఎన్‌సీసీ వైపు వెళ్లాను. శిక్షణ పూర్తి కాగానే.. 2004లో లెఫ్ట్‌నెంట్‌గా.. 2011లో కెప్టెన్‌గా.. ఇప్పుడు మేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్‌సీసీ అధికారిని.
వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతూ... పేదరికం, అడ్డొచ్చే పెంపకం, ఆంక్షలు.. ఇవన్నీ లక్ష్యాన్ని చేరలేమనే భయంతో మనం సృష్టించుకునే ఊహలే. ఈ విషయాల్ని అమ్మాయిలకు ఎవరు చెప్పాలి? ఆ బాధ్యత నేను తీసుకోవాలనుకున్నా. నేను పడ్డ కష్టం మరెవరూ పడకూడదని... వారికి డ్రిల్స్‌, పరేడ్లు మాత్రమే కాకుండా బతుకు పాఠాలూ నేర్పిస్తున్నా. ఇక్కడే కాదు వందల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పా. ప్రత్యేకంగా నా దగ్గర తర్ఫీదు పొందాలనే లక్ష్యంతోనే మా కాలేజీలో చేరినవారూ ఉన్నారు. ఎదగాలన్న తపన ఉండి... పరిస్థితులు సహకరించని ఎందరో ఆడపిల్లలకు అండగా నిలబడే అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా పల్లెల నుంచి వచ్చి...తెలుగు తప్ప మరే భాషరాదని వెనకడుగు వేసే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వారిని ఎన్‌సీసీలో చేర్చా. చదువుల కోసం పుస్తకాలు కొనిపెట్టా. ఫీజులూ కట్టా. వీరిలో చాలామంది జూడో, అథ్లెటిక్స్‌ వంటి క్రీడల్లో జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతున్నారు. వారిలో మోడల్‌, మిస్‌ ఎర్త్‌ టైటిల్‌ విజేత డా.తేజస్విని మనోజ్ఞ ఒకరు. మృదుల ఇన్‌కంట్యాక్స్‌ అధికారిగా చేస్తోంది. నా దగ్గర శిక్షణ పొందిన వందల మంది అమ్మాయిలు భారత సైన్యం, పోలీస్‌ విభాగాల్లోకి వెళ్లారు. మరెన్నో వృత్తుల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నా కన్నబిడ్డల విజయాల కన్నా వీరు ఎదిగిన తీరు సంతృప్తినిస్తోంది.
2008లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఎన్‌సీసీ అధికారిగా పురస్కారంతో పాటు మరెన్నో అవార్డులు అందుకున్నా. నాకు మొక్కల పెంపకం అన్నా చాలా ఆసక్తి. మా మిద్దె మీద మూడు వందల రకాల చెట్లను పెంచుతున్నా. అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మనమే సృష్టించుకోవాలి. అమ్మాయిలకు  కావలసింది ఆత్మవిశ్వాసం. దాన్ని వదిలేసి తమకు  పరిస్థితులు సహకరించడం లేదనుకోవడం పిచ్చితనమే అవుతుంది.

- అభిసాయి ఇట్ట, హైదరాబాదు

అమ్మాయిలూ...ఎప్పుడూ భయంతో నిర్ణయాలు తీసుకోకండి. ఆశ, అవకాశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి.

- మిషెల్లీ ఒబామా

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి