వైద్యం, సేవ, రచన @ ప్రతిభ!
close
Published : 09/04/2021 00:58 IST

వైద్యం, సేవ, రచన @ ప్రతిభ!

పసిపాపలపై అఘాయిత్యాల వార్తలు విన్నప్పుడల్లా... ఓ తల్లిగా ఆవిడ తల్లడిల్లిపోతారు. ఈ కాలంలోనూ...నెలసరి అపోహలతో అనారోగ్యాల బారిన పడుతోన్న ఆడపిల్లలను చూసి ఆందోళన చెందుతారు. చదువులకు దూరం అవుతున్న అమ్మాయిలను చూసి ఆవేదన పడతారు. ఈ సమస్యల పరిష్కారంలో డాక్టర్‌గా, మహిళగా, అమ్మగా తనవంతు బాధ్యత నిర్వర్తించాలనుకున్నారు. ఆవిడే హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి.
మ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు...ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనుకున్నారు డాక్టర్‌ ప్రతిభ. ఇందుకోసం తెలంగాణలోని మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను ఎంచుకున్నారు. వాటిలో మెదక్‌ జిల్లాలోని కొండపాక ఒకటి. ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఆడపిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ప్రారంభించారామె. చాలా గ్రామాలకు కాలినడకన వెళ్లాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు ఈ డాక్టర్‌. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ముప్పైకి పైగా కళాశాల అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపారు.
పేద విద్యార్థుల కోసం... ప్రతిభ ఉండి చదువుకోలేని విద్యార్థులను ‘రిప్‌లెస్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌’ అనే ఎన్‌జీవో సాయంతో గుర్తించి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నారామె. ఇప్పటివరకూ ఇరవై మంది విద్యార్థులను దత్తత తీసుకుని, వారి అవసరాలను తీర్చారు. ఇందుకోసం రూ.రెండులక్షలకుపైగా ఖర్చు పెట్టారు. ఈ సేవాతత్వం ఆమెకు కాలేజీ రోజుల నుంచీ ఉంది. పేద, అసహాయ మహిళలను ఆరోగ్యపరిరక్షణ, సాధికారత దిశగా నడిపించాలనుకున్నారు. అందుకోసమే ‘వీ ఫర్‌ విమెన్‌’ సంస్థను ప్రారంభించారు. ‘స్త్రీలను పోషకాహారలేమి, రక్తహీనత వంటి సమస్యలు పీడిస్తున్నాయి. వారికి ఆరోగ్యంపై అవగాహన అందించడాన్ని ఓ బాధ్యతగా భావిస్తా. ఇందుకోసం 40కి పైగా  వైద్య శిబిరాలు ఏర్పాటు చేశా. వీటిద్వారా పదివేలమందికి పైగా మహిళలు లబ్ధి పొందారు. తగిన విద్యార్హతలు ఉండి... ఉపాధి దొరకని పదిమంది యువతులకు పని కల్పించా’ అంటారు ప్రతిభ. ప్రస్తుతం ఈ ఎన్జీవో ద్వారా వృత్తివిద్యా శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏడాదిపాటు సెలవు తీసుకోకుండా... డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏడాదిపాటు సెలవు తీసుకోకుండా బాధ్యతలను నిర్వర్తించారామె. కొవిడ్‌ విధుల్లో ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకున్నానని చెబుతారు ‘కరోనా సమయంలో సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలి. అప్పుడు వైద్య విద్యార్థులూ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. కొన్నిసార్లు రోగులతో పాటు వీరికీ కౌన్సెలింగ్‌ చేయాల్సి వచ్చేది. పైగా నాకు ఐదు, ఏడేళ్ల వయసున్న పిల్లలున్నారు. వారికి ఇబ్బంది కలగకూడదని అమ్మదగ్గర ఉంచా. వాళ్లని దగ్గరకు తీసుకోవాలని అనిపించినప్పుడల్లా దూరంగా కారులోనే ఉండి చూసొచ్చేదాన్ని. వృద్ధులైన మా అమ్మానాన్నలకూ కొవిడ్‌ సోకింది. రోజూ విధులు పూర్తయ్యాక వారి బాధ్యతలు చూసుకునేదాన్ని. అయినా మనోనిబ్బరం కోల్పోలేదు’ అని గుర్తుచేసుకున్నారామె. డాక్టర్‌ ప్రతిభ అవసరమైన సందర్భాల్లో గొంతెత్తి నినదించడానికీ వెనుకాడరు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు.  వైద్యులకు పీపీఈ కిట్స్‌ వంటి ప్రాథమిక సౌకర్యాలు కొరవడినప్పుడు వాటి పరిష్కారానికీ ముందున్నారు. ప్రస్తుతం ఆవిడ ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ’ విభాగానికి జనరల్‌ సెక్రటరీ.
నాన్న కలను నెరవేర్చి... ప్రతిభ వాళ్ల అమ్మ విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలు. నాన్న ఉద్యోగి. డాక్టర్‌ కావాలన్న ఆయన కోరికను తీర్చడానికే ప్రతిభ వైద్య వృత్తిని ఎంచుకున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌, గాంధీ వైద్యకళాశాలలో జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ చేశారు. వైద్యం, సేవ మాత్రమే కాదు...డాక్టర్‌ ప్రతిభలో మరో కోణమూ ఉంది. ఆవిడ రచయిత్రి కూడా. ప్రతిభ ఇప్పటివరకూ ముప్పై వరకూ రచనలు చేశారు. కొవిడ్‌ అనుభవాలతో ఆమె రాసిన కథాసంపుటి ‘అనుబంధాలు-మనోభావాలు’ పలువురి ప్రశంసలనూ దక్కించుకుంది. ‘మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటాయి. అప్పుడే వారికి సాధికారత సాధ్యమవుతుంది. అందుకోసం శక్తిమేర కృషి చేస్తాను’ అంటోన్న డాక్టర్‌ ప్రతిభకు పలు పురస్కారాలు దక్కాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని